జనాల మద్దతు ఏ మాత్రం తగ్గనివ్వకుండా చూసుకుంటూ… మరోసారి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా.. పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా ప్రారంభించిన పథకమే.. జగనన్నకు చెబుదాం. ఇప్పటికే ప్రతీ ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ప్రతీ ఇంటికి వెళ్లాలని.. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం పెట్టారు. అది ఎలా నడిచింది.. ఎమ్మెల్యేలకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయన్న సంగతి ఎలా ఉన్నా.. ఎమ్మెల్యేలు మాత్రం శక్తికి మించి తిరిగారు గ్రామాల్లో. ఇక జనాలకు జగన్ అంటేనే నమ్మకం ఉండనేలా.. మా నమ్మకం నువ్వే జగన్ అంటూ ఇంటింటికి స్టిక్కర్లని అంటించారు. ఆ కోవాలో ఇప్పుడు జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని ప్రారంభించింది వైసీపీ.
గతంలో స్పందన అనే కార్యక్రమానికి కొనసాగింపే ఈ జగనన్నకు చెబుదాం. స్పందనలో జనాలు వారి సమస్యలపై ఫిర్యాదులు చేస్తే.. జిల్లా కలెక్టరేట్‌లో సమస్యని పరిష్కరించేవి. ఐతే అది పెద్దగా వర్కౌట్ కాలేదు. ఐతే ఇప్పుడు సమస్యలు మరింత వేగవంతంగా పరిష్కారం అయ్యేలా జగనన్నకు చెబుదాం కార్యక్రమం మొదలుపెట్టారు. 1902 నెంబర్ కు ఫోన్ చేస్తే.. డైరెక్ట్ సిఎం ఆఫీసుకు కనెక్ట్ అవుతుంది.. వారే నేరుగా సమస్యలని స్వీకరించి.. పరిష్కరించడానికి చూస్తారు. పరిష్కారం అయ్యే వరకు ఫిర్యాదు చేసిన వారికి అందుబాటులోనే ఉంటారు.
సమస్యని పరిష్కరించి..ప్రభుత్వ పనితీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకుంటారు. ఇలాంటి చాన్స్ కోసం ఎదురుచూస్తున్న జనాలు.. తమ ఫోన్‌లకు పని చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయ్. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున సమస్యలు వెల్లువెత్తే అవకాశాలు ఉన్నాయ్. ఇదే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతోంది. నిజానికి గడపగడపకు కార్యక్రమంలో ప్రతీచోట ఎమ్మెల్యేలకు పరాభవమే ఎదురైంది. సమస్యల పరిష్కారం ఎక్కడ అంటూ కొందరు జనాలు కొన్నిచోట్ల నిలదీస్తే.. మరికొన్ని చోట్ల ఏకంగా గొడవలు పెట్టేసుకున్నారు.
నిజానికి రాష్ట్రంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి వసతులు అందించడంలో.. సర్కార్ విఫలం అవుతోంది. ఇప్పుడు వాటన్నింటిపై ఫిర్యాదులు అందే అవకాశం ఉంది. అదే జరిగితే.. ఎమ్మెల్యే పనితీరు ఏంటో.. వాళ్ల అసలు బాగోతం ఏంటో అన్నీ బయటకు వచ్చే చాన్స్ ఉంది. ఇదే ఇప్పుడు వారి టెన్షన్‌కు ప్రధాన కారణం అవుతోంది. ఏమైనా జగనన్నకు చెబుదాం అంటూ ఓ టోల్‌ఫ్రీ నంబర్ ఇచ్చారు. జనాల సమస్యలతో ఆ ఫోన్ పగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.