CM KCR: తెలంగాణలో ఎలక్షన్ మూడ్ మొదలైంది. హ్యాట్రిక్ లక్ష్యంగా బీఆర్ఎస్.. అధికారం టార్గెట్‌గా బీజేపీ, కాంగ్రెస్ పావులు కదుపుతున్నాయి. గెలుపు కోసం ఎంత దూరం అయినా వెళ్లేందుకు, ఎన్ని మెట్లు అయినా దిగేందుకు సిద్ధం అన్నట్లుగా పార్టీల తీరు కనిపిస్తోంది. అందుకే ప్రతీ చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూస్తున్నాయి పార్టీలు. ఇక తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వచ్చి, ఢిల్లీ మీద దండయాత్ర మొదలుపెట్టాలని కేసీఆర్ వ్యూహాలు అమలు చేస్తున్నారు.
జనం మనసు గెలిచేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. పథకాలు, నిర్ణయాలు ప్రకటిస్తున్నారు. ఐతే సిట్టింగ్‌లకే సీట్లు అని ప్రకటించినా కేసీఆర్‌ను ఇప్పుడు కొత్త టెన్షన్ వెంటాడుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో చాలామందిపై జనాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. మహిళల విషయంలో కొందరు నేతలపై ఆరోపణలు వినిపిస్తుంటే, సంక్షేమ పథకాల అమలు విషయంలో మరికొందరిపై, పార్టీ వాళ్లను తప్ప జనాలను పట్టించుకోవడం లేదని ఇంకొందరిపై, ఇలా రకరకాలుగా ఆరోపణలు జనాల్లో వ్యక్తం అవుతున్నాయి. రేషన్ కార్డులు, పింఛన్లు, దళిత బంధులాంటి పథకాలు ఎమ్మెల్యే సూచించిన వారికే అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. దళితబంధులో ఎమ్మెల్యేలే అవినీతికి పాల్పడ్డారని స్వయంగా కేసీఆరే అన్నారు ఒకసారి! ఇలాంటి పరిణామాలతో సిట్టింగుల్లో మెజారిటీ ఎమ్మెల్యేలపై జనాల్లో వ్యతిరేకత గట్టిగా ఉంది.
ఎలాగైనా హ్యాట్రిక్ కొట్టాలన్న పట్టుదల మీద ఉన్న కేసీఆర్.. అవసరం అయితే ఇచ్చిన మాటను ఈ ఒక్కసారికి గట్టు మీద పెట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మరోసారి నియోజకవర్గాల వారీగా సర్వేలు నిర్వహించాలని కేసీఆర్ ఫిక్స్ అయ్యారట. ఆ నివేదికల ఆధారంగా సిట్టింగ్‌లకు టికెట్లు ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ లెక్కన చాలామందికి మొండి చేయి చూపించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేలను టెన్షన్ పెడుతోంది.