CM KCR: ఢిల్లీ నుంచి ఏం కావాలన్నా అడుగు.. ఇస్తాను అంటాడు ఒక తెలుగు సినిమాలోని నటుడు.. అయితే.. మీ ఢిల్లీకే ఏం కావాలో చెప్పు అంటాడు ఆ సినిమా హీరో! అలా.. ఆ సినిమాలో ఒక పార్టీకి ఎన్నికలకు కావాల్సిన నిధులు సమకూర్చి పెడతాడు. ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అలాగే కనిపిస్తున్నాడు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్‌గా మార్చి, జాతీయ రాజకీయాలపై దృష్టిపెట్టిన కేసీఆర్ వైఖరి ఇలాగే ఉందిప్పుడు. కేంద్రంలో బీజేపీకి ఝలక్ ఇవ్వడమే లక్ష్యంగా.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌ను విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు కేసీఆర్. ప్రతిపక్షాలను ఒక్క తాటి మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
కొందరిని ఈయన వెళ్లి కలిసేది.. కొందరు వచ్చి ఈయనను కలిసేది ఇందుకే! ఇలా వచ్చిన ప్రతీ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్న కేసీఆర్.. ఈ మధ్య రాజకీయాల్లో చేసిన ఓ ప్రకటన రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. ఏదో అనుకుంటే ఇంకేదో అయినట్లు అయిపోయింది ఆ ఒక్క మాటతో! అయితే, అది బహిరంగంగా చేసిన ప్రకటన కాదు. రహస్యంగా, అంతర్గతంగా చేసిన ప్రకటన. ఇంతకీ అదేంటంటే.. కేంద్రంలో ప్రతిపక్షాలను లీడ్ చేయాలని భావిస్తున్న కేసీఆర్.. కూటమికి తనని ఛైర్మన్‌ని చేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల ఖర్చు మొత్తం తానే భరిస్తానంటూ చెప్పారట. ఈ విషయాన్ని సీనియర్ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ వెల్లడించారు. దీంతో రాజ్‌దీప్ సర్దేశాయ్ పేల్చిన ఈ బాంబ్ ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది.
విపక్ష పార్టీల పార్లమెంట్ ఎన్నికల ఖర్చు భరించడం అంటే.. మాములు విషయం కాదు! తక్కువలో తక్కువ.. లక్ష కోట్ల రూపాయలు కావాలి ఎన్నికల ఖర్చు కోసం! అన్ని కోట్లు కేసీఆర్ దగ్గర ఉన్నాయా? ఉంటే ఎలా వచ్చాయి? అన్నది ఇప్పుడు చర్చకు దారితీస్తోంది. నిజానికి దేశంలోనే బీఆర్ఎస్ ఒక సంపన్న రాజకీయ పార్టీగా ఉంది. పార్టీ అధికారిక అకౌంట్‌లోనే దాదాపు 12వందల కోట్లకు పైగా నిధులు ఉన్నాయ్. ఇన్ని డబ్బులు ఉన్న ప్రాంతీయ పార్టీ దేశంలో ఏదీ లేదు. ఏడాదికేడాది బీఆర్ఎస్‌కు ఫండింగ్ పెరుగుతూనే ఉంది. దీంతో ఇప్పుడు కేసీఆర్ డబ్బుల మీద దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. లక్ష కోట్లు ఖర్చు చేసే సత్తా నిజంగా కేసీఆర్‌కు, బీఆర్ఎస్‌కు ఉందా అని అనుమానాలు వ్యక్తం చేసేవాళ్లు కూడా ఉన్నారు.
ఈ మాటలే బీఆర్‌ఎస్ ప్రత్యర్థి పార్టీలకు ఆయుధంగా మారాయి. అటుకులు బుక్కి ఉద్యమం నడిపించామని పదేపదే చెప్పే కేసీఆర్‌కు.. లక్ష కోట్లు ఎలా వచ్చాయ్… ఇదంతా అవినీతి సొమ్ము కాదా అని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. నిజంగా ఫండింగ్ చేస్తారా.. అలా చేస్తానని చెప్పారా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్‌ను పొలిటికల్ చర్చలో నిలిపారు కేసీఆర్. నిజంగా ఖర్చు చేస్తారా లేదా అన్న సంగతి పక్కనపెడితే.. ఖర్చు చేస్తానన్న ఒక్క మాటతో ఎలాంటి ప్రచారం లేకుండా దేశవ్యాప్తంగా పొలిటికల్ అటెన్షన్ డ్రా చేయగలిగారు కేసీఆర్.