CM KCR: ఢిల్లీ ఏలుతనంటిని.. కర్ణాటకకు దూరం ఉంటివి.. ఎన్నికలకు దూరం వెనక ప్లానేంది కేసీఆర్ సారూ!

ఢిల్లీని ఏలుతామని ప్రతిన చేసిన కేసీఆర్.. ఎందుకు పక్క రాష్ట్రం ఎన్నికలపై మౌనంగా ఉన్నారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్‌ ప్రశ్నగా మారింది. ఐతే కర్ణాటక మీద కేసీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారు. పొత్తుల సంగతి తర్వాత.. పోటీ మాట కూడా ఎత్తడం లేదు.

  • Written By:
  • Publish Date - April 20, 2023 / 03:49 PM IST

CM KCR: కేసీఆర్‌ను కొట్టాలంటే.. అవతలి వైపు కూడా కేసీఆరే అయి ఉండాలనే మాట ఉంది రాజకీయాల్లో! నిజమే.. నిద్రపోతూ కూడా రాజకీయాలే ఆలోచించే రకం ఆయన. ప్రత్యర్థులు ఒక్కఅడుగు వేసే లోపు.. పది అడుగులు ముందుంటారు ఆయన. అలాంటి కేసీఆర్ ఇప్పుడు జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఢిల్లీపై దండయాత్ర మొదలుపెట్టారు. ఒక్కోపావు జాగ్రత్తగా కదుపుతున్నారు.

ఐతే ఢిల్లీని ఏలుతామని ప్రతిన చేసిన కేసీఆర్.. ఎందుకు పక్క రాష్ట్రం ఎన్నికలపై మౌనంగా ఉన్నారన్నది ఇప్పుడు మిలియన్ డాలర్‌ ప్రశ్నగా మారింది. టీఆర్ఎస్‌ను బీఆర్ఎస్‌గా మార్చిన తర్వాత.. కేసీఆర్ చూపించిన దూకుడు అంతా ఇంతా కాదు. ఆయన వెళ్లి కొందరు జాతీయనేతలను కలిస్తే.. కొందరు నేతలు హైదరాబాద్‌ వచ్చి మరీ కేసీఆర్‌తో భేటీ అయ్యారు. దేశవ్యాప్తంగా పర్యటనలు, ఆయా రాష్ట్రాలలో బహిరంగసభలు, ముఖ్యనేతలతో భేటీలు.. ఇలా మాములు హడావుడి చేయలేదు కేసీఆర్! ఏదో జరగబోతోంది అనుకునే సమయంలోపే.. అంతా సైలెంట్ అయింది పరిస్థితి. జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ పెట్టినప్పటి నుంచి కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి.. కేసీఆర్‌‌కు మద్దతుగా నిలిచారు. ఇద్దరు కలిసి బహిరంగ సభలకు కూడా హాజరయ్యారు.

దీంతో కర్ణాటకలో జేడీఎస్‌, బీఆర్ఎస్‌ మధ్య పొత్తు దాదాపు ఖాయం అని అనుకున్నారంత ! కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేస్తారనే టాక్ కూడా గట్టిగా వినిపించింది. కట్‌ చేస్తే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల టైమ్ వచ్చేసింది. కొద్ది రోజుల్లో ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి. ఐతే కర్ణాటక మీద కేసీఆర్ మాత్రం మౌనంగా ఉన్నారు. పొత్తుల సంగతి తర్వాత.. పోటీ మాట కూడా ఎత్తడం లేదు. కర్ణాటకలో ఇప్పటికే ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థులను ప్రకటించాయి. అన్ని రాష్ట్రాల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని చెప్పిన కేసీఆర్ మాత్రం.. కర్ణాటక విషయంలో మౌనంగా ఉంటున్నారు. దీంతో కేసీఆర్ ఆలోచనలు ఏంటి.. వ్యూహాలు ఏంటి అనేది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. నిజానికి ఆరంభంలో దోస్తీకి జేడీఎస్‌ ఆసక్తి చూపించింది.

ఏం జరిగిందో.. దోస్తీ చేస్తే ఏం జరుగుతుందని అనుకున్నారో కానీ.. గులాబీ పార్టీతో పొత్తుకు కుమారస్వామి పెద్దగా సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో కేసీఆర్ కూడా మౌనంగా ఉండిపోయారు. ఎన్నికలు జరగబోయే కర్ణాటకను పక్కనపెట్టి.. ఇప్పట్లో అసలు ఎన్నికలే లేని మహారాష్ట్ర మీద కేసీఆర్ ఫోకస్ పెట్టారు. వరుస బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే రెండు సభలు నిర్వహించి.. చేరికలకు తెరతీశారు. దీంతో కేసీఆర్ స్ట్రాటజీ ఏంటా అనేది మరింత ఆసక్తికరంగా మారింది. ఎప్పటికప్పుడు వ్యూహాలు మార్చడం, సడెన్ నిర్ణయాలు తీసుకోవడంలో.. కేసీఆర్ తర్వాతే ఎవరైనా! కర్ణాటక విషయంలో మౌనంగా ఉండి.. మహారాష్ట్ర విషయంలో యాక్టివ్ అవడం వెనక కూడా ఏదో వ్యూహం ఉండే ఉంటుందనే చర్చ రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.