CM Jagan: కడపపై జగన్ ఫుల్ ఫోకస్.. నేతలకు వార్నింగ్.. ఆ పనులు చేయొద్దంటూ హెచ్చరిక

న్నామని భావించిన కడప జిల్లాలో ఓడిపోవడంతో జగన్‌కు భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా నేతలతో భేటీలు జరుపుతున్నారు. అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు.

  • Written By:
  • Publish Date - July 12, 2023 / 09:49 AM IST

CM Jagan: ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్ పూర్తిగా రాజకీయాలపై దృష్టిసారించారు. ప్రస్తుతం సొంత జిల్లా అయిన కడపలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అవినీతి, అక్రమ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని పార్టీ నేతలను హెచ్చరించారు. ఎన్నికలకు మరో ఏడాదికంటే తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో కడప జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేయాలని జగన్ భావిస్తున్నారు. దీనిలో భాగంగా మూడు రోజులు కడపలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా పార్టీ అంతర్గత విషయాలు, రాజకీయ నేతల వ్యవహారాలపై కూడా దృష్టిపెట్టారు. పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. కడప జిల్లా వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉండేది. జిల్లాలో తమకు ఎదురే లేదనుకున్నారు. అయితే, గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగలింది. రాయలసీమ పరిధిలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి రాంగోపాల్ రెడ్డి విజయం సాధించారు. పైగా ఆయన సీఎం సొంత నియోజకవర్గమైన పులివెందుల నుంచి గెలుపొందారు. బలంగా ఉన్నామని భావించిన కడప జిల్లాలో ఓడిపోవడంతో జగన్‌కు భారీ షాక్ తగిలింది. ఈ నేపథ్యంలో జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టి సమీక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా నేతలతో భేటీలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్‌తో జగన్ మాట్లాడారు. ప్రజా సమస్యల్ని వీలైనంత త్వరగా పరిష్కరించడంపై దృష్టిపెట్టాలని సూచించారు.

మరోవైపు కడప జిల్లాలో నేతలు రియల్ ఎస్టేట్ దందాలు, భూ కబ్జాలు, హత్యలకు పాల్పడుతున్నారని, ఇలాంటివాటికి దూరంగా ఉండాలని హెచ్చరించారు. ఇటీవల కడప జిల్లాలో రియల్ ఎస్టేట్‌కు సంబంధించి కొన్ని వివాదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. కిడ్నాప్‌లు, హత్య ఘటనలు కూడా జరిగాయి. అందుకే ఇలాంటి వాటిలో చిక్కుకుని పార్టీ ఇమేజ్ దెబ్బతీయొద్దని జగన్ పార్టీ నేతల్ని హెచ్చరించారు. కడప ఇంఛార్జిగా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి ప్రస్తుతం ఇక్కడి వ్యవహారాల్ని పర్యవేక్షిస్తున్నారు. అయితే, వివేకానంద హత్య కేసులో ఆయన కోర్టుల చుట్టూ తిరుగుతుండటంతో పార్టీ వ్యవహారాలు గాడితప్పినట్లుంది. అందుకే ఈసారి నేరుగా జగన్ ఈ వ్యవహారంపై దృష్టి సారించారు.