CM Jagan: వైసీపీపై జగన్ పట్టుతప్పిందా? పార్టీలో తిరుగుబాటు తప్పదా? వరుస రాజీనామాలు దేనికి సంకేతం?

ఇప్పుడు కాలం మారుతున్నట్లే కనిపిస్తోంది. ఒకప్పుడు జగన్ మాటే వేదంగా బతికిన నేతలు ఇప్పుడు ఆయనను లెక్కచేయడం లేదు. కొందరు జగన్‪కు ఎదురెళ్తున్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ పరిణామాలు వైసీపీ బలహీనతలను తెలియజేస్తున్నాయి.

  • Written By:
  • Publish Date - April 30, 2023 / 05:27 PM IST

CM Jagan: వైసీపీకి ప్రధాన బలం సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఆయన ఇమేజ్ వల్లే పార్టీ అధికారంలోకి రాగలిగింది. పార్టీలో బలమైన నేతలు, సీనియర్ నాయకులు ఉన్నా.. అంతా జగన్ చెప్పింది వినాల్సిందే. ప్రభుత్వంలో అయినా, పార్టీలో అయినా ఆయన మాటే సుప్రీం. ఆయనకు ఎదురెళ్లే సాహసం కూడా ఎవరూ చేయరు. ఎందుకంటే జగన్ చాలా మొండి. తనకు నష్టమని తెలిసినా నచ్చింది చేయడానికి వెనుకాడరు. అందుకే పార్టీ నేతలు కూడా జగన్ చెప్పినట్లే నడుచుకుంటారు. నచ్చినా, నచ్చకపోయినా జగన్ మాటను శిరసావహిస్తారు. అయితే, ఇప్పుడు కాలం మారుతున్నట్లే కనిపిస్తోంది. ఒకప్పుడు జగన్ మాటే వేదంగా బతికిన నేతలు ఇప్పుడు ఆయనను లెక్కచేయడం లేదు. కొందరు జగన్‪కు ఎదురెళ్తున్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఈ పరిణామాలు వైసీపీ బలహీనతలను తెలియజేస్తున్నాయి. మరోవైపు పార్టీపై జగన్ పట్టుకోల్పోతున్నారేమో అనిపిస్తోంది తాజా పరిణామాలు చూస్తుంటే.
అధికారంలో ఉన్న పార్టీ. అందులోనూ బలమైన సీఎం. ఆయన ఇమేజే పార్టీకి బలం. ఇదీ.. వైసీపీ-జగన్ స్థాయి. సొంత బలం ఎంతున్నా జగన్ బలం కూడా తోడైతే పదవిలోకి రావొచ్చని నేతలంతా భావిస్తారు. అందుకే జగన్ ఏం చెబితే అది వింటూ వచ్చారు. అధికారంలోకి రాగానే జగన్ కొందరికి పదువలిచ్చారు. పదవులు రానివాళ్లు జగన్‌ను ఒక్క మాట కూడా అనలేదు. తర్వాత కొందరిని మంత్రివర్గం నుంచి తప్పించారు. ఇంకొందరికి పదవులిచ్చారు. ఈసారి పదవులు కోల్పోయిన వాళ్లూ.. అసలు ఒక్కసారి కూడా పదవి రాని వాళ్లూ మళ్లీ మౌనంగానే ఉండిపోయారు. జగన్‌కు వ్యతిరేకంగా అస్సలు మాట్లాడలేదంటే జగన్ ఏ స్థాయి బలమైన నేతో అర్థం చేసుకోవచ్చు. జగన్‌కు వ్యతిరేకంగా గొంతెత్తే సాహసం కూడా చేయలేదు. అలాంటిది ఇప్పుడు జగన్‌కు వ్యతిరేకంగా పలువురు ఎమ్మెల్యేలు స్పందిస్తున్నారు. పార్టీ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు.


జగన్ పట్టుకోల్పోయినట్లేనా?
ఏ రాజకీయ నాయకుడి హవా ఎప్పటికీ సాగదు. అందులోనూ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుందంటే నాయకులపై కూడా తిరుగుబాటు మొదలవుతుంది. ప్రస్తుతం జగన్ పరిస్థితి చూస్తే ఇదే అనిపిస్తోంది. ఎన్నికలకు ఇంకా ఏడాది మాత్రమే ఉంది. ఈ సమయంలో ప్రతి ఒక్కరూ తమ రాజకీయ భవిష్యత్ చూసుకుంటారు. తమకు ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ వస్తుందా.. లేదా.. తమ పార్టీ గెలుస్తుందా.. తమ నాయకుడిని నమ్ముకుంటే ఒరిగిందేంటి? ఇలాంటి అన్ని అంశాలు బేరీజు వేసుకుని రాజకీయంగా నిర్ణయం తీసుకుంటారు. పైగా ప్రజల్లో ఆ నాయకుడిపై, పార్టీపై వ్యతిరేకత వస్తోందన్నప్పుడు కూడా నాయకులు వేరే దారి చూసుకుంటారు. అందుకే ఇంతకాలం మౌనంగా ఉన్న నేతలు కొందరు ఇప్పుడు తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. గతంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి.. ఇప్పుడు బాలినేని శ్రీనివాస రెడ్డి జగన్‌కు షాకిచ్చారు. వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి నుంచి బాలినేని తప్పుకొన్నారు. దీంతో ఆయన ఇక వైసీపీకి దూరమైనట్లే అని చెప్పొచ్చు. ఇంతకాలం పార్టీపై, జగన్‌పై అసంతృప్తితో ఉన్న నేతలు ఇప్పుడు క్రమంగా తమ వైఖరి వెల్లడిస్తున్నారు. నేరుగా తిరుగుబాటు చేస్తూ పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నారు.
మరిన్ని తిరుగుబాట్లు తప్పవా?
ఇప్పటికే నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవితోపాటు తాజాగా బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా జగన్‌పై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. ఇంతమంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడం కచ్చితంగా జగన్‌కు షాకిచ్చే అంశమే. వీరితోపాటు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా తిరుగుబాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ పరిస్థితికి కారణమేంటో జగన్ ఆలోచించుకోవాలి. తను చెప్పిందే వేదం అన్నట్లగా ఉన్న జగన్ తన వైఖరి మార్చుకోవాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల మనోభావాలు తెలుసుకునేందుకు ప్రయత్నించాలి.

ఎన్నికలు సమీపిస్తున్న వేళ మొండివైఖరితో నేతల్ని దూరం చేసుకుంటే ఆయనకే నష్టం. ఇప్పటికైనా నేతలతో వరుసగా సంప్రదింపులు జరుపుతూ, వారిని ఆకట్టుకునే ప్రయత్నంచేయాలి. మరోవైపు తమతో చాలా మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని టీడీపీ చెబుతున్న వేళ వైసీపీ మరింత అప్రమత్తంగా ఉండాల్సి ఉంది. లేదంటే మరింత మంది ఎమ్మెల్యేలు క్రమంగా వైసీపీని వీడి ఇతర పార్టీల్లో చేరే అవకాశం ఉంది. ఒకసారి ఈ ట్రెండ్ మొదలైందంటే జగన్ ఇమేజ్ పడిపోతుంది. అది చాలు.. జగన్ పతనానికి.