CM Jagan: టీడీపీని ఓడించేందుకు వైసీపీ సరికొత్త వ్యూహం..! ఆ రెండింటినీ అడ్డుకోగలిగితే జగన్ గెలుపు ఖాయమా?

ఎన్నికలు అంటేనే వ్యూహాలు.. ప్రతివ్యూహాలు. ఎన్నికల్లో గెలవాలంటే ఒక పార్టీ తన బలాలపై దృష్టి పెడితే సరిపోదు. ప్రత్యర్థి బలహీనతల మీదా దెబ్బకొట్టాలి. ఈ పని చేయడంలో ఏపీలో వైసీపీ అధినేత, సీఎం జగన్ దిట్ట. ప్రతిపక్ష టీడీపీకి, జనసేనకు సవాళ్లు విసురుతూ తన వ్యూహంలో చిక్కుకునేలా చేయడంలో జగన్ ముందుంటారు. ప్రతిపక్షాల్ని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తుంటారు. ఇప్పుడు టీడీపీని ఓడించేందుకు సరికొత్త వ్యూహంతో ముందుకురానున్నట్లు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - April 21, 2023 / 07:30 PM IST

ఎన్నికలు డబ్బుమయం అయిపోయాయి. ఎన్నికల్లో గెలవాలంటే ఏ పార్టీ అయినా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. మరోవైపు మద్యం ఏరులైపారాలి. డబ్బు, మద్యం ఎన్నికల ఫలితాల్ని తారుమారు చేయగలవు. అందుకే ఎన్నికల సమయంలో పార్టీలు మద్యం, డబ్బు పంపిణీ చేస్తుంటాయి. ఇవి భారీ స్థాయిలో అధికారులకు పట్టుబడుతుంటాయి కూడా. ఇప్పుడు వీటిపైనే జగన్ దృష్టిపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. టీడీపీకి డబ్బు, మద్యం అందకుండా చేయగలిగితే చాలు.! వైసీపీ సగం గెలిచినట్లే అనే భావనతో జగన్ ఉన్నాడు. ఈ దిశగానే జగన్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతి పార్టీకి ఆర్థిక వనరులు చాలా కీలకం. ఎన్నికల్లో పోటీ చేసే నేతలు కూడా ఆర్థికంగా బలంగా ఉండాలి. ఎన్నికల్లో తగినంత ఖర్చు చేయగలగాలి. దీని కోసం ముందుగానే అన్ని పార్టీలు సిద్ధంగా ఉంటాయి. వివిధ మార్గాల్లో అవసరమైన డబ్బు సమకూర్చుకుంటాయి. ఈ ఆర్థిక వనరుల్ని దెబ్బకొట్టగలిగితే ఆ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఎన్నికల్లో పార్టీ బలహీనమయ్యేలా చేస్తుంది. అందుకే టీడీపీ ఆర్థిక వనరుల్ని దెబ్బతీయాలని జగన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. టీడీపీకి అనుకూలంగా, అనుబంధంగా ఉండే సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన ఆర్థిక వనరులపై జగన్ కన్నేశారు.

ఎన్నికల సమయానికి వీరి ద్వారా టీడీపీకి డబ్బు అందకుండా చేయాలనుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో మద్యం పంచకుండా వ్యూహరచన చేస్తున్నారు. ఎలాగూ ఎక్సైజ్ శాఖ ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. అంటే మద్యం అమ్మకాలు ప్రభుత్వానికి తెలిసే జరగాలి. ఇదే జగన్ ఉపయోగించుకోబోతున్నారా అనిపిస్తోంది. మద్యం అమ్మకాల్లో పారదర్శకత పాటించడమో లేదా నియంత్రించడమో చేస్తే టీడీపీ సహా ప్రత్యర్థి పార్టీలు భారీ స్థాయిలో మద్యం కొనుగోలు చేయకుండా అడ్డుకోవచ్చు. మద్యం, డబ్బు టీడీపీకి అందకుండా చేస్తే సగం విజయం సాధించినట్లే అని జగన్ ఉద్దేశంగా కనిపిస్తోంది. అయితే, మద్యం, డబ్బు ద్వారానే టీడీపీ గెలిచేస్తుందని జగన్ భావిస్తే అది పొరపాటే.

జగన్‌కు తాను అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే ఓట్లు పడేలా చేసి, గెలిపిస్తాయని నమ్మకం. లబ్ధిదారులు ఎలాగూ తనవైపు ఉంటారని అనుకుంటున్నారు. ఇక ప్రత్యర్థి పార్టీలను దెబ్బ తీయడానికి వ్యూహాలు పన్నుతున్నారు. దీనిలో భాగంగానే డబ్బు, మద్యంల విషయంలో తీవ్ర ఆలోచనలు చేస్తున్నారు. అయితే, ఏ ప్రణాళికలతో ముందుకెళ్తారో చూడాలి. ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా ఈనాడు అధినేత రామోజీకి మార్గదర్శి ద్వారా చెక్ పెట్టేశారు జగన్. త్వరలో మరిన్ని వ్యూహాలతో జగన్ ముందుకెళ్లే అవకాశాలున్నాయి. దీంతో ఇప్పుడు టీడీపీకి అండగా నిలబడబోయే వర్గాల్లో ఆందోళన మొదలైంది.