రాజకీయంలో అలా కాదు కదా ! ఏం చెప్పాలని అనుకుంటున్నామో.. ఎవరి గురించి చెప్పాలి అని భావిస్తున్నామో.. జనాలకు పక్కాగా రీచ్ అయ్యేలా మాట్లాడాలి. స్పీచ్ వెయిట్ ఉండాలి.. పదాలు గట్టిగా పడాలని.. మాట్లాడే వాళ్లకే అర్థం కాని, నోరు తిరగని పదాలు వాడితే.. మొదటికే మోసం వస్తుంది. రాసిచ్చారు కదా అని.. రాసింది రాసినట్లు చదివితే.. జనాలు గందరగోళంలో పడిపోతారు. ఇప్పుడు జగన్ విషయంలో జరుగుతోంది అదే ! జగన్ మాట్లాడుతున్నది తెలుగా.. సంస్కృతమా.. లేదంటే రెండింటిని మిక్స్‌లో వేసి.. మిక్స్‌డ్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారా.. ఆయన మాట్లాడే మాటలకు ఆయనకు అయినా అర్థం తెలుసా అనిపిస్తోంది.. వరుస ప్రసంగాలు చూస్తుంటే ! ఏ సభకు వెళ్లినా భాషా బీభత్సం సృష్టిస్తున్నారు.
అక్కడేదో అష్టావధానం జరుగుతున్నట్లు.. భాష మీద పోటీ పెట్టినట్లు.. గుర్తు లేని పేర్లు చెప్తూ.. గుర్తు పట్టలేని పదాలు ప్రయోగిస్తూ.. జనాలను కన్ఫ్యూజన్‌లో పడేస్తున్నారు జగన్. సంక్షేమ పథకాల ప్రారంభం అంటూ.. వరుస సభలు నిర్వహిస్తున్న వైసీపీ బాస్.. వెళ్లిన ప్రతీచోట చంద్రబాబు, పవన్‌ను మాటలతో ఆడుకుంటున్నారు. మారీచుడు అని ఒకసారి.. పూతన అని ఇంకోసారి.. నరకాసురుడు, దుశ్శాసనుడు అని ఇంకోసారి.. పురాణాల్లో రాక్షసులతో కంపేర్ చేస్తూ జగన్ ప్రసంగం సాగుతోంది ప్రతీసారి ! రాజకీయ పార్టీకి అధినేతగా.. విమర్శల్లో భాగంగా ప్రత్యర్థి పార్టీని ఇలా రాక్షసులతో కంపేర్ చేయడం తప్పు కాకపోవచ్చు బహుశా ! జనాలు మర్చిపోయిన పేర్లతో.. తనకు అర్థం కాని కేరక్టర్లలో తిట్టడం ఎందుకు జగన్ సార్ అన్నది ఇప్పుడు మెజారిటీ జనాల అభిప్రాయం.
ఇలాంటి రాక్షసుల పేర్లు జనాలు ఎప్పుడో మర్చిపోయారు. అలాంటి వాళ్లతో కంపేర్ చేసి.. జగన్ స్పీచ్‌లు కంటిన్యూ చేయడం.. అమాయకత్వమో, అజ్ఞానమో అనే విమర్శలు వినిపిస్తున్నాయ్. ఎవరో రాసిచ్చిన స్పీచ్‌ను ఉన్నది ఉన్నట్లు చదివితే ఇలానే ఉంటుంది మరి! జీవీడీ కృష్ణమోహన్ అనే వ్యక్తి.. జగన్‌కు ప్రసంగాలు రాసిస్తారు. తన పాండిత్యాన్ని అంతా కలబోసి, వడపోసి.. దానికి కాసింత పులిహోర కలిపి.. కృష్ణమోహన్ స్పీచ్ సిద్ధం చేస్తే.. దాన్ని కనీసం మార్చకుండా.. మార్చుకోకుండా జగన్ చదివేస్తున్నారు.
నిజానికి ఆ రాక్షసుల పేర్లు తెలుసేమో కానీ.. వాళ్లెందుకు రాక్షసులో.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో చదువుకున్న జగన్‌కు కూడా తెలియదు సరిగా ! ఏదో బాగున్నాయని వాడేస్తున్నారు అంతే ! ఈ పేర్లు పలికేప్పుడు జగన్ ఫేస్‌లో కనీసం ఎక్స్‌ప్రెషన్ కూడా మారడం లేదంటే.. అర్థం చేసుకోవచ్చు ఆయనకు ఎంత తెలుసో వీళ్ల గురించి. అటు జనాలకు అర్థం కాక.. ఇటు జగన్‌కు అర్థం కాక.. ఆ స్పీచ్ ఏంట్రా బాబు అని తలలు బాదుకుంటున్న పరిస్థితి చాలామందిది ! రాజకీయాల్లో మాటలు ఎప్పుడైనా సూటిగా, సుత్తిలేకుండా.. సరళంగా ఉండాలి. వీడెవడ్రా బాబు.. మాటలతో కొడుతున్నాడు అనుకోవాలి తప్ప.. అవతలి వ్యక్తులు భాషా ప్రావీణ్యానికి పరీక్ష పెట్టొద్దు.
అడవి ఎలా ఉంది అంటే.. అందమై చిన్న చిన్న మాటల్లో చెప్పాలే తప్పా.. అటజని కాంచె అనే పద్యం అందుకోవడం అమాయకత్వమే అవుతుంది. మాటలకు చాలా పవర్ ఉంటుంది. అలాంటి మాట అందదరికీ అర్థం అయ్యేలా ఉండాలి. కనీసం తనకు అర్థం అయ్యేలా అయినా చూసుకోవాలి. అలా జరగనప్పుడు.. ఆ మాటకు, ఆ భాషకు విలువే ఉండదు. అర్థం కాని భాషకు.. ఎప్పటికీ అర్థం ఉండదు. ఏపీలో ఎన్నికలకు దాదాపు సైరెన్ మోగిన వేళ.. ఇక నుంచి జగన్ మార్చుకోవాల్సింది అదే !