సంధ్య థియేటర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ఒకపక్క ప్రాణం పోతున్నా అల్లు అర్జున్ మాత్రం సినిమా హాల్ లో కూర్చుని సినిమా చూస్తున్నాడని… పోలీసులు హెచ్చరించినా అక్కడి నుంచి వెళ్ళలేదు అని రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేసారు. సంధ్య థియేటర్ లోపలికి వెళ్లేందుకు, బయటకు వచ్చేందుకు ఒకే దారి ఉండటంతో సెలెబ్రిటీ వస్తే ఇబ్బందులు తలెత్తుతాయని పోలీసులు అనుమతి ఇవ్వలేదని… అనుమతి ఇవ్వకపోయినా పుష్ప సినిమా హీరో థియేటర్ కు వెళ్లారని రేవంత్ కామెంట్స్ చేసారు.
అతను కేవలం థియేటర్ కు వెళ్లి సినిమా చూసి వెళ్ళిపోతే అభ్యంతరం ఉండేది కాదన్న సిఎం… కానీ థియేటర్ కు వెళ్ళేటప్పుడు రోడ్డుపై కారు రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటూ వెళ్లారని దీంతో పక్కన ఉన్న అన్ని థియేటర్ల నుంచి ఒక్కసారిగా పబ్లిక్ సంధ్య థియేటర్ వైపు రావడంతో ఒక్కసారిగా తోపులాట జరిగిందని తెలిపారు. ఈ ఘటనలో తల్లి రేవతి చనిపోయింది… ఆమె కొడుకు కోమాలోకి వెళ్ళాడన్నారు రేవంత్. అంత తొక్కిసలాటలో కూడా ఆ తల్లి కొడుకు చేయి విడిచిపెట్టలేదని బిడ్డపై తల్లి ప్రేమ అలాంటిదన్నారు సిఎం.
చనిపోయిన విషయం గురించి హీరోకు ఏసీపీ చెప్పినా… శాంతి భద్రతలు చేయి దాటే ప్రమాదం ఉందని చెప్పినా హీరో వినలేదని బయటకు వెళ్లడానికి హీరో ఒప్పుకోలేదని అసహనం వ్యక్తం చేసారు రేవంత్. దీంతో డీసీపీ వెళ్లి అక్కడ నుంచి కదలకపోతే అరెస్టు చేస్తామని హెచ్చరించి హీరోను కారు ఎక్కించారన్నారని… అయినా వెళ్ళేటప్పుడు కూడా కార్ రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేస్తూ వెళ్లారని ఈ నేపథ్యంలో హీరోపై , యాజమాన్యం పై పోలీసులు కేసు పెట్టారని రేవంత్ వివరించారు. బాధ్యత రహితంగా సమాధానాలు ఇవ్వడం వల్లే పోలీసులు వారి విధి నిర్వహించారని పేర్కొన్నారు.
ఈ ఘటనపై కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికత్వం ప్రదర్శించాయన్న సిఎం తన కొడుకు ఆ హీరో అభిమాని అని కొడుకు కోసం ఒక్కో టికెట్ రూ.3వేల చొప్పున రూ.12వేలు పెట్టి ఆ కుటుంబం సినిమా టికెట్లు కొన్నారని… థియేటర్ లో ఒక తల్లి చనిపోతే ఆ కుటుంబాన్ని, ఆ పిల్లవాన్ని హీరో పరామర్శించలేదని వ్యాఖ్యలు చేసారు. అలాంటి మానవత్వం లేని వాళ్ళను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్తే పదేళ్లు మంత్రులుగా పని చేసిన వాళ్లు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని చావుకు కారణమైన వారిని పోలీస్ స్టేషన్ కు పిలిస్తే… తప్పు పట్టి ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఎంతో నీచమైన భాష వాడారని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. ఇక బెనిఫిట్ షోస్ కు అనుమతిచ్చె ప్రసక్తి లేదన్నారు.