Arunachal Pradesh: ఇండియాపై చైనా కపట నాటకాలు ఇంకా ఆపడం లేదు. భారత్‌లో అంతర్భాగంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌ను చైనా తమ భూభాగంగా పేర్కొంది. అరుణాచల్ ప్రదేశ్‌తో కలిసి ఉన్న చైనా మ్యాప్‌ను ఆ దేశ ఖనిజ, సహజ వనరుల మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా తమ దేశంలో భాగంగా చూపిస్తూ ఈ మ్యాప్ రూపొందించింది. అంతేకాదు.. ఇరు దేశాల మధ్య వివాదస్పదంగా ఉన్న లడఖ్ విషయంలో కూడా చైనా ఇదే దుర్బుద్ధిని ప్రదర్శించింది. భారత కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్ సమీపంలో ఉన్న ఇండియా-చైనా వాస్తవాధీన రేఖ వద్ద ఉన్న అక్సాయ్ చిన్ ప్రాంతాన్ని కూడా చైనా తమ దేశంలో అంతర్భాగమే అంటూ మ్యాప్‌లో పొందుపరిచింది. ఈ ప్రాంతంలో ఇరు దేశాల సైనికులు విధులు నిర్వర్తిస్తున్నారు.
అలాగే తైవాన్, దక్షిణ సముద్ర తీరం కూడా చైనాలోనే ఉన్నట్లు ఈ మ్యాప్ తెలియజేస్తోంది. భారత్ విషయంలో చైనా ఇలాంటి వక్రబుద్ధి చూపించడం కొత్తేం కాదు. గతంలో కూడా ఇరు దేశాల మధ్య వివాదాస్పదంగా ఉన్న భూ భాగాన్ని, ఏ దేశానికీ చెందని ప్రాంతాల్ని కూడా చైనా తమ భూ భాగంగా చెప్పుకొంది. అయితే, గతంలో అరుణాచల్ ప్రదేశ్‌లోని కొంత భాగంతోపాటు, ఎవరికీ చెందని ప్రాంతాన్ని మాత్రమే చైనా తమదిగా పేర్కొంది. ఈసారి మాత్రం పూర్తి అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్ చిన్ ప్రాంతం వంటి వాటిని కూడా చైనా తమదిగా చూపించింది. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో అంతర్భాగం. లఢక్ ప్రాంతం కూడా మన ఆధీనంలోనే ఉంది. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. అయినప్పటికీ చైనా ఇలా వ్యవహరించడం సంచలనంగా మారింది. దీనిపై భారత్ ఇంకా స్పందించాల్సి ఉంది. చైనా మ్యాప్ దేశాల మధ్య భౌగోళిక సరిహద్దుల్ని వివాదంగా మార్చే అవకాశం ఉంది. ఇండియాతోపాటు తైవాన్, దక్షిణ సముద్ర ప్రాంతాన్ని పంచుకునే దేశాలకు, చైనాకు మధ్య ఉద్రిక్తతలు పెంచే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
దక్షిణ టిబెట్‌ను ఆనుకుని ఉన్న అరుణాచల్ ప్రదేశ్ విషయంలో ఇండియా స్పష్టమైన వైఖరితోనే ఉంది. ఈ ప్రాంతం ఇండియాలో అంతర్భాగం అని అనేకసార్లు నొక్కిచెప్పింది. చైనా తాజాగా విడుదల చేసిన మ్యాప్‌పై తైవాన్, వియత్నాం, ఫిలిప్పైన్స్, మలేసియా, బ్రూనెయ్ వంటి దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. చైనా తమ హక్కుగా చెప్పుకొంటున్న దక్షిణ సముద్రంలో తమ వాటా గురించి ప్రశ్నిస్తున్నాయి. వచ్చే నెలలో జీ20 సమావేశం ఇండియాలో జరగనున్న నేపథ్యంలో చైనా విడుదల చేసిన మ్యాప్ ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే విధంగా ఉంది.