Top story పని చేయని పోలీసుల పని పడుతున్న చంద్రబాబు శాంతిభద్రతలపై రాజీ పడేది లేదని హెచ్చరిక

శాంతిభద్రతల విషయంలో చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారా ? ఆరు నెలల పాటు వేచి చూసినా సీఎం...పోలీసు బాస్‌లకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చేశారా ? శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల ఆట కట్టించనున్నారా ?

  • Written By:
  • Updated On - November 15, 2024 / 05:41 PM IST

శాంతిభద్రతల విషయంలో చంద్రబాబు సీరియస్‌గా ఉన్నారా ? ఆరు నెలల పాటు వేచి చూసినా సీఎం…పోలీసు బాస్‌లకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చేశారా ? శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తుల ఆట కట్టించనున్నారా ? గత ప్రభుత్వంతో రాసుకొని తిరిగిన పోలీసులను దారిలోకి తెచ్చే పనిలో చంద్రబాబు నిమగ్నమయ్యారా ? మాట వినకపోతే…మార్చేస్తున్నారా ? బదిలీలతో భయం పుట్టిస్తున్నారా ?

ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ వచ్చి ఆరు నెలలు అవుతోంది. ప్రభుత్వ అధికారులు, పోలీసులు, కింది స్థాయి సిబ్బంది…ఇంకా వైసీపీ ప్రభుత్వ హాయాంలో ఉన్నట్లే వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్…విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని పోలీసులు, అధికారులను పదే పదే హెచ్చరిస్తున్నారు. అయినప్పటికీ అటు బ్యూరోక్రాట్లు….ఇటు జిల్లా స్థాయి, మండల స్థాయి అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అటు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను హెచ్చరించారు. హద్దులు మీరితే…చర్యలు తప్పవని క్లారిటీ ఇచ్చారు.

అధికారులు, పోలీసులు…మారుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని రోజులు వేచి చూశారు. అయినప్పటికీ గత ప్రభుత్వంలో ఎలా నడుచుకున్నారో…అలాగే వ్యవహరిస్తూ పోయారు. దీంతో చంద్రబాబునాయుడు చిర్రెత్తుకొచ్చింది. గంజాయి రవాణా, ఎర్రచందనం స్మగ్లింగ్, హత్యలు, హత్యాచారాల విషయంలో సీరియస్ గా ఉన్నారు. గంజాయిని నిర్మూలించాలని భావిస్తుంటే…ఇంకా అక్రమ రవాణా జరుతుండటం ఆగ్రహం తెప్పించింది. దీనికి తోడు వైసీపీ అనుకూలంగా పోలీసులు, ఇతర అధికారులు వ్యవహరిస్తున్నట్లు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో చంద్రబాబు యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు. పలువురు ఐఏఎస్ లు, ఐపీఎస్ లను మార్చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్ గా చిత్తూరు జిల్లాపై ఫోకస్ చేశారు. తిరుపతి ఎస్పీగా సుబ్బరాయుడును నియమించారు. ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత 30 మంది పోలీసులకు నోటీసులు పంపారు. దాదాపు 20 మందిని సస్పెండ్ చేశారు. దీంతో సీఐల నుంచి కానిస్టేబుళ్ల దాకా…దెబ్బ దారిలోకి వచ్చారు.

వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి పంపడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. అరెస్టు చేయకుండా నోటీసులు ఇచ్చి…తప్పించుకుని వెళ్లేలా సహకరించడంపై ఎస్పీ హర్షవర్దన్ రాజుపై వేటు వేశారు. కడప నుంచి ఆయన్ను బదిలీ చేసి…ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు నియమించారు. కొన్ని రోజుల క్రితం డీఐజీ ద్వారకా తిరుమలరావును పిలిపించి…క్లాస్ పీకినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత డీజీపీ…జిల్లా ఎస్పీలకు సీరియస్ ఇన్ స్ట్రక్షన్స్ ఇవ్వడంతో…వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు పెట్టి…అరెస్టులు చేస్తున్నారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడేది లేదని హెచ్చరించారు. ఎక్కడ అత్యాచార కేసులు నమోదైతే…అక్కడికి హోం మంత్రి అనిత వెళ్తున్నారు. బాధితులను పరామర్శించి…భరోసా ఇస్తున్నారు.

2014 నాటి ముఖ్యమంత్రిని కాదని…1995 నాటి సీఎం చూస్తారని…మంత్రులు, పార్టీ నేతలు, ప్రభుత్వ అధికారులకు డైరెక్ట్ గా చెప్పారు చంద్రబాబు. అంటే 1995ల్లో మాదిరిగా చంద్రబాబు వ్యవహరిస్తే…అధికారులు, పోలీసులు, పార్టీ నేతలు ఉరుకులు పరుగులు పెట్టాల్సిందే. ఏ చిన్న ఘటన జరిగినా…నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి వీల్లేకుండా అప్పట్లో చర్యలు తీసుకున్నారు. చంద్రబాబుతో టెలికాన్ఫరెన్స్ అంటే అధికారులు ఫుల్ గా ప్రిపేర్ అయి వచ్చేవాళ్లు. సరైన సమాచారంతో రాకపోతే…అక్కడే అక్షింతలు పడేవి. అందుకే 1995 నాటి సీఎంను చూస్తారని పదే పదే వార్నింగ్ ఇస్తున్నారు. శాంతిభద్రతల వ్యవహారంలో చంద్రబాబుకు మంచి పేరుంది. హత్యలు, అత్యాచారాలు, ఫ్యాక్షన్ హత్యలను పూర్తిగా కంట్రోల్ చేశారు.