Bandar Port: మూడోసారి బందరుపోర్టు శంకుస్థాపన.. ఏపీలో విచిత్ర రాజకీయాలు.. నిర్మించేది లేదా?

బందరు పోర్టు అక్కడి ప్రజల దశాబ్దాల కల. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పోర్టు నిర్మాణానికి మొదటిసారి శంకుస్థాపన చేశారు. చంద్రబాబు నాయుడు 2019లో ఈ పోర్టుకు రెండోసారి శంకుస్థాపన చేశారు. జగన్ ఈ పోర్టుకు మూడోసారి శంకుస్థాపన చేశారు.

  • Written By:
  • Publish Date - May 22, 2023 / 04:30 PM IST

Bandar Port: ఏపీలో రాజకీయాలు నిజంగా విచిత్రంగా ఉంటాయి. ఒకసారి శంకుస్థాపన జరిగిన ప్రాజెక్టుకు మళ్లీ శంకుస్థాపనలు చేస్తుంటారు అక్కడి నేతలు. ఇప్పటికే రెండుసార్లు శంకుస్థాపన జరిగి, పని మొదలుకానిది బందరు పోర్టు. దీనికి ముచ్చటగా మూడోసారి శంకుస్థాపన చేశారు ఏపీ సీఎం జగన్. ఈ సారైనా తమ కల నెరవేరుతుందా? లేదా? అనే ఆశ-నిరాశల మధ్య ఊగిసలాడుతున్నారు అక్కడి జనాలు. శంకుస్థాపనలే తప్ప పోర్టు నిర్మాణం పూర్తయ్యేది లేదని ప్రజలు అభిప్రాపడుతున్నారు.
బందరు పోర్టు అక్కడి ప్రజల దశాబ్దాల కల. ఈ పోర్టు అందుబాటులోకి వస్తే స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రజల ఆదాయం మెరుగవుతుంది. జీవితాలు మారిపోతాయి. అందుకే ప్రజలంతా బందరు పోర్టు నిర్మాణం త్వరగా పూర్తి కావాలని స్థానికులు కోరుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం ఆలోచన ఇప్పటిది కాదు. చాలా ఏళ్ల నుంచి ఈ దిశగా ప్రయత్నాలు సాగుతున్నాయి. 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ పోర్టు నిర్మాణానికి మొదటిసారి శంకుస్థాపన చేశారు. అయితే, ఆ తర్వాత ఏడాది ఆయన మరణించడం, ప్రాంతీయోద్యమాలు వంటి వివిధ కారణాలతో ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆ తర్వాత ఏపీ విభజన జరిగి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. 2014లో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చారు.

ఆయన మరుసటి ఎన్నికలకు ముందు 2019లో ఈ పోర్టుకు రెండోసారి శంకుస్థాపన చేశారు. అయితే, అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. వైసీపీ గెలిచి, జగన్ సీఎం అయ్యారు. ఆయన కూడా ఇంతకాలం పోర్టు గురించి పట్టించుకోలేదు. చివరకు ఎన్నికలు మరో ఏడాది మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ పోర్టుకు మూడోసారి శంకుస్థాపన చేశారు. సోమవారం ఉదయం ఈ కార్యక్రమం పూర్తైంది. ఇలా ఒకే ప్రాజెక్టుకు మూడు సార్లు.. ముగ్గురు ముఖ్యమంత్రులు శంకుస్థాపనలు చేయడం బహుశా దేశంలోనే ఇదే తొలిసారేమో. సీఎంలు, ప్రభుత్వాలు మారినప్పుడల్లా శంకుస్థాపనలు జరుగుతున్నాయే తప్ప.. పోర్టు నిర్మాణం మాత్రం పూర్తవడం లేదు.


ఈ సారైనా పూర్తవుతుందా?
సీఎం జగన్ పోర్టు విషయంలో నాలుగేళ్లు స్తబ్దుగా ఉన్నారు. ఎన్నికలు మరో ఏడాది ఉందనగా శంకుస్థాపన చేశారు. అయితే, జగన్ నిజంగా చిత్తశుద్ధితో, పోర్టు పూర్తి చేసే ఉద్దేశంతోనే శంకుస్థాపన చేశారా.. లేక ఎన్నికల్లో లబ్ధి కోసం హడావుడిగా శంకుస్థాపన చేశారా అని సందేహాలు వెల్లవెత్తుతున్నాయి. గతంలో పలు ప్రాజెక్టుల్ని జగన్ ఘనంగా ప్రారంభించినప్పటికీ పూర్తి చేయలేకపోయారు. ఏపీ ప్రజలు ఎప్పట్నుంచో కోరుకుంటున్న పోలవరం ఇంకా పూర్తి కాలేదు. ఇలా జగన్ ప్రారంభించి వదిలేసినవి.. రెండోసారి ప్రారంభించినవి కూడా ఎన్నో ఉన్నాయి. ఏదో హడావుడిగా ప్రారంభించడాలే తప్ప పూర్తి చేసేందుకు తగ్గ ప్రణాళికలు లేవు. నిధుల కేటాయింపులు లేవు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని మాత్రం ప్రతిపక్షాల్ని తిట్టేందుకు సీఎం గొప్పగా వాడుకుంటారు. అలాగే తామే ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతుంటారు. కానీ, నాలుగేళ్లైనా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయినందుకు తనను తాను ప్రశ్నించుకోకుండా ప్రతిపక్షాలపై నిందలు వేస్తుంటారు. పోనీ ఎప్పటికి పూర్తవుతుందో చెప్పరు. ఏపీలో ఇంతే.. ఎన్నికలొస్తున్నాయంటే ప్రాజెక్టుల్ని ఘనంగా ప్రారంభిస్తారు. కానీ, పూర్తి చేయరు.
రూ.5 వేల కోట్ల ప్రాజెక్టు 
బందరు పోర్టు నిర్మాణానికి రూ.5,156 కోట్లు అవసరమవుతాయని అంచనా. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. దీన్ని రెండేళ్ల నుంచి రెండున్నరేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది. పోర్టు కోసం ఇప్పటికే భూసేకరణ పూర్తైనట్లు సీఎం చెప్పారు. అన్ని అనుమతులు, ఫైనాన్షియల్ క్లోజర్ అయిన తర్వాతే దీన్ని ప్రారంభించారు. తెలంగాణలో కాళేశ్వరం నిర్మించిన మేఘా సంస్థ ఈ పోర్టును కూడా నిర్మించబోతుంది.