CM KCR: రాబోయే ఎన్నికల్లో తమ వారసులను రాజకీయాల్లోకి తేవాలనుకుంటున్న నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ షాక్ ఇచ్చారు. ఈసారి వారసులకు నో ఛాన్స్ అని స్పష్టం చేశారు. రాబోయ మూడు నాలుగు నెలల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. దీంతో కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమ వారసులకు టిక్కెట్లు ఇప్పించుకుని, రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించాలని భావిస్తున్నారు. వారసులకు టిక్కెట్లు ఇస్తే గెలిపించుకుంటామని, తాము రిటైర్ అవుతామని అధినేత కేసీఆర్‌ను కోరారు. అయితే, కేసీఆర్ మాత్రం దీనికి ససేమిరా అంటున్నారు. ఈసారి వారసులకు టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టంగా చెప్పేశారు.
టిక్కెట్లు అడుగుతున్న కీలక నేతలు
బీఆర్ఎస్‌కు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు కొందరు కీలక నేతలు వారసులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి నేతలు దాదాపు పదిహేను మంది వరకు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో మంత్రి పోచారం శ్రీనివాస్‌తోపాటు జోగో రామన్న, బాజిరెడ్డి, మనోహర్ రెడ్డి వంటి కీలక నేతలున్నారు. ఈ ఎన్నికలతో రాజకీయాలకు దూరం కావాలని, తమ వారసుల్ని తెరపైకి తేవాలని వీళ్లంతా భావించారు. దీనికి తగ్గట్లుగా కొంతకాలంగా వీరి వారసులు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. తదుపరి టిక్కెట్ తమకే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గ ప్రజలతో సమావేశమై, మద్దతు ఇవ్వాలంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల అధికారిక కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు. వీళ్లందరికీ టిక్కెట్లు ఇప్పించుకునేందుకు ఆయా నేతలు కేసీఆర్, కేటీఆర్ చుట్టూ తిరుగుతూ ఒత్తిడి తెస్తున్నారు. వీరిలో ఇద్దరు, ముగ్గురు నేతలకు తప్ప మిగతా వాళ్ల వారసులకు టిక్కెట్లు ఇవ్వడానికి కేసీఆర్ అంగీకరించడం లేదు.
ప్రస్తుతం బీఆర్ఎస్‌కు పరిస్థితు మరీ అనుకూలంగా లేవు. కాంగ్రెస్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. బీజేపీ కూడా పుంజుకుంటోంది. ఇలాంటి టైంలో వారసుల్ని తెరపైకి తేవడం రిస్క్ అని కేసీఆర్ భావిస్తున్నారు. పైగా ప్రజలకు బాగా తెలిసిన వారిని నియమిస్తేనే గెలిచే అవకాశాలుంటాయని, వారసుల విషయంలో అంత సానుకూలత రాకపోవచ్చన్నది కేసీఆర్ ఆలోచన. అందుకే కేసీఆర్ ఆయా నేతలకు ఈ విషయం తేల్చిచెప్పారు. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వారసులకు టిక్కెట్లు ఇవ్వడం కుదరదని వివరించారు. అయితే, కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు తనయుడు సంజయ్‌తోపాటు పరిగి సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్ రెడ్డి కొడుకు మహేశ్ రెడ్డికి, మరికొందరు వారసులకు మాత్రం టిక్కెట్లు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. వీరిలో విద్యాసాగర్ రావు తనయుడు సంజయ్.. కేటీఆర్‌కు బాల్య స్నేహితుడు. అందువల్లే సంజయ్‌కు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఆయన నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అయితే, వారసులకు టిక్కెట్లు ఇప్పించుకోలేని నేతలు మాత్రం అసంతృప్తితో ఉన్నారు.
ప్రయోగాలకు సిద్ధంగా లేని బీఆర్ఎస్
ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయాల్లో ప్రయోగాలకు బీఆర్ఎస్ సిద్ధంగా లేదు. వారసులకు టిక్కెట్లు ఇస్తే గెలుపుదారులు మూసుకుపోతాయని కేసీఆర్ భావిస్తున్నారు. అసలే ప్రభుత్వంపై పలువర్గాల నుంచి వ్యతిరేకత ఉంది. దీనికితోడు బలమైన ప్రతిపక్షాలున్నాయి. అందుకే ప్రయోగాలకంటే.. గెలుపు గుర్రాలకే టిక్కెట్లు అనే ఫార్ములాకు కేసీఆర్ కట్టుబడి ఉన్నారు. దీంతో చాలా మంది నేతలు తమ వారసుల్ని రంగంలోకి దించేందుకు మరో పర్యాయం వేచి చూడకతప్పదు.