వంద రోజుల్లో వందేళ్ళు గుర్తుపెట్టుకునే విజయం, క్రైసిస్ మేనేజ్మెంట్ కింగ్

క్రైసిస్ మేనేజ్మెంట్” తెలుగు రాష్ట్రాల్లోనే కాదు... దేశం మొత్తం ఈ విషయంలో నిపుణుల నోటి నుంచి వినపడే ఒక్కటే పేరు నారా చంద్రబాబు నాయుడు. ఎన్నో సందర్భాల్లో ఈ విషయంలో తాను కింగ్ అని ప్రూవ్ చేసుకున్నారు చంద్రబాబు.

  • Written By:
  • Publish Date - September 19, 2024 / 07:45 PM IST

క్రైసిస్ మేనేజ్మెంట్” తెలుగు రాష్ట్రాల్లోనే కాదు… దేశం మొత్తం ఈ విషయంలో నిపుణుల నోటి నుంచి వినపడే ఒక్కటే పేరు నారా చంద్రబాబు నాయుడు. ఎన్నో సందర్భాల్లో ఈ విషయంలో తాను కింగ్ అని ప్రూవ్ చేసుకున్నారు చంద్రబాబు. రాజకీయ పరమైన అంశాలు పక్కన పెడితే వ్యవస్థలను అత్యంత సమర్ధంగా వాడుకోవడంలో, నిద్ర మత్తులో ఉన్న అధికార వ్యవస్థను ఉరుకులు పరుగులు పెట్టించి క్షేత్ర స్థాయికి సేవలు అందించడంలో చంద్రబాబుకి చంద్రబాబు సాటి. 2015లో వైజాగ్ ప్రజలు హుదూద్ విషయంలో వణికిపోతే… ప్రజలకు విపత్తుకు మధ్యన నిలబడింది చంద్రబాబే.

హుదూద్ దెబ్బకు చిగురుటాకులా వణికిపోయింది సాగర తీరం. అప్పటికి ఆంధ్రప్రదేశ్ కు కనీసం ముఖ్యమంత్రి కూర్చునే కార్యాలయం కూడా సరిగా లేదు. కాని బస్ లోనే వైజాగ్ లో ఉండి పరిస్థితి చక్కబడే వరకు కదలలేదు చంద్రబాబు. అప్పుడు విజయవాడ ఆటో నగర్ నుంచి… భారీ క్రేన్లను వైజాగ్ తరలించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టెట్రా పాల ప్యాకెట్ లు వాటర్ బాటిల్స్ ఇలా ఎన్నో వైజాగ్ వెళ్ళాయి. గాలికి పడిపోయిన భారీ వృక్షాలను కూడా నిలబెట్టారు. పచ్చగా ఉండే వైజాగ్ మోడుబారిపోయింది తుఫాన్ దెబ్బకు. కాని ప్రకృతి ప్రకోపం నుంచి కోలుకునేలా చేసి విశాఖలో మళ్ళీ సాధారణ పరిస్థితికి తెచ్చారు.

ఇప్పుడు బెజవాడ వంతు వచ్చింది. ఒక్క రాత్రి కురిసిన భారీ వర్షానికి బెజవాడ అల్లకల్లోలం అయిపోయింది. ఓ వైపు కృష్ణమ్మ, మరో వైపు బుడమేరు వాగు. ఈ రెండు బెజవాడ ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసాయి. ఇప్పుడు నిలబడింది కూడా చంద్రబాబే. రాష్ట్ర అధికార వ్యవస్థనే కాదు కేంద్రం నుంచి సాయం తీసుకు రావడంలో చంద్రబాబు అదరహో అనిపించారు. ఆదివారం సాయంత్రానికి బుడమేరు కట్ట తెగి సింగ్ నగర్, వాంబే కాలనీ, జక్కంపూడి ఇలా విజయవాడలో దాదాపు 30 శాతం ప్రాంతాన్ని జల మయం చేసింది.

ఆదివారం రాత్రి అక్కడికి వెళ్ళిన చంద్రబాబు తాను ఇక్కడే ఉంటాను అని బస్ లోనే ఉండిపోయారు. ఆ రోజు రాత్రి ఆకస్మిక పర్యటనలు ఉదయం 4 గంటల వరకు చేసారు. వెళ్ళిన కాసేపట్లోనే 2 లక్షల 75 వేల మంది వరద ముంపులో ఉన్నారని లెక్కలతో సహా చెప్పేశారు చంద్రబాబు. ఆ తర్వాత కలెక్టర్ ఆఫీస్ నే ముఖ్యమంత్రి కార్యాలయంగా మార్చారు. ప్రతీ బాధితుడికి అండగా నిలబడే వరకు వదిలేది లేదని పట్టుదలగా పని చేసారు. పని చేయని అధికారులను సస్పెండ్ చేసే వరకు వెళ్ళారు చంద్రబాబు. అదే రోజు సాయంత్రం నాకు ఈ సాయం కావాల్సిందే అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు ఫోన్ చేసారు.

