నేడు జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి ఆరు పాలసీలు ఆమోదించామన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఏపి ఇండస్ట్రియల్ , క్లీన్ గ్రీన్ ఎనర్జీ, ఏం ఎస్ ఏం ఈ, ఇండస్ట్రియల్ పార్క్స్ పాలసీ సహా ఆరు పాలసీలు ఆమోదించామని తెలిపారు. మరికొన్ని విధానాలు తీసుకువస్తామన్నారు. కేబినేట్ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. జాబ్ ఫస్ట్ అన్నదే మా ప్రభుత్వ నినాదం అని స్పష్టం చేసారు.
ఏపి యువత థింక్ గ్లోబల్, యాక్టు గ్లోబల్ అనే నినాదం తోనే ముందుకు వెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలిపారు. మారుమూల గ్రామంలో కూర్చుని ప్రపంచ దేశాల్లో సేవలు అందించేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం అన్నారు. ఒక కుటుంబానికి ఒక పారిశ్రామిక వేత్త లాంటి నినాదాలతో ఈ విధానాలు రూపొందాయని తెలిపారు. 25 ఏళ్ల ముందు ఐటీ పాలసీ తయారు చేసి రాష్ట్రాన్ని పరుగులు పెట్టించామన్నారు. ఉద్యోగం చేయడం కాదు ఉద్యోగాలు ఇవ్వాలని అప్పట్లోనే నేను చెప్పా అని తెలిపారు.
రాష్ట్ర యువత భవిష్యత్ , రాష్ట్ర భవిష్యత్ ను మార్చేలా ఈ ఆరు విధానాలు ఉంటాయన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ను అమరావతిలో ఏర్పాటు చేస్తామన్నారు. నీతి నిజాయితీ గా 100 దేశాల్లో ఆయన వ్యాపారాన్ని విస్తరించారని కొనియాడారు. అమరావతి లో టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రధాన కార్యాలయం, విశాఖ రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, తదితర ప్రాంతాల్లో ప్రాంతీయ సెంటర్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏపి నాలెడ్జి ఎకానమీ హబ్ గా మారేలా ఒక ఎకో సిస్టం తయారు చేస్తున్నామన్నారు.