CM KCR: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆశావహులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు రంగం సిద్ధమైంది. 75 నుంచి 100 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించేందుకు సీఎం కేసీఆర్ ముహూర్తం ఫిక్స్ చేశారు. ఆగష్టు 18న తొలి జాబితా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ తొలి జాబితాలో 60 మందికిపైగా సిట్టింగులకు అవకాశం ఉంటుంది. మిగతా సీట్లలో కొత్త అభ్యర్థుల్ని ప్రకటిస్తారు.
తెలంగాణలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ దాదాపు ఒంటరిగానే పోటీ చేస్తుంది. దీంతో 119 మంది అభ్యర్థుల్ని ప్రకటించాల్సి ఉంది. అందులో మొదటి విడతలో కనీసం 75 మంది పేర్లను.. గరిష్టంగా 100 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటిస్తారు. ఇప్పటికే ఈ జాబితాపై కసరత్తు పూర్తైంది. అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తైంది. మొదటి జాబితా ప్రకటించిన కొద్ది రోజుల తర్వాత రెండో జాబితాను కూడా విడుదల చేస్తారు. పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు కావడంతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఆశావహుల్లో టెన్షన్ నెలకొంది. కొద్ది రోజులుగా చాలా మంది ఈ విషయంలో తీవ్ర ఉత్కంఠకు గురవుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్ ఏమవుతుందోననే ఆందోళనలో ఉన్నారు. బీఆర్ఎస్ టిక్కెట్ రాకుంటే ఏం చేయాలనే ఆలోచనలు చేస్తున్నారు. ఇతర పార్టీల నుంచి పోటీ చేసే అంశంపై రహస్యంగా చర్చలు జరుపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలతోపాటు, కొన్నిచోట్ల ఎమ్మెల్సీలు, ఇతర పార్టీల నుంచి బీఆర్ఎస్‌లో చేరిన వాళ్లు, ఓడిపోయినప్పటికీ పార్టీ కోసం పని చేస్తున్న వాళ్లు టిక్కెట్లు ఆశిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో కేసీఆర్ పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు.
గెలుపు గుర్రాలకే టిక్కెట్లు కేటాయించబోతున్నారు. వివిధ సర్వేల ఆధారంగా.. గెలిచే అవకాశం ఉన్నవాళ్లను, ప్రజల్లో వ్యతిరేకత లేనివాళ్లనే అభ్యర్థులుగా ప్రకటించబోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దాదాపు 30 మందిపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. వీరిలో చాలా మందికి బీఆర్ఎస్ టిక్కెట్ ఇచ్చే అవకాశం లేదు. వారి స్థానాల్లో ఎవరికి టిక్కెట్ ఇవ్వాలనే అంశంపై కూడా కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. టిక్కెట్లు రాని అభ్యర్థుల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కొనే అంశంపై కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నారు. ఏదేమైనా ఈ సారి తమకు ఎంత సన్నిహితులైనా.. ఎవరు చెప్పినా.. వినకుండా కేవలం గెలిచే అభ్యర్థులకే బీఆర్ఎస్ టిక్కెట్లు అన్నది మాత్రం స్పష్టం. రాబోయే ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలని కేసీఆర్ గట్టి పట్టుదలతో ఉన్నారు. కేసీఆర్ తొలి జాబితా ప్రకటించిన తర్వాతనే మిగతా పార్టీలు తమ జాబితా కూడా ప్రకటించే అవకాశాలున్నాయి. కారణం.. బీఆర్ఎస్‌లో టిక్కెట్లు రాని అభ్యర్థుల్ని తమవైపు తిప్పుకొని, వారికి టిక్కెట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్, బీజేపీ సిద్దంగా ఉన్నాయి.