తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకుంటోంది. మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయ్. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. దశాబ్ది ఉత్సవాల పేరుతో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికల రణరంగంలోకి దిగింది. పార్టీ క్యాడర్‌ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు గులాబీ బాస్ కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ అభివృద్ధి నినాదంతో హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్‌ఎస్ ప్లాన్ చేస్తోంది. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉండటంతో సహజంగా కనిపించే ప్రజా వ్యతిరేకతను అదుపు చేసి.. ప్రజాకర్షక పథకాలకు శ్రీకారం చుట్టాలని కేసీఆర్ నిర్ణయించినట్లు కనిపిస్తోంది. జిల్లాలవారీగా రాజకీయ ఎత్తుగడులు వేస్తూ ఎక్కడెక్కడ ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో క్యాడర్‌కు నిర్దేశిస్తూ జోరు చూపిస్తున్నారు కేసీఆర్. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఇస్తున్న హామీలు.. చేస్తున్న ప్రకటనలతో బీఆర్‌ఎస్ క్యాడర్ హుషారుగా కనిపిస్తోంది.
గత ఎన్నికల సందర్భంగా సిట్టింగ్‌లందరికీ టిక్కెట్లు ఇచ్చిన సీఎం.. ఈసారి కొత్తవారికి చాన్స్ ఇవ్వనున్నట్లు చూచాయగా చెప్పడంతో చాలామంది నాయకుల్లో ఆశలు చిగురించాయి. ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను గుర్తించిన కేసీఆర్.. వారికి ప్రత్యామ్నాయంగా అభ్యర్థులను కూడా రెడీ చేసినట్లు చెప్తున్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో కనీసం 30మందికి మళ్లీ టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేదని బీఆర్‌ఎస్ పార్టీ వర్గాల సమాచారం. అదే సమయంలో రాజకీయ పరిణామాలపై కూడా కేసీఆర్ దృష్టి పెట్టారు. బీజేపీని పరిగణనలోకి తీసుకోవద్దని.. కాంగ్రెస్ కన్నా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయాలని అనుకుంటున్నారు. గత ఎన్నికల్లో బీఆర్‌ఎస్ 88సీట్లు గెలుచుకోగా.. ఇతర పార్టీల నుంచి గెలిచిన 15మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో బీఆర్‌ఎస్ బలం 103కు చేరింది. 2018ఎన్నికల్లో ఏడుగురు సిటింగ్‌లకు మాత్రమే టికెట్లు ఇవ్వలేదు. ఇప్పుడు దానికి భిన్నంగా భారీ మార్పులు ఉండనున్నాయని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయ్.
నిజానికి మొన్నటి వరకు సిటింగ్‌లందరికీ టికెట్లు అని కేసీఆర్ ప్రకటించారు. ఐతే ఇప్పుడా మాట మీద నిలబడడం కష్టమని పార్టీ శ్రేణులే చెప్తున్నాయ్. సిట్టింగ్‌లందరికీ టికెట్లు అంటే.. ఎన్నికల ముందే చాలాచోట్ల ఓటమి అంచుల్లోకి వెళ్లడమేనని బీఆర్‌ఎస్ పార్టీ అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీంతో కేసీఆర్ ఎవరికి చాన్స్ ఇస్తారో.. ఎవరికి మొండి చేయి చూపుతారో అని ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు. రేపో మాపో వచ్చే 51మంది అభ్యర్థుల తొలి జాబితా కోసం ఎమ్మెల్యేలంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఎన్నికల ఏడాది కావడంతో.. బీఆర్‌ఎస్ పార్టీ తన వ్యూహానికి పదును పెట్టింది. ఇంతకాలం ప్రభుత్వంపై, కేసీఆర్ కుటుంబంపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూల్‌గానే కనిపించిన బీఆర్ఎస్.. ఇప్పుడు ఎదురుదాడికి దిగుతోంది. 9ఏళ్ల పాలనలో జనాలకు ఏం చేసింది చెప్తూనే.. విపక్షాల ఆరోపణలకు ఆధారాలతో సహా ఆన్సర్ చెప్తోంది. కేసీఆర్ సభల్లోనూ ఇలాంటి సీనే కనిపించింది.
ఇక అటు పాత హామీల దుమ్ముదులిపి మరీ అమలు చేస్తున్నారు కేసీఆర్. రుణమాఫీ, బీసీ బంధు, మైనార్టీ బంధుతో పాటు.. ఉద్యోగుల మీద కూడా వరాల జల్లు కురిపిస్తున్నారు. వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన ప్రభుత్వం.. ఆర్టీసీ ఉద్యోగులందరినీ ప్రభుత్వ పరిధిలోకి తీసుకువచ్చింది. త్వరలో ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించి పీఆర్సీ వేసే ఆలోచనలో ఉన్నారు కేసీఆర్. మెట్రో లైన్ పొడగింపు అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారించబోతోంది. ఆ లైన్ వెళ్లే రూట్‌లో మెట్రో వ్యవహారాన్ని హైలైట్ చేయబోతోంది. అదే సమయంలో కాంగ్రెస్, బీజేపీ కదలికలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ.. ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటు బ్యాంకు కొంత మెరుగయ్యే అవకాశం ఉన్నా.. ప్రధాన ప్రత్యర్థిగా మాత్రం కాంగ్రెస్ పార్టీయే ఉంటుందని కేసీఆర్ లెక్కలు వేస్తున్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు చెపతున్నాయ్.
ఈసారి ఎన్నికల్లో తొందరపాటు నిర్ణయాలు, భేషజాలకు పోకుండా.. బీఆర్‌ఎస్ పక్కా వ్యూహంతో జనాలకు దగ్గరయ్యేందుకు ప్రణాళిక రచిస్తోంది. రాబోయే 3 నెలల పాటు అటు కేసీఆర్, ఇటు కేటీఆర్.. ఎన్నికల అంశంపైనే ఫోకస్ పెట్టబోతున్నారు. టిక్కెట్ల కేటాయింపులో ద్విముఖ వ్యూహాన్ని అమలు చేస్తూ ప్రతీ నియోజకవర్గంలో రెండు సభలను నిర్వహించబోతున్నారు. ముందుగా కేటీఆర్ అధ్వర్యంలో జరుగనున్న సభలో స్థానిక నాయకుడి జన బలాన్ని అంచనా వేస్తారు. ఆ తర్వాత పక్షం రోజుల గ్యాప్‌తో కేసీఆర్ అధ్యక్షతన మరో బహిరంగ సభ ఉంటుంది. విజయంపై అన్ని కోణాల్లో బల నిరూపణ జరిగిన తర్వాతే స్థానిక సిట్టింగ్ ఎమ్మెల్యేలకు తిరిగి టిక్కెట్ కేటాయిస్తారు.