CM KCR: కమ్యూనిస్టుల్ని ఇంతకాలం పక్కనబెట్టినట్లు కనిపించిన సీఎం కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. రాబోయే ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి పని చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు సీట్లు కేటాయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ విజయం సాధించడం అంత సులభం కాదు. అందుకే ఎన్నికల్లో గెలిచేందుకు కేసీఆర్ అన్ని అస్త్రాల్ని వాడేందుకు సిద్ధమయ్యారు. దీనిలో భాగంగా కొత్త పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చారు.
రైతు రుణమాఫీ అమలు చేయబోతున్నారు. ఇప్పుడు కమ్యూనిస్టులతో పొత్తుపై దృష్టి సారించారు. దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో సీపీఐ, సీపీఎంలకు మంచి పట్టు ఉంది. ఈ పార్టీలు ఇతర పార్టీల గెలుపోటముల్ని ప్రభావితం చేయగలవు. ఇవి మద్దతు ఇచ్చిన పార్టీలు గెలిచే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో కనీసం ఐదు వేల వరకు ఓట్లు కమ్యూనిస్టులకు ఉన్నాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల కమ్యూనిస్టులు ప్రభావం చూపగలరు. అందుకే వీరి ఓట్లపై ఇప్పుడు కేసీఆర్ గురిపెట్టారు. కమ్యూనిస్టుల మద్దతు ఉంటే అది తప్పకుండా బీఆర్ఎస్‌కు కలిసొస్తుంది. అందుకే కమ్యూనిస్టులను తిరిగి దగ్గర చేర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.
నిజానికి గతంలో హుజురాబాద్, మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల మద్దతు కేసీఆర్ తీసుకున్నారు. మునుగోడులో బీఆర్ఎస్ గెలిచేందుకు కమ్యూనిస్టులే కారణం. దీంతో తర్వాత కూడా కమ్యూనిస్టులతో బీఆర్ఎస్ కలిసి సాగుతుందని భావించారు. దీనికి తగ్గట్లే కమ్యూనిస్టులు అధిక సీట్ల కోసం పట్టుబట్టారు. దీనికి కేసీఆర్ అంగీకరించలేదు. వాళ్లు కోరిన చోట.. కోరినన్ని సీట్లు ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధంగా లేరు. దీంతో బీఆర్ఎస్, కమ్యూనిస్టుల మధ్య గ్యాప్ పెరిగింది. ఇదే సమయంలో వాళ్లు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. అసలే ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, మహబూబ్‌నగర్ వంటి జిల్లాల్లో కాంగ్రెస్ బలపడుతోంది. అలాంటి కాంగ్రెస్‌కు కమ్యూనిస్టులు కూడా మద్దతు ఇస్తే బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బలు తప్పవు. ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులు కాంగ్రెస్ వైపు వెళ్లకుండా చూడటం కూడా బీఆర్ఎస్‌కు చాలా ముఖ్యం.
ఈ నేపథ్యంలో కమ్యూనిస్టులతో పొత్తు అవసరాన్ని గుర్తించిన కేసీఆర్ వారికి సీట్లు కేటాయించేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో సీపీఐ, సీపీఎం నేతలు కేసీఆర్ అపాయింట‌్‌మెంట్ కోరారు. తమకు రావాల్సిన సీట్ల గురించి చర్చించాలనుకున్నారు. కానీ, వారికి కేసీఆర్ అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. దీంతో ఏదో ఒకటి త్వరగా తేల్చేస్తే.. తమ దారి తాము చూసుకుంటామంటూ కమ్యూనిస్టులు చెప్పారు. ఈ నేపథ్యంలో అన్నీ ఆలోచించిన కేసీఆర్.. కమ్యూనిస్టులకు సీట్లు కేటాయించి, వారి మద్దతు తీసుకోవడమే బెటర్ అనే నిర్ణయానికొచ్చారు. త్వరలోనే కమ్యూనిస్టు పార్టీల అగ్రనేతలతో కేసీఆర్ భేటీ అవుతారు. ఎన్ని సీట్లు.. ఏయే స్థానాలు వంటివాటిపై చర్చిస్తారు. అయితే, బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలను కమ్యూనిస్టులు అడుగుతున్నారు. ఈ విషయంలో కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.