CM Jagan: సమస్యల వలయంలో జగన్‌.. వైసీపీకి బ్యాడ్‌టైమ్ స్టార్ట్ అయిందా..?

ఓవైపు వివేకా హత్య కేసు.. మరోవైపు షర్మిలతో ఇంటిపోరు.. ఇంకోవైపు దగ్గరవుతున్న చంద్రబాబు, పవన్.. వీటన్నింటి మధ్యలో కోడికత్తి కేసు.. వ్యక్తిగతంగా, రాజకీయంగా వరుస సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు జగన్! ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రతీ ప్రయత్నం.. బూమరాంగ్ అవుతోంది.

  • Written By:
  • Publish Date - May 11, 2023 / 03:05 PM IST

CM Jagan: సమస్యలు దాటినప్పుడే బలం బయటడుతుంది.. బంధాలు తెలుస్తాయి అంటారు పెద్దలు. ఈ మాట ఏ రంగానికైనా వర్తిస్తుంది కానీ.. రాజకీయానికి మాత్రం కాదు. ఒక సమస్య ఉద్ధృతం అయితే.. పార్టీని, పనితనాన్ని పదేళ్లు వెనక్కి నెట్టేస్తుంది. జగన్ ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారిప్పుడు ! ఓవైపు వివేకా హత్య కేసు.. మరోవైపు షర్మిలతో ఇంటిపోరు.. ఇంకోవైపు దగ్గరవుతున్న చంద్రబాబు, పవన్.. వీటన్నింటి మధ్యలో కోడికత్తి కేసు.. వ్యక్తిగతంగా, రాజకీయంగా వరుస సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు జగన్! ఈ సమస్యల నుంచి బయటపడేందుకు చేస్తున్న ప్రతీ ప్రయత్నం.. బూమరాంగ్ అవుతోంది. మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది.

సమస్యల ఊబిలో కూరుకుపోయేలా చేస్తోంది. ఒక సమస్య.. మరో సమస్యకు దారి తీస్తూ.. ఇంకో పెద్ద సమస్య అయి కూర్చుంటోంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్‌.. వివేకా కేసే! కేసును పక్కదారి పట్టించేందుకో.. జిల్లాలో వైఎస్‌ కుటుంబం హవా తగ్గొద్దనో.. మరో కారణమో కానీ.. వైసీపీ శ్రేణులు వివేకా రెండో పెళ్లి అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారు. దీంతో షర్మిల రియాక్ట్ కావాల్సి వచ్చింది. ఇప్పుడు వెనక ఉండి.. సునీతను షర్మిల ముందుకు నడిపిస్తూ.. జగన్‌కు సవాల్‌ విసురుతున్నారు. ఇక అయిపోయిందనుకున్న కోడికత్తి కేసు.. ఇప్పుడు మళ్లీ మెడకు చుట్టుకుంటోంది. కోడి కత్తి నిందితుడికి, టీడీపీకి సంబంధం లేదని స్పష్టం చేసిన ఎన్‌ఐఏ.. తమ నివేదికతో జగన్‌ను ఇబ్బంది పెట్టింది. అసలు దీని వెనుక కుట్ర లేదని తేల్చేసింది. ఐతే కేంద్రంతో లాబీయింగ్‌ చేసో.. ఇంకా ఏదైనా అవస్థలు పడో.. ఇవన్నీ సెట్ చేయొచ్చులే అనుకుంటే.. టీడీపీ, జనసేన పొత్తు జగన్‌ను మరింత టెన్షన్‌ పెడుతున్న పరిస్థితి. పవన్ కల్యాణ్ ఎటువైపు ఉంటారన్న దాని మీదే.. ఏపీ రాజకీయం అడుగులు ఆధారపడి ఉంటాయి.

బీజేపీ దాదాపు గుడ్‌బై చెప్పిన టీడీపీతో దోస్తీకి ఓకే చెప్పారు. ఒకసారి చంద్రబాబు ఆయనను కలిస్తే.. రెండుసార్లు ఈయన చంద్రబాబును కలిశారు. బీజేపీకి దాదాపు బ్రేకప్‌ చెప్పేద్దాం అనుకున్న సమయంలో కేంద్రం నుంచి పెద్దలు పిలిచి పవన్‌తో మాట్లాడారు. దీంతో పొత్తుల కహానీకి కాస్త బ్రేక్‌ పడింది. ఐతే చంద్రబాబు, పవన్ కలిసి పోటీ చేయడం చేయడం దాదాపు ఖాయం. ఇదే ఇప్పుడు జగన్‌ను మరింత టెన్షన్‌ పెడుతోంది. ఆ రెండు పార్టీలు కలిస్తే.. వైసీపీకి గడ్డు పరిస్థితులు తప్పవు. ఈ సమస్యలు అన్నీ ఒకెత్తు అయితే.. రాష్ట్ర ఆర్థిక సమస్యలు మరొక ఎత్తు. ఏ ఉచితాలతో జనాల మనసులు గెలవొచ్చు అనుకున్నారో.. ఆ ఉచితాలే జగన్‌ కొంప ముంచేలా కనిపిస్తున్నాయి. అన్నీ ఫ్రీ అని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దాదాపు దివాళా తీయించేశారు జగన్.

ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఒకటో తారీఖు వచ్చిందంటే.. అప్పుల కోసం ఆర్బీఐ వైపు అమాయకంగా చూడాల్సి వస్తోంది. వీటన్నింటికి తోడు ఎమ్మెల్యేలపై జనాల్లో పెరిగిపోతున్న వ్యతిరేకత.. ప్రజాప్రతినిధి కనిపిస్తే డైరెక్ట్‌గానే నిలదీసేస్తున్నారు జనాలంతా! ఏం చేయాలో తెలియక.. ఎలాంటి అడుగులు వేయాలో అర్థం కాక.. జగన్‌ తల పట్టుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. వైసీపీకి బ్యాడ్‌టైమ్ త్వరగానే స్టార్ట్ అయిపోయిందా అనిపిస్తోంది ఈ సమస్యలను చూస్తుంటే!