వైజాగ్ నుంచి నేవీ ని రంగంలోకి దింపారు. కేంద్ర సహాయక బృందాలు బెజవాడలో దిగిపోయాయి. ఆరు హెలికాప్టర్ లను రంగంలోకి దించారు. మరో వైపు రాష్ట్ర అధికార యంత్రాంగంలో ఉన్న కీలక అధికారులు అందరూ బెజవాడ వచ్చేశారు. మంత్రులతో కలిసి చంద్రబాబు తాను చేయాలనుకున్న ప్రతీ ఒక్కటి చేసారు. అదే రోజు రాత్రి బెజవాడలో ఉన్న వాటర్ బాటిల్స్, హోటల్స్ లో ఉన్న ఫుడ్, బ్రెడ్ ప్యాకెట్ లు మొత్తం పంపాల్సిందే అని ఆదేశాలు ఇచ్చారు. వెంటనే సింగ్ నగర్ కు అన్నీ తరలించారు.

ఆహారం సప్లై చేయడం వరదలో కష్టం అవుతుంది. మందులు వేసుకునే వాళ్లకు సమస్యలు ఉన్నాయి. ఎవరు ఎక్కడ ఉన్నారో అర్ధం కాని పరిస్థితి. వెంటనే వైద్య శాఖను పూర్తి స్థాయిలో రంగంలోకి దించి అంబులెన్స్ లను సింగ్ నగర్ కు వెళ్ళే అన్ని మార్గాల్లో మొహరించారు. మందుల కిట్ లను పూర్తి స్థాయిలో సప్లై చేసారు. బాధితులకు పవర్ బ్యాంక్స్ కూడా ఇవ్వాలని ఆదేశించారు. డ్రోన్ ద్వారా ఆహార పదార్ధాలను సరఫరా చేసి భేష్ అనిపించారు చంద్రబాబు. వాహనాలు వెళ్ళలేని ప్రాంతాల్లో 40 ద్రోన్స్ రంగంలోకి దించి మందులు ఆహారం పంపించారు. అలాగే జేసీబీల ద్వారా భారీ వాహనాల ద్వారా కూడా ఆహరం పంపించారు.

భవానిపురం టూ సింగ్ నగర్… అక్కడి నుంచి వాంబే కాలనీ, జక్కంపూడి కాలనీ ఇలా కలియ తిరిగారు. మరోవైపు కృష్ణా నది కూడా తన ప్రాంతాపం చూపించింది. కృష్ణ లంక సహా కొన్ని ప్రాంతాలకు వరద వచ్చేసింది. ఆ ప్రాంతాలకు కూడా వెంటనే అధికారులను పంపారు. ప్రద్యుమ్న, ఆర్పీ సిసోడియా సహా కీలక అధికారులకు బాధ్యతలు అప్పగించారు. బాధితులను తరలించే కార్యక్రమం చేపట్టి… వారికి ధైర్యం కల్పించడానికి 22 కిలోమీటర్లు జేసీబీ మీద 4 గంటల పాటు తిరిగారు చంద్రబాబు.

ఆ పర్యటనలో వరదలో కూడా తిరిగి నడిచి బాధితులతో మాట్లాడారు. ఎవరు ఎన్ని విమర్శలు విజయవాడ వరదల విషయంలో చేయాలనుకున్నా సరే చంద్రబాబు మాత్రం తాను చేయాలనుకున్నది పక్కాగా చేసి భేష్ అనిపించుకున్నారు. మంత్రులు నారాయణ, లోకేష్, రవీంద్ర, ఎంపీ చిన్ని సహా పలువురు కలెక్టర్ కార్యాలయంలో, చంద్రబాబు వెంట ఉండి సహకరించారు. ఈ సందర్భంగా కొందరు అధికారులు ఆహార సరఫరాలో ఇబ్బందులు పడుతున్నారు అంటే వెంటనే వారి మీద చర్యలకు సిద్దం అయ్యారు.

ఇక క్రమంగా వరద తగ్గడంతో పెద్ద ఎత్తున బెజవాడకు వివిధ ప్రాంతాల నుంచి ఫైర్ ఇంజన్ లు, జేసీబీలు, వాటర్ ట్యాంకర్ లు, లారీలు, ట్రాక్టర్ లు, టాటా ఏసీలు తెప్పించారు. బురద వెళ్ళిన ప్రతీ ఇంటిని శుభ్రం చేయించారు. ఫైర్ ఇంజన్లను భారీగా వినియోగించి… అదరహో అనిపించారు. ఇక బాధితులకు ఆహార పదార్ధాలను యుద్ద ప్రాతిపదికన అందించారు. రేషన్ సప్ల్లై వాహనాలను సమర్ధవంతంగా వినియోగించుకున్న చంద్రబాబు నాయుడు… బియ్యం బ్యాగ్ లు, కూరగాయలు ఇలా అన్నీ సప్లై చేయించారు. నామ మాత్రపు ధరలకే కూరగాయలను అందుబాటులో ఉంచారు.

బుడమేరు గండ్లు

ఇక ఇదే సమయంలో కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి రప్పించారు చంద్రబాబు. కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వరద బాధిత ప్రాంతాల్లో పర్యటన చేసి అక్కడి సమస్యలను చూసారు. చంద్రబాబు… ఆయనకు స్వయంగా అన్నీ వివరించారు. వరదను కట్టడి చేయడంలో చంద్రబాబు కేంద్ర సహాయాన్ని అడిగారు. ఆ వెంటనే ఆర్మీని బెజవాడలో దింపుతామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. తర్వాతి రోజే ఆర్మీ బుడమేరు గండ్లు పూడ్చే ప్రాంతానికి వచ్చింది. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా పూర్తి కాకపోవడంతో ఆర్మీ పంపాలని కోరారు చంద్రబాబు.

ఇక గేబియన్ బుట్టలను అమర్చి మూడు గండ్లను రోజుల వ్యవధిలో ఆర్మీ పూడ్చింది. ఈ విషయంలో మంత్రి నిమ్మల రామానాయుడు చంద్రబాబుకి బలం అయ్యారు. వర్షం పడుతున్నా సరే రామానాయుడు అక్కడే ఉన్నారు. రాష్ట్ర ఇరిగేషన్ శాఖ, ఆర్మీ సహకారంతో గండ్లు పూడ్చారు. ఇదే సమయంలో మళ్ళీ విజయవాడలో వరద పెరిగే అవకాశం కనపడటంతో అధికారులను అక్కడే ఉంచారు. ఈ మొత్తం విపత్తులో చంద్రబాబు పని చేసింది ఐఏఎస్ అధికారులు, కింది స్థాయి అధికారులతోనే. ఎవరు సాయం చేయడానికి ముందుకు వచ్చినా సరే చంద్రబాబు సాయం తీసుకున్నారు.

ప్రకాశం బ్యారేజ్ బొట్లు…

ప్రభుత్వాన్ని ఇప్పటికి కూడా తలనొప్పి పెట్టె అంశం ఇది. ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకు వచ్చిన పడవలు… ప్రకాశం బ్యారేజ్ గేట్లకు భారీ పడవలు అడ్డం పడటంతో భారీగా వస్తున్న వరద ప్రవాహం కిందకు వెళ్ళడంలో ఆలస్యం జరుగుతోంది. ఆ పడవలు కౌంటర్ వెయిట్ ను ద్వంశం చేయడంతో వెంటనే… జలవనరుల నిపుణులు కన్హయ్య నాయుడుని అక్కడ రంగంలోకి దించారు. రోజుల వ్యవధిలో దెబ్బ తిన్న మూడు కౌంటర్ వెయిట్ లను ఏర్పాటు చేయించారు. ఇక పడవలను తీయడానికి వరద తగ్గిన తర్వాత చర్యలు మొదలుపెడతామని చెప్పి మొదలుపెట్టారు.

ముందు భారీ క్రేన్ ల ద్వారా ప్రయత్నం చేసినా అవి రాలేదు. ఆ తర్వాత వైజాగ్ నుంచి అండర్ వాటర్ కటింగ్ టీం ని రంగంలోకి దించారు. ఆ టీం వచ్చిన తర్వాత కూడా ఇబ్బందులు తలెత్తాయి. పడవలు కట్ చేసినా రావడం లేదు. దీనితో కాకినాడ నుంచి అబ్బులు టీం ని రంగంలోకి దించారు. వీళ్ళ సహకారంతో పడవల తొలగింపు చేపట్టి విజయవంతం అయ్యారు. ఆ పడవల విషయంలో రాజకీయ కోణం కూడా ఉండవచ్చని అందరూ భావించారు. ఆ తర్వాత నిందితులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఈ వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు తాను ఏంటీ అనేది ప్రూవ్ చేసుకున్నారు. విపత్తు వచ్చిన తర్వాత తాను ఏం చేయగలనో 74 ఏళ్ళ వయసులో కూడా చేసి చూపించారు. ఇక చంద్రబాబుకి అన్ని వర్గాల నుంచి మద్దతు లభించడం ఆశ్చర్య పరిచింది. వరద బాధితులకు సామాన్యులు, సినిమా వాళ్ళు, వ్యాపారవేత్తలు అందరూ కలిసి ఏకంగా 350 కోట్ల రూపాయల విరాళం ఇచ్చారు. ఇక వరదల్లో దెబ్బ తిన్న వాళ్ళను ఆదుకోవడానికి ఇన్సూరెన్స్ కంపెనీలతో, ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో స్వయంగా చంద్రబాబు మాట్లాడారు. అలాగే వరద బాధితులకు నష్ట పరిహారంపై కూడా 20 రోజుల్లోపే కేబినేట్ లో నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంలో చంద్రబాబుని రాజకీయంగా విమర్శించినా ప్రజలు మాత్రం వాస్తవాలను స్వయంగా చూసారు. వరదలను లెక్క చేయకుండా స్వయంగా చంద్రబాబు రంగంలోకి దిగి తాను పని చేసి చేయించడం మాత్రం ఆదర్శమే.