కేసీఆర్ వ్యూహాలను అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. ప్రత్యర్థి ఒక్క అడుగు వేసేలోపు.. పది అడుగుల దూరంలో ఉంటారు కేసీఆర్. ఆయనను అందుకోవడమే కాదు.. అందుకోవాలనుకోవడం కూడా అంత ఈజీ కాదు అంటుంటారు రాజకీయం తెలిసినవాళ్లు. తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్‌కు.. కాంగ్రెస్, బీజేపీ గట్టిపోటీ ఇస్తున్నాయ్. కర్ణాటక విజయంతో కాంగ్రెస్‌కు ఒక్కసారిగా పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయ్. తెలంగాణలో కాంగ్రెస్ ఇప్పటికీ బలంగానే ఉంది.
బీఆర్ఎస్ తర్వాత క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం స్ట్రాంగ్‌గా ఉన్నది కాంగ్రెస్‌కే ! ఐతే ఇంటిపోరుతో కేడర్‌ను పట్టించుకోవడం మానేశారు నాయకులు. కర్ణాటక విజయంతో ఇప్పుడు నేతలంతా ఏకమై కలిసి సాగితే.. కాంగ్రెస్‌ను ఎదుర్కోవడం కారు పార్టీకి అంత ఈజీ కాదు. ఈ విషయం తెలిసే కేసీఆర్ ముందుగానే అప్రమత్తం అయ్యారని.. అందుకే బీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహిస్తున్నారనే చర్చ జరుగుతోంది. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉన్న పార్టీగా బీఆర్ఎస్ మీద జనాల్లో అంతో ఇంతో వ్యతిరేకత ఉంది. సంక్షేమ పథకాలు మాత్రమే గట్టెక్కించవ్. అది కేసీఆర్‌కు కూడా తెలుసు. ఇది మరింత బలపడకుండా చూడాలన్నదే కేసీఆర్ ప్లాన్. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకే ఈ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు.
ఇప్పటి నుంచి ఎన్నికల వరకు ప్రతీ క్షణం జనాల్లోనే ఉంటూ.. జనం సమస్యలు తెలుసుకుంటూ.. వారిలో నమ్మకం కలిగించేలా చర్యలు తీసుకోవాలని సూచించే అవకాశాలు ఉన్నాయ్. దీంతో పాటు ఎమ్మెల్యేల పనితీరు మీద తాను రెడీ చేయించిన నివేదికలను కూడా ఈ సమావేశంలో ప్రకటించే అవకాశాలు ఉన్నాయ్. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను టెన్షన్ పెడుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో.. ఎమ్మెల్యేలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు కేసీఆర్. పనితీరు సరిగ్గా లేదని కొందరిని.. అవినీతి చేస్తున్నారని మరికొందరిని టార్గెట్ చేసి మరీ మాటలు సంధించారు. తీరు మార్చుకోవాలని లేదంటే టికెట్ డౌటే అని వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ హెచ్చరించిన నేతలంతా ఇప్పుడు టెన్షన్‌లో పడిపోయారు. మీటింగ్‌