కర్ణాటక ఫలితాలు బీఆర్ఎస్‌ను టెన్షన్ పెడుతున్నాయ్ ఒకరకంగా! బీజేపీ ఓటమి ఒకరకంగా గులాబీ పార్టీ వర్గాల్లో ఆనందం నింపుతున్నా.. హస్తం పార్టీ గణనీయంగా ఓట్ల శాతం పెంచుకోవడం కారు పార్టీని టెన్షన్ పెడుతోంది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 50శాతానికి పైగా సీట్లు గెలుచుకుంది. దీంతో ఈప్రభావం పక్క రాష్ట్రమైన తెలంగాణ మీద ఎలా ఉండబోతుందన్న కంగారు.. గులాబీ పార్టీని వెంటాడుతోంది. నిజానికి కర్ణాటకలో హంగ్ ఏర్పడే అవకాశాలు ఉంటాయని బీఆర్ఎస్ నేతలు ముందుగా అంచనా వేశారు. ఫలితాలు చూస్తే మాత్రం.. సీన్ మొత్తం రివర్స్ అయింది. దీంతో బీఆర్ఎస్ నేతలు ఆలోచనలో పడ్డారు.
కాంగ్రెస్ విజయానికి కారణాలు ఏంటనే దానిపై ఇప్పుడు ఎనాలసిస్ చేస్తున్నారు. స్థానిక పరిస్థితుల్లో హస్తం పార్టీ విజయానికి కారణమా.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ప్రభావమా.. కాంగ్రెస్ మీద జనాల్లో పెరుగుతుందా.. అనే అంశాలపై ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా బీఆర్ఎస్ అగ్రనేతలు వివరాలు తెప్పించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. కర్ణాటక ప్రభావం తెలంగాణలో పడకుండా ఏం చేయాలన్న దానిపై.. వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల హీట్ మొదలైంది. హ్యాట్రిక్ సాధిస్తామని బీఆర్ఎస్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఐతే తమదే విజయం అని బీజేపీ బలంగా చెప్తుంటే.. తగ్గేదే లే అని కాంగ్రెస్ అంటోంది. కేసీఆర్ పాలన వైఫల్యాలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ జనాల్లోకి వెళ్తోంది. పేపర్ లీకేజీలు, నిరుద్యోగం, పంట కొనుగోళ్లు, ఓఆర్ఆర్ కాంట్రాక్టుల అంశాలను హైలైట్ చేస్తోంది. ఇదే ఇప్పుడు గులాబీ పార్టీని టెన్షన్ పెడుతోంది. కర్ణాటకలోనూ కాంగ్రెస్ ఇదే స్ట్రాటజీ ఫాలో అయింది. బీజేపీ అవినీతిపై ఫోకస్ చేసిన కాంగ్రెస్.. కర్ణాటకలో భారీగా లాభపడింది. ఈ మధ్యే జరిగిన బీఆర్ఎస్‌ఎల్పీలో కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేల అవినీతి గురించి మాట్లాడడం.. కాంగ్రెస్‌కు ఆయుధంగా మారింది.
ఇదే అంశాన్ని జనాల్లోకి బలంగా తీసుకెళ్లాలని ప్లాన్ చేస్తోంది. దీంతో గులాబీ పార్టీ నేతలకు భయం పట్టుకుంది. కాంగ్రెస్‌కు సీట్లు తక్కువేమో కానీ.. ఓటు బలం మాత్రం తగ్గలేదు. పక్కాగా దృష్టి సారించి బీఆర్ఎస్ అవినీతి అంశాన్ని అందుకుంటే.. అది జనాల్లోకి బలంగా వెళ్లడం ఖాయం. ఇదే ఇప్పుడు గులాబీ టీమ్‌ను టెన్షన్ పెడుతోంది.