Mohammad Azharuddin: అజార్ క్లీన్‌బౌల్డ్‌పై కేసీఆర్ నజర్! జూబ్లీహిల్స్‌లో ఎంఐఎంతో పక్కా ప్లాన్..

అజారుద్దీన్‌కు పోటీగా MIM కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. తెలంగాణలో BRS-MIM మధ్య ఫ్రెండ్షిప్ కంటెస్ట్ జరుగుతోంది. అలాంటప్పుడు జూబ్లీహిల్స్‌లో BRS తరపున సిట్టింగ్ MLA మాగుంట గోపీనాథ్ ఉండగా, MIM ఎందుకు పోటీచేస్తోంది?

  • Written By:
  • Publish Date - November 9, 2023 / 06:54 PM IST

Mohammad Azharuddin: అజాహరుద్దీన్.. టీమిండియా మాజీ కెప్టెన్. హెచ్‌సీఏ మాజీ అధ్యక్షుడు. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుతం జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి పోటీలో ఉన్నాడు. పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని కాదని కాంగ్రెస్ హైకమాండ్ అజార్‌కు ఈ సీటు ఇచ్చింది. అజార్‌కు ఇవి మొదటి ఎన్నికలు కావు. ఇంతకుముందు రెండుసార్లు లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశాడు. ఒకసారి గెలిచాడు. 2009లో కాంగ్రెస్‌లో చేరిన అజార్ యూపీలోని మొరాదాబాద్ ఎంపీ సీటుకు నిలబడి విజయం సాధించాడు. తర్వాత 2014లో రాజస్థాన్‌లోని టోంక్ సవాయీ మాధోపుర్ నుంచి నిలబడి ఓడిపోయాడు.

ఇప్పుడు తెలంగాణలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ సీటుకు పోటీ చేస్తున్నాడు అజారుద్దీన్. ఈ నియోజకవర్గంలో అభ్యర్థి గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో ముస్లిమ్స్ ఓట్లు ఉన్నాయి. దాంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆయనకు టిక్కెట్ ఇచ్చింది. ఇదే సీటుపై ఆశలు పెట్టుకున్న పీజేఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డిని పక్కనబెట్టింది. దాంతో ఆయన కాంగ్రెస్‌కి రిజైన్ చేసి.. అనుచరులతో కలిసి బీఆర్ఎస్‌లో చేరిపోయారు. ఇప్పుడు అజారుద్దీన్‌కు పోటీగా MIM కూడా తమ అభ్యర్థిని రంగంలోకి దించింది. ఇక్కడే అసలైన ట్విస్ట్ మొదలైంది. తెలంగాణలో BRS-MIM మధ్య ఫ్రెండ్షిప్ కంటెస్ట్ జరుగుతోంది. అలాంటప్పుడు జూబ్లీహిల్స్‌లో BRS తరపున సిట్టింగ్ MLA మాగుంట గోపీనాథ్ ఉండగా, MIM ఎందుకు పోటీచేస్తోంది? MIM తాము పోటీచేసే 7 స్థానాల్లో కాకుండా.. 9 నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. జూబ్లీహిల్స్‌తో పాటు రాజేంద్రనగర్‌లో కూడా MIM అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ రెండు చోట్ల కూడా ముస్లిం ఓట్లు కాంగ్రెస్ ఖాతాలో పడకుండా ప్లాన్ చేశారు BRS చీఫ్ కేసీఆర్.

అందుకే తమ అభ్యర్థులను దింపి పరోక్షంగా BRSకు హెల్ప్ చేయాల్నది MIM వ్యూహం. జూబ్లీహిల్స్‌లో లక్షా 17 వేలకు పైగా మైనారిటీ కమ్యూనిటీ ఓట్లు ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో షేక్‌పేట, టోలీచౌక్, బోరబండలాంటి ప్రాంతాల్లో మైనార్టీ ఓట్లే కీలకం. MIM పార్టీ కార్పొరేటర్ మహ్మద్ రషీద్ ఫరాజుద్దీన్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి ఎల్.దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. అజార్‌ని ఓడించడానికి MIM అధినేత అసదుద్దీన్ ఓవైసీ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. అజారుద్దీన్ ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్ అంటున్నారు. ఆయనపై తమ అభ్యర్థిని నిలబెట్టడానికి అజార్‌తో వ్యక్తిగతంగా ఎలాంటి శత్రుత్వం లేదన్నారు. అజార్ ఇద్దరు తమ్ముళ్ళు తనకు మంచి ఫ్రెండ్స్ అని, ఆయన తండ్రి కూడా తనకు వీరాభిమాని అంటున్నారు అసదుద్దీన్.

అయితే జూబ్లీహిల్స్‌లో ఇద్దరు MIM కార్పొరేటర్లు ఉన్నారు. తమకు సొంతంగా బలం ఉండటం వల్లే పోటీకి పెట్టామని చెప్పారు. జూబ్లీహిల్స్‌లో ముస్లిం ఓట్లు చీల్చడానికి మాత్రం కాదంటున్నారు ఆ పార్టీ చీఫ్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్నత వర్గాల ఓట్లు కూడా ఎక్కువే. వాళ్ళంతా అజార్‌కి ఓటేస్తారని కాంగ్రెస్ భావించింది. BRS మాత్రం మజ్లిస్ అభ్యర్థి పోటీతో ముస్లింల ఓట్లు చీలిపోతాయని, ఇక మిగతా వర్గాల వారి ఓట్లతో మరోసారి గెలవాలని ప్లాన్ చేస్తోంది. సీఎం కేసీఆర్ వేసే బంతికి అజార్ క్లీన్ బౌల్డ్ అవుతారా.. లేదా.. అన్నది డిసెంబర్ 3 నాడు తెలుస్తుంది.