Chikoti Praveen: క్యాసినో కింగ్‌గా గుర్తింపు తెచ్చుకున్న చికోటి ప్రవీణ్ రాజకీయం ప్రవేశం చేయబోతున్నారా..? ఆయన బీజేపీలో చేరబోతున్నారా..? తాజా పరిణామాలు చూస్తే ఔననే అనిపిస్తోంది. తాజాగా చికోటి ప్రవీణ్ ఢిల్లీలో తెలంగాణకు చెందిన బీజేపీ కీలక నేతలను కలిశారు. మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, రాంచందర్ రావును చికోటి ప్రవీణ్ కలిశారు. ఈ సందర్భంగా తాను బీజేపీలో చేరాలనుకుంటున్నట్లు ప్రవీణ్ వారికి చెప్పినట్లు తెలుస్తోంది.
తనకు రాబోయే ఎన్నికల్లో బీజేపీ అవకాశం ఇవ్వాలని అడిగారు. అయితే, ఈ విషయంలో అగ్రనేతల నుంచి ప్రస్తుతానికి ఎలాంటి హామీ రాలేదని సమాచారం. హైకమాండ్ పెద్దలను సంప్రదించిన తర్వాత పార్టీలో చేర్చుకునే అంశంపై స్పష్టతనిస్తామని చెప్పినట్లు సమాచారం. దీనికో కారణం ఉంది. ప్రస్తుతం బీజేపీ ఇతర పార్టీ నేతల కోసం చూస్తున్న సంగతి తెలిసిందే. కానీ, చికోటి ప్రవీణ్ విషయంలో మాత్రం తొందరపడటం లేదు. ఆయనపై ఉన్న అభియోగాలు, కేసులే ఇందుకు కారణం. క్యాసినో నిర్వాహకుడిగా చికోటి ఆర్థికంగా ఎదిగారు. అన్ని పార్టీల నేతలతోనూ సత్సంబంధాలు ఆయనపై ఇండియాతోపాటు విదేశాల్లో కూడా కేసులు నమోదయ్యాయి. మన దేశంలో పలు కేసుల్లో ఈడీ, సీబీఐ ప్రవీణ‌్‌ను విచారిస్తున్నాయి. అలాంటిది ప్రవీణ్‌ను బీజేపీలో చేర్చుకుంటే పార్టీకి ఇబ్బందే అని హైకమాండ్ భావిస్తోంది. పార్టీ ఇమేజ్ దెబ్బతింటుందని, విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆలోచిస్తోంది.
అందుకే ప్రస్తుతానికి ప్రవీణ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టింది. హైకమాండ్ అన్ని అంశాలు పరిశీలించిన తర్వాత ఈ విషయంలో నిర్ణయం తీసుకుంటుంది. ప్రవీణ్ చాలాకాలంగా రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. కొంతకాలంగా తన మనసులోని విషయాన్ని బహిరంగంగానే చెప్పాడు. ఇటీవల ప్రవీణ్ మాట్లాడుతూ.. తాను హిందువుగానే పుట్టానని, హిందువుగానే ఉంటానని చెప్పాడు. తాను రాజకీయాల్లో చేరితే.. బీజేపీలోనే చేరుతానని చెప్పుకొచ్చాడు. ఇక ప్రవీణ్ నిత్యం వివాదాలు, విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా బోనాల పండగ సందర్భంగా లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి దర్శనానికి చికోటి ప్రవీణ్ ప్రైవేట్ గన్‌మెన్లతో వెళ్లారు. ఫేక్ లైసెన్స్ ఉన్న గన్‌మెన్లతో వచ్చి హల్చల్ చేయడం వివాదాస్పదవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్ హైదరాబాద్‌తోపాటు గోవా, నేపాల్, థాయ్‌లాండ్ వంటి పలు చోట్ల క్యాసినోలు నిర్వహిస్తున్నాడు.