నాకు జగన్ లా సొంత మీడియా సంస్థలు లేవు. మీడియా సపోర్ట్ లేదు. గడిచిన 30 ఏళ్లుగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పదేపదే చెప్తున్న మాట ఇదే. ఏ మీడియా సంస్థలో పెట్టుబడులు , సొంత మీడియా సంస్థలు లేకుండా…. భారతదేశంలో 80% మీడియా సపోర్ట్ ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబు. అదే ఆయన గొప్పతనం. తెలుగు మీడియాలో 70 శాతం వాటా ఉన్న కమ్మ యాజమాన్యాలు మొత్తం తెలుగుదేశానికి, చంద్రబాబుకి దన్నుగా నిలబడతాయి. సర్వసక్తులు ఒడ్డీ 40 ఏళ్లుగా టిడిపికి బాసటగా నిలుస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో టిడిపి కూటమి గెలుపుకి కమ్మ మీడియా సంస్థల కృషి చాలా ఉంది. దీనిని ఎవ్వరూ కాదనలేరు. అయితే కూటమి గెలుపు…. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత , ఇప్పుడు ఈ మీడియా శక్తుల ఒత్తిడి చంద్రబాబుపై విపరీతంగా పెరిగిపోయింది. ఏపీ ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడం కన్నా తనకు బాసటగా నిలిచిన మీడియా సంస్థలను , మీడియా పెద్దలను తృప్తి పరచడం పెద్ద టాస్క్ గా మారింది చంద్రబాబుకి.
నాకు టీటీడీ చైర్మన్ పదవి కావాలి. ఇది ఒక మీడియా అధిపతి డిమాండ్. నేను చెప్పిన వాళ్ళకి నామినేటెడ్ పోస్ట్ లు ఇవ్వాలి, ఇది మరో మీడియా అధిపతి డిమాండ్. నాకు ప్రెస్ అకాడమీ చైర్మన్ పోస్ట్ కావాలి .ఒక స్వయం ప్రకటిత సీనియర్ జర్నలిస్ట్ డిమాండ్ ఇది. అసెంబ్లీ, ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ లైవ్ ప్రసారాల కాంట్రాక్ట్ మొత్తం మాకే ఇవ్వాలి. ఇది మరో మీడియా సంస్థ డిమాండ్.
మాకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఎండి పదవి ఇవ్వాలి ఇది వేరొకరి విజ్ఞప్తి. చాన్నాళ్లుగా పెండింగ్ లో ఉన్న ల్యాండ్లకి క్లియరెన్స్ ఇవ్వాలి.
మాకు సలహాదారుల పదవులు కావాలి. నేను చెప్పిన ఎమ్మెల్యే కి విస్తరణలో మంత్రి పదవి ఇవ్వాలి. జగన్ హయాంలో పెండింగ్ లో పెట్టిన మా వాళ్ల బిల్లులు త్వరగా క్లియర్ చేయాలి. ఇలా మీడియా సంస్థలు, మీడియా అధిపతులు, స్వయం ప్రకటిత సీనియర్ జర్నలిస్టులు, సోషల్ మీడియా గ్రూపులు చంద్రబాబుపై ముప్పట దాడి చేస్తున్నాయి. ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు పూర్తికాకుండానే రకరకాల డిమాండ్లు పెడుతున్నాయి. దీనిలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు అధిక భాగం అయితే, కాపు సామాజిక వర్గానికి చెందిన మరికొందరు కూడా ఉన్నారు.
ఒక సాటిలైట్ న్యూస్ ఛానల్ అధిపతి కి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి దాదాపు ఫైనల్ అయిపోయినట్లు సమాచారం. ఈయనకు టీటీడీ చైర్మన్ పదవి కట్టబెడితే జనంలో రాంగ్ మెసేజ్ పోతుందని, పదవుల కోసమే మీడియా లో ఒక వర్గం టిడిపి కి మద్దతు పలికిందనే
వాదన కు మరింత బలం చేకూరుతుందని చంద్రబాబు, లోకేష్ ఇద్దరు ఆ మీడియా అధిపతికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ససేమీరా అనడంతో ఆయన గారికి టీటీడీ చైర్మన్ పదవి దాదాపు ఖరారు అయిపోయింది.
దీంతో మరో మీడియా అధిపతికి ఎక్కడో కాలింది.25 ఏళ్లుగా నేను పార్టీని మోస్తూ… ఎన్నో సంక్షోభాల్లో అండగా నిలబడితే ఇప్పుడు కొత్తగా వచ్చిన మీడియా అధిపతికి అంత ప్రాధాన్యం ఇస్తారా? అంటూ కారాలు మిరియాలు నూరుతున్నాడట ఈ పాత మీడియా అధిపతి.
లోకేష్ తో ఈయనకు ఇటీవల కాలంలో వచ్చిన గ్యాప్ కొత్త సమస్యలు సృష్టించబోతుందని ప్రభుత్వంలోనూ, పార్టీలోను టాక్. ఇప్పటికే ఆ పేపర్ ప్రభుత్వానికి చురకలు అంటించడం మొదలుపెట్టింది. మీరు టిడిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలా రాస్తున్నారు? ఆశ్చర్యంగా ఉందే అని ఎవరైనా ప్రశ్నిస్తే…. న్యూట్రల్ లుక్ కోసం మాకు తప్పడం లేదు అనే సమాధానం వస్తుంది.
అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు, అలాగే ముఖ్యమంత్రి ,మంత్రుల ప్రభుత్వ కార్యక్రమాలు ప్రత్యక్ష ప్రసారం చేసే ఐదేళ్ల కాంట్రాక్టు ఇప్పటికే ఒక మీడియా సంస్థ దక్కించుకుంది. నిజానికి నిజానికి 2014…19 మధ్య మరో పాత మీడియా సంస్థ, ప్రత్యేకంగా ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టి దాన్ని దక్కించుకుంది. కానీ ఈసారి మరో టీవీ ఛానల్ యాజమాన్యం దీన్ని కైవసం చేసుకుంది. అంతటితో తృప్తి చెందకుండా ఇప్పుడు టీటీడీ చైర్మన్ పోస్ట్ కూడా అడుగుతున్నది ఈ సంస్థ.
ఇక నామినేటెడ్ పోస్టుల పండగ మొదలుకాకుండానే, మీడియా సంస్థలు అందులో చొరబడి పోయాయి. ఈ నాయకులకి ఈ నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలంటూ డిమాండ్లు మొదలు పెట్టాయి. ముఖ్యంగా చిత్తూరు, అనంతపురం, ప్రకాశం, గోదావరి జిల్లాల టిడిపి నాయకులు మీడియా ఆధిపతుల ద్వారానే రికమండేషన్ లెటర్లు చంద్రబాబు కి ,లోకేష్ కి పంపిస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు కంటే లోకేష్ చాలా అసహనంగా ఫీలవుతున్నట్లు సమాచారం. అసలు ప్రభుత్వాన్ని మనం నడుపుతున్నా మా…? లేక ఈ మీడియా సంస్థలు అడుగుతున్నాయా..? అని ఒకరిద్దరు సన్నిహితులు దగ్గర లోకేష్ అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.
తన రచనలతో, యూట్యూబ్ వీడియోలతో మీడియాలో ఐదేళ్లపాటు తెలుగుదేశం పార్టీకి సేవ చేసిన సీనియర్ పాత్రికేయుడు నాకు ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందే అంటూ ఇప్పటికే నాలుగు ఐదు సార్లు సిఫార్సు లేఖలు పంపించారట. అయితే ప్రెస్ అకాడమీ పోస్ట్ విషయంలో అటు కమ్మ ఇటు, కాపు జర్నలిస్టులు ఇద్దరూ డిమాండ్ చేస్తూ ఉండడంతో వీళ్ళని ఎలా సర్దుబాటు చేయాలో అర్థం కాక చంద్రబాబు సతమతమవుతున్నారు.
ఐదేళ్లపాటు మేము నానా కష్టాలు పడ్డాం. జగన్ సర్కార్ మమ్మల్ని ఆర్థికంగా దెబ్బతీసింది. మీకు సపోర్ట్ చేసినందుకు పోలీస్ స్టేషన్ల చుట్టూ, సిఐడి ఆఫీసుల చుట్టూ తిప్పింది. మిమ్మల్ని అధికారంలోకి తీసుకురావడానికి రాత్రి పగలు కష్టపడ్డాం. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏదైనా ఆశించడానికి మాకు నైతిక హక్కు ఉంది. ఇలా డైరెక్ట్ గానే
డిమాండ్ చేస్తున్నాయి మీడియా సంస్థలు… మీడియా పెద్దలు.
అయితే మొన్నటి ఎన్నికల్లో టిడిపి తో పాటు కూటమి అభ్యర్థుల ప్రచారం కోసం ఒక్కొక్కరి నుంచి ముక్కు పిండి వసూలు చేశాయి ఈ సంస్థలు. పార్టీ అధిష్టానాలు కూడా దీనికి అంగీకరిస్తూ ఆ మీడియా సంస్థలకు ప్రచారం కోసం చెల్లించండి అంటూ తమ అభ్యర్థులకి ప్రత్యక్షంగానే చెప్పాయి. అయితే ఇక్కడితో తృప్తి పడాల్సిన పని లేదు. ఇంత కష్టపడి గవర్నమెంట్ ని తెచ్చుకున్నాక… ఏమి ఆశించకుండా ఉండడం కూడా అన్యాయం అవుతుంది అన్నది ఈ సంస్థల వాదన.
మరోవైపు నాలుగైదు పెద్ద సోషల్ మీడియా సంస్థలు కూడా చంద్రబాబు లోకేష్ పై ఒత్తిడి పెంచుతున్నాయి. టీవీ చానల్స్ ,పత్రికల కంటే మేము ఎక్కువ మీకోసం పనిచేశాం. సొంతంగా పెట్టుబడులు పెట్టాం. ఆస్తుల అమ్ముకున్నాం. మాకు ఇప్పుడు ఏమీ చేయకపోతే ఎలా? అంటూ నిలదీస్తున్నాయి ఈ సోషల్ మీడియా సంస్థలు. వీటి వెనకున్న ఎన్నారైలు కూడా ప్రభుత్వ పెద్దలకు రకరకాల మార్గాల్లో సందేశాలు పంపుతున్నారు. కాంట్రాక్టులు, వర్క్స్ ఇవన్నీ ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చాలా బెటర్ అని, చెప్తే చేస్తాడని… కానీ చంద్రబాబు నాయుడు నాన్చుడు ధోరణి తో కాలం నెట్టుకొచ్చేస్తాడని…. చివరికి మొండి చేయి చూపిస్తాడని ఈ ఎన్నారైలు ఓపెన్ గానే కామెంట్ చేస్తున్నారు.
ఇక సలహాదారులు పోస్టుల కోసం అయితే సీనియర్ జర్నలిస్టులు, మీడియా పెద్దలు నుంచి వందల్లో అప్లికేషన్లు, రికమండేషన్ లెటర్లు వచ్చేసాయి. జగన్ హయాంలో ఈ సలహాదారుల విషయంలోనే మనం నిత్యం విమర్శిస్తూ వచ్చాం. ఇప్పుడు మళ్లీ లక్షల్లో జీతాలు ఇచ్చి సలహాదారులను పెట్టుకుంటే అదే తప్పు మనం చేసినట్లు అవుతుంది కదా అనే వాదన ప్రభుత్వంలో బాగా వినిపిస్తోంది. కానీ మాకు అవన్నీ అనవసరం, మేం మీకోసం కష్టపడ్డాం.. త్యాగాలు చేసాం మాకు ఏదో ఒకటి ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు మీడియా పెద్దలు . అసలు ప్రభుత్వంలో ఏ ఏ రకాల పోస్టులు, నామినేటెడ్ పదవులు, సలహాదారుల ఉద్యోగాలు ఉన్నాయో ముఖ్యమంత్రికి, డిప్యూటీ సీఎం కి, లోకేష్ కి జాబితాలు కూడా పంపించేస్తున్నారు. వీళ్ళ దూకుడు చూసి పైవాళ్ళకి చెమటలు పడుతున్నాయి అంట. కాపు సామాజిక వర్గం మీడియా సంస్థలు, స్వయం ప్రకటిత సీనియర్ జర్నలిస్టులు నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కూడా ఇదే రకమైన ఒత్తిడి ఉంది. అయితే తక్షణం ఏది అవసరమో అవి మాత్రమే ఇచ్చి మిగిలిన వాటిని ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి ఇద్దాం అనే ఆలోచనలో ఉన్నారు చంద్రబాబు, లోకేష్. మరి అంతవరకు ఈ మీడియా సంస్థలు, పెద్దలు ఓపిక పడతారా లేదా రివర్స్ గేర్ వేస్తారా అన్నది చూడాలి.