Thummala Nageswara Rao: షర్మిల వర్సెస్ తుమ్మల.. పాలేరు టికెట్ ఎవరికి..?

మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు.. హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. తనకు పాలేరు టికెట్‌ కావాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్‌ కూడా ఓకే చెప్పిందని టాక్. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది.

  • Written By:
  • Publish Date - September 1, 2023 / 12:51 PM IST

Thummala Nageswara Rao: ప్రతీ సీన్ క్లైమాక్స్‌లా అనిపిస్తోంది తెలంగాణ రాజకీయాల్లో ! అటు నుంచి ఇటు.. ఇటు నుంచి అటు.. జంపింగ్‌ జపాంగ్‌లు పీక్స్‌కు చేరుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ అసంతృప్తులంతా.. ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దీంతో గాంధీభవన్‌లో పండగ వాతావరణ కనిపిస్తోంది. అదే సమయంలో ఈ పండగే.. కొత్త లొల్లికి కారణం అవుతోంది. మాజీ మంత్రి, ఖమ్మం జిల్లా కీలక నేత తుమ్మల నాగేశ్వరరావు.. హస్తం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

తనకు పాలేరు టికెట్‌ కావాలని టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి చెప్పినట్లు తెలుస్తోంది. దీనికి కాంగ్రెస్‌ కూడా ఓకే చెప్పిందని టాక్. ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. త్వరలో కాంగ్రెస్‌లో పార్టీని కలిపేందుకు సిద్ధమైన వైటీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా.. పాలేరు టికెట్ కోసం పట్టుపడుతున్నారు. పాలేరు నుంచి పోటీ చేస్తానని గతంలో ప్రకటించారు కూడా..! సోనియాతో పాటు కాంగ్రెస్‌ పెద్దలందరినీ కలిసిన షర్మిల.. పార్టీ విలీనానికి సంబంధించి చాలా డిమాండ్లు వినిపించారు. అందులో ముఖ్యమైనది తనకు పాలేరు టికెట్ కేటాయించాలన్నది కీలకంగా మారింది. దీంతో అసలు చిక్కుముడి వచ్చి పడింది. ఇద్దరిలో ఎవరికి టికెట్ దక్కుతుందన్న దానిపై ప్రతీ ఒక్కరిలోనూ ఉత్కంఠ కనిపిస్తోంది. పాలేరు టికెట్ గురించి తుమ్మలకు రేవంత్ హామీ ఇచ్చారు. షర్మిలేమో.. ఢిల్లీ పెద్దల నుంచి హామీ తీసుకుంది. దీంతో ఈ సమస్యకు సొల్యూషన్ ఎలా అన్నది ఆసక్తికరంగా మారింది. టీడీపీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన తుమ్మల.. ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్, చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వాల్లో మంత్రిగా ఉన్నారు.

ఆ తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరారు. 2014లో మళ్లీ మంత్రి పదవి పొందారు. ఐతే రానున్న ఎన్నికల్లో ఆయనకు బీఆర్ఎస్ టికెట్ నిరాకరించడంతో తుమ్మలను బీజేపీ, కాంగ్రెస్‌లు రెండూ సంప్రదించాయి. ఈ మధ్య ఖమ్మంలో జరిగిన అమిత్ షా బహిరంగ సభలో ఆయన సమక్షంలో బీజేపీలో చేరతారని ఊహాగానాలు వినిపించాయి. ఖమ్మం జిల్లాపై ఆయనకు మంచి పట్టు ఉండడంతో తుమ్మల చేరిక ప్లస్ అవుతుందని కాంగ్రెస్‌ భావిస్తోంది. అందుకే తుమ్మల అడిగినట్టు పాలేరు టికెట్ ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే ఇదే సమయంలో వైటీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కూడా పాలేరుపై దృష్టి సారించడంతో పాటు ఆమె కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉండడంతో పార్టీ ఈ సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపిస్తుందన్నది మిలియన్ డాలర్ ప్రశ్నగా మారింది.