CM KCR: తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్న గజ్వేల్ నియోజకవర్గాన్ని వీడి, కామారెడ్డి నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. దీనికి ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి గజ్వేల్‌లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం కాగా, మరొకటి కామారెడ్డిలో పోటీ చేయడం ద్వారా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభావం పెరుగుతుందని భావించడమే.
కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి 2014, 2018లో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ ఏడాది చివర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా అక్కడి నుంచే పోటీ చేసి హ్యాట్రిక్ కొట్టాలని భావించారు. నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందో అంతర్గత సర్వే చేయించుకున్నారు. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. కేసీఆర్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవు. స్థానికుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. అలాంటిది మళ్లీ గజ్వేల్ నుంచి పోటీ చేస్తే ఓడిపోయే అవకాశం ఉంది. ఇదే జరిగితే కేసీఆర్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకోవాల్సి వస్తుంది. పార్టీ అధ్యక్షుడు, సీఎం అయ్యుండి ఓడిపోవడం అంటే మామూలు విషయం కాదు. అందుకే అక్కడి నుంచి పోటీ చేయకుండా మరో నియోజవర్గాన్ని ఎంచుకునేందుకు సిద్ధమయ్యారు. దీనిపై కూడా సర్వేలు నిర్వహించుకున్నారు.
సిద్ధిపేటపై కన్ను
గతంలో కేసీఆర్ సిద్ధిపేట నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. తను మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసింది సిద్ధిపేట నుంచే. 1983లో తొలిసారిగా టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అప్పటి నుంచి 2004 వరకు వరుసగా అన్ని ఎన్నికల్లోనూ సిద్ధిపేట నుంచే పోటీ చేసి గెలిచారు. ఒక ఉప ఎన్నికతో కలసి ఏకంగా ఏడుసార్లు గెలిచారు. ఆ తర్వాత కరీంనగర్ నుంచి పార్లమెంట్ స్థానానికి పోటీ చేసి గెలిచారు. చివరకు గజ్వేల్ నియోజకవర్గానికి మారారు. ప్రస్తుత పరిస్థితుల్లో తనకు అచ్చొచ్చిన సిద్ధిపేట నుంచి తిరిగి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అని కూడా పరిశీలించారు. దీనిపై సర్వే కూడా చేయించుకున్నారు. కానీ, అక్కడ ప్రస్తుత మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ లీడర్, కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు ఎమ్మెల్యేగా ఉన్నారు. కేసీఆర్ అక్కడి నుంచి పోటీ చేస్తే హరీష్ రావుకు ఇబ్బంది. అలాగే పార్టీ నుంచి, ప్రతిపక్షాల నుంచి భిన్న వాదనలు రావొచ్చు. అందుకే సిద్ధిపేట నుంచి పోటీ చేయాలనే ఆలోచన విరమించుకున్నారు. దీంతోపాటు రఘునందన్ రావు (బీజేపీ) ఎమ్మెల్యేగా ఉన్న దుబ్బాక నుంచి కూడా పోటీ చేయాలని ఆలోచించి, సర్వే నిర్వహించారు. అయితే, అక్కడ పరిస్థితులు పూర్తి సానుకూలంగా లేవని సర్వేలో తేలింది. దీంతో కామారెడ్డి వైపు మొగ్గు చూపారు. అక్కడి నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయని సర్వేలో తేలడంతో కామారెడ్డి నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ ప్రస్తుతం గంప గోవర్ధన్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.
ఉత్తర తెలంగాణపై ఫోకస్
కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో కామారెడ్డి నుంచి పోటీ చేయడం దాదాపు ఖాయమే. దీనివల్ల గజ్వేల్ నుంచి బయటపడ్డట్లు అవ్వడమే కాకుండా.. చుట్టుపక్కల జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రభావం పెరుగుతుంది. కామారెడ్డి ఉత్తర తెలంగాణలో ఉన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ఇక్కడ పోటీ చేయడం వల్ల ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఉమ్మడి కరీంనగర, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలపై ఆ ప్రభావం ఉంటుంది. మోదీ వారణాసిలో పోటీ చేయడం వల్ల యూపీలో అత్యధిక సీట్లు గెలుచుకుంది. ఇదే తరహా ప్లాన్‌ను బీఆర్ఎస్ అమలు చేయబోతుంది. దీనికి అనుగుణంగా కేటీఆర్ ఇక్కడి వ్యవహారాలపై ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణ సీట్లు ప్రస్తుతం బీఆర్ఎస్‌కు చాలా కీలకం. ఎందుకంటే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో కాంగ్రెస్ బలపడుతున్నట్లు సర్వేలే తేల్చాయి. వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాల్లో కాంగ్రెస్ ప్రభావం పెరుగుతోంది. అందుకే అటువైపు కాకుండా.. ఉత్తర తెలంగాణపై ఫోకస్ చేయడం ద్వారా అధిక సీట్లు గెలుచుకోవచ్చు అన్నది బీఆర్ఎస్ ప్లాన్.
ఛాలెంజ్ విసురుతున్న రేవంత్
గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ పరిస్థితిపై అవగాహన ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. కేసీఆర్‌కు ఛాలెంజ్ విసిరారు. దమ్ముంటే కేసీఆర్ గజ్వేల్ నుంచి పోటీ చేయాలని సవాల్ చేశారు. గజ్వేల్ నుంచి పోటీ చేసి గెలవాలని, అలాగే తమ ప్రభుత్వ పాలనపై కేసీఆర్‌కు అంత నమ్మకం ఉంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టిక్కెట్లు ఇవ్వాలని సవాల్ విసిరారు. మరోవైపు గతంలోనే ఈ అంశంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా కేసీఆర్‌కు సవాల్ విసిరారు. తాను అవసరమైతే గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీ చేసి గెలుస్తానన్నారు. ఈ విషయంలో బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి అన్నారు. ఇటు కాంగ్రెస్ నుంచి.. అటు బీజేపీ నుంచి సవాళ్లు వచ్చినా కేసీఆర్ మాత్రం గజ్వేల్‌లో పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. దీనిద్వారా ప్రతిపక్షాలకు కేసీఆర్ ఒక అస్త్రాన్ని అందించినట్లైంది.