Left Parties: లెఫ్ట్ పార్టీలకు సీఎం కేసీఆర్ భారీ షాకిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ తమతో పొత్తు పెట్టుకుంటుందని, ఏడెనిమిది సీట్లైనా కేటాయిస్తుందని భావించిన సీపీఐ, సీపీఎంలకు షాకిస్తూ.. నాలుగు మినహా అన్ని సీట్లకు కేసీఆర్ అభ్యర్థుల్ని ప్రకటించారు. కమ్యూనిస్టులు, బీఆర్ఎస్ మధ్య పొత్తుపై ఇంతకాలం జరిగిన ప్రచారం ఒట్టిదేనని దీంతో తేలిపోయింది. కేసీఆర్ నిర్ణయం నిజంగా కామ్రేడ్లకు షాకిచ్చిందనే చెప్పాలి. గత ఏడాది జరిగిన మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా తమకు మద్దతివ్వాలని సీఎం కేసీఆర్ స్వయంగా కమ్యూనిస్టులను కోరారు.
దీంతో అక్కడ వాళ్లు బీఆర్ఎస్‌కు మద్దతిచ్చారు. కమ్యూనిస్టుల మద్దతుతోనే అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. దీంతో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ప్రాధాన్యం దక్కుతుందని, బీఆర్ఎస్‌తో కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని కమ్యూనిస్టు నేతలు భావించారు. కానీ, వారికి కేసీఆర్ ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు నాయకులు కేసీఆర్‌ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ కుదరలేదు. కాంగ్రెస్ బలపడినట్లు కనిపించడం, బీజేపీ దూకుడుగా వ్యవహరించడం, బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడం వంటి కారణాలతో కేసీఆర్ తప్పకుండా ఈసారి కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికలకు వెళ్తారని అంతా భావించారు. దీనికి తగ్గట్లే నాలుగైదు సీట్లు కేటాయించేందుకు కేసీఆర్ అంగీకరించారనే ప్రచారం కూడా జరిగింది. కానీ, కేసీఆర్.. కమ్యూనిస్టుల్ని కనీసం సంప్రదించకుండానే అభ్యర్థుల్ని ప్రకటించేశారు. దీంతో పొత్తు లేదని తేలిపోయింది. ఈ షాక్ నుంచి తేరుకున్న తర్వాత కామ్రేడ్లు తమ భవిష్యత్ ఏంటో తేల్చుకోవాలి.
కాంగ్రెస్‌తో వెళ్తారా..?
బీఆర్ఎస్‌తో పొత్తు లేదని తెలిశాక కమ్యూనిస్టులకు మిగిలిన ఏకైక ఆప్షన్ కాంగ్రెస్. బీజేపీతో ఎట్టిపరిస్థితుల్లోనూ కలిసే ఛాన్స్ లేదు కాబట్టి కాంగ్రెస్‌తోనే సీట్ల గురించి చర్చించాలి. ఇందుకు కాంగ్రెస్ అంగీకరిస్తుందా.. లేదా.. అన్నది చూడాలి. గతంతో పోలిస్తే తెలంగాణలో కమ్యూనిస్టుల ప్రభావం తగ్గింది. అయినప్పటికీ ఖమ్మం, నల్గొండ వంటి జిల్లాల్లో ఇప్పటికీ కొంత బలం ఉంది. సొంతంగా గెలవలేకపోవచ్చు. కానీ, గెలుపోటములను ప్రభావితం చేయగలవు. అందుకే కమ్యూనిస్టులతో పొత్తు కోసం ఇతర పార్టీలు ఎదురుచూస్తుంటాయి. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం కలిసి పోటీ చేస్తే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే కమ్యూనిస్టు నేతలు ఈ దిశగా ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఎన్నికల్లో గెలవడం చాలా ముఖ్యం. కాబట్టి, కమ్యూనిస్టులతో వెళ్లేందుకు ఆ పార్టీకి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. తేలాల్సింది సీట్ల లెక్కే.