CM Jagan: వాలంటీర్లపై ఇటీవల జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం జగన్ ఖండించారు. వాలంటీర్లపై పవన్ వ్యాఖ్యలు సంస్కారహీనమన్నారు. పవన్ వ్యాఖ్యల తర్వాత జగన్ ఈ అంశంపై తొలిసారి స్పందించారు. తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో జరిగిన వైఎస్సార్ నేతన్న నేస్తం కార్యక్రమం సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా పవన్‌తోపాటు, చంద్రాబాబు, రామోజీరావుపై నిప్పులు చెరిగారు.
వాలంటీర్ల లాంటి మంచి వ్యవస్థపై ఇలాంటి వ్యాఖ్యలా అని ప్రశ్నించారు. అందుకనే ఇలా మాట్లాడాల్సి వస్తోందన్నారు. “వాలంటీర్లు అందరికీ తెలిసన వారే. ఎండొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా వాళ్లు పనిచేస్తున్నారు. వారంతా మన కుటుంబ సభ్యులు. అవినీతికి, వివక్షకు తావులేకుండా సేవలందిస్తున్నారు. ఏ పార్టీ అని చూడకుండా సేవలందిస్తున్నారు. మన ఊరి పిల్లలైన వాలంటీర్ల మీద తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. వారంతా మన ఊరి పిల్లలే. మన ఇరుగుపొరుగు పిల్లలే. ఇలాంటి వారిమీద తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. స్క్రిప్టు రామోజీరావుది, నిర్మాత చంద్రబాబు, యాక్షన్ పవన్‌కళ్యాణ్‌ది. వాలంటీర్లు స్త్రీలను లోబర్చుకుంటారని ఒకరు అంటారు. హ్యూమన్ ట్రాఫిక్ చేస్తారని ఇంకొకరు అంటారు. అబద్ధాలకు రెక్కలు తొడిగి ప్రచారం చేస్తున్నారు. 2.6 లక్షలమంది వాలంటీర్లలో 60శాతం మంది మహిళలే. వాలంటీర్లంతా చదువుకున్న సంస్కారవంతులు.
ఇలాంటి వాలంటీర్ల క్యారెక్టర్‌ను తప్పుబట్టిన వారు ఎవరంటే.. ఒకరు పదేళ్లుగా చంద్రబాబుకు వాలంటీర్‌గా పనిచేస్తున్న వాలంటీర్.. ప్యాకేజీ స్టార్. ఇంకొకరు చంద్రబాబు. వాలంటీర్లు ఎలాంటి వారో సేవలు అందుకుంటున్న వారికి తెలుసు. చంద్రబాబు క్యారెక్టర్, దత్తపుత్రుడి క్యారెక్టర్, ఆయన సొంతపుత్రుడి క్యారెక్టర్, అలాగే ఆయన బావమరిది క్యారెక్టర్ ఏంటో ప్రజలకు బాగా తెలుసు. మన వాలంటీర్లు అమ్మాయిలను లోబరుచుకున్నారా? లేక దత్తపుత్రుడు ఇదే కార్యక్రమం పెట్టుకుని అమ్మాయిలను లోబరుచుకున్నారా? ఒకరిని పెళ్లిచేసుకోవడం, నాలుగేళ్లు కాపురం చేయడం.. మళ్లీ వదిలేయడం. మళ్లీ ఇంకొకరిని పెళ్లిచేసుకోవడం.. మళ్లీ వదిలేయడం. మళ్లీ పెళ్లి.. మళ్లీ వదిలేయడం. ఒకరితో వివాహ బంధంలో ఉండగానే ఇంకొకరితో సంబంధం. ఇలాంటి క్యారెక్టర్ ఎవరిది? పట్టపగలే మందుకొడుతూ, 10 అమ్మాయిలతో స్విమ్మింగ్ పూల్‌లో డ్యాన్స్ చేసేవాడు ఇంకొకడు. ఎంతనిస్సుగ్గుగా డ్యాన్సులు చేస్తాడో.
ఇంకొకడు కనిపిస్తాడు. అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలంటాడు, లేకపోతే కడుపైనా చేయాలంటాడు ఇంకొక దౌర్భ్యాగ్యుడు. వయస్సు 75 ఏళ్లు అయినా సిగ్గులేదు. ఆహా బావా నువ్వు సినిమాల్లోనే చేశావు.. నేను నిజజీవితంలో చేశాను అంటూ చేసిన వెధవ పనుల్ని గొప్పగా చెప్పుకునే ముసలాయన ఇంకొకడు. ఇలాంటి క్యారెక్టర్‌లేని వాళ్లంతా మంచి చేస్తున్న మన వలంటీర్ల గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్నారు. ఇది కలియుగం కాక మరేమిటి? ఇలాంటి వారి మెదడు తెరిచి చూస్తే పురుగులు కనిపిస్తాయి. పబ్లిక్ లైఫ్ అయినా అంతే.. పర్సనల్ లైఫ్ అయినా అంతే. కుళ్లు, కుట్రలు కనిపిస్తాయి. బీజేపీతో పొత్తు.. చంద్రబాబుతో కాపురం.. ఇచ్చేది తన పార్టీ బీఫాం.. టీడీపీకి బీ టీం. చంద్రబాబుపై పోటీ ఒక డ్రామా, బీజేపీతో స్నేహం మరో డ్రామా.. తనది ప్రత్యేక పార్టీ అన్నది ఇంకో డ్రామా. నిజమేమిటి అని అంటే. స్క్రిప్టు ఈనాడుది, నిర్మాత చంద్రబాబు, నటన మాటలు డైలాగులు అన్నీ దత్తపుత్రుడివి. ఎందుకు ఈస్థాయికి దిగజారిపోయారు? వీళ్లు మంచి చేశారు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు” అని జగన్ వ్యాఖ్యానించారు.