CHITTEM PARNIKA REDDY: మొద‌టి విజ‌యం.. మామ ఓట‌మికి ప్రతీకారం..

ఈ ఎన్నికలలో రామ్మోహన్ రెడ్డి మక్తల్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయగా పర్ణిక రెడ్డి నారాయణపేటలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అయితే.. రామ్మోహన్ రెడ్డి ఓటమి పాలవగా పర్ణిక విజయం సాధించారు. ఇక్క‌డ ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి డీకే అరుణ ప‌ర్ణిక రెడ్డికి మేన‌త్త అవుతారు.

  • Written By:
  • Publish Date - December 6, 2023 / 03:50 PM IST

CHITTEM PARNIKA REDDY: దివంగత నేతల వారసుల లిస్ట్‌లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి.. తొలి ప్ర‌య‌త్నంలోనే స‌క్సెస్ అయిన మ‌రో యువ మ‌హిళా నేత చిట్టెం ప‌ర్ణిక రెడ్డి. నారాయణపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన 30 ఏళ్ల నాయ‌కురాలు పర్ణిక.. మొద‌టిసారి అసెంబ్లీలో అడుగు పెట్ట‌బోతున్నారు. 2016లో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఈమె రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. తాత చిట్టెం నర్సిరెడ్డి మక్తల్ నియోజకవర్గంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2005లో ఆగస్ట్ 15 రోజున జెండా ఆవిష్కరణ చేసిన తరువాత మావోయిస్టులు జరిపిన కాల్పులలో నర్సిరెడ్డి, ఆయన రెండో కుమారుడు, ప‌ర్ణిక రెడ్డి తండ్రి అయిన వెంకటేశ్వరరెడ్డి చనిపోయారు.

REVANTH REDDY: ఆమెకే మొదటి ఉద్యోగం! హామీ నిలబెట్టుకుంటున్న రేవంత్..

ఈ స‌మ‌యంలోనే ప‌ర్ణిక మేన‌మామ కుంభం శివ‌కుమార్ రెడ్డి.. చిట్టెం నర్సిరెడ్డి వారసులను రాజకీయాల్లోకి తీసుకువస్తానని మాటిచ్చారు. ఇక ప‌ర్ణిక తాత నర్సిరెడ్డి మరణం తరువాత జరిగిన ఉప ఎన్నికలలో ఆయన పెద్ద కుమారుడు చిట్టెం రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలిచారు. 2018లోనూ మక్తల్ నుంచి రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచారు. అయితే, ఆ తరువాత ఆయన బీఆర్ఎస్‌లో చేరారు. పర్ణిక రెడ్డికి రామ్మోహన్ రెడ్డి స్వయాన పెద్దనాన్న. ఈ ఎన్నికలలో రామ్మోహన్ రెడ్డి మక్తల్ నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేయగా పర్ణిక రెడ్డి నారాయణపేటలో కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. అయితే.. రామ్మోహన్ రెడ్డి ఓటమి పాలవగా పర్ణిక విజయం సాధించారు. ఇక్క‌డ ఇంకో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమిటంటే.. సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి డీకే అరుణ ప‌ర్ణిక రెడ్డికి మేన‌త్త అవుతారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగానూ పనిచేసిన డీకే అరుణ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కానీ.. ఈ ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు.

అయితే.. చెప్పిన మాట ప్ర‌కార‌మే హైదరాబాద్​లో ఎంబీబీఎస్​ చదివి రేడియాలజిస్ట్​ పీజీ చేస్తున్న పర్ణికారెడ్డిని ఈ ఎన్నికల్లో రాజకీయాల్లోకి తీసుకువచ్చారు కుంభం శివకుమార్​రెడ్డి. రాజ‌కీయాల్లోకి వచ్చీ రావడంతోనే కాంగ్రెస్ ​అధిష్టానం ఆమెకు నారాయణపేట టికెట్ కేటాయించింది. ఇక త‌న గెలుపును స‌వాల్‌గా తీసుకున్న ప‌ర్ణికా రెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయిన​ రాజేందర్​రెడ్డిని 7,950 ఓట్ల తేడాతో ఓడించారు. గత ఎన్నికల్లో రాజేందర్​రెడ్డి.. పర్ణికారెడ్డి మామ కుంభం శివకుమార్​రెడ్డిపై15,600 ఓట్ల తేడాతో గెలవ‌గా.. ఇప్పుడు ఈ ఎన్నిక‌ల్లో అదే రాజేంద‌ర్ రెడ్డిపై గెలిచిన ప‌ర్ణికా రెడ్డి.. త‌న మామ ఓటమికి ప్ర‌తీకారం తీర్చుకున్నార‌ని స్థానికులు చెప్పుకుంటున్నారు. త‌న గెలుపు ఖాయం కాగానే.. తన మామ కుంభం శివకుమార్​రెడ్డిని పట్టుకుని భావోద్వేగంతో ఆనందభాష్పాలు రాల్చడం అక్క‌డి వారి హృద‌యాల‌ను క‌ట్టిప‌డేసింది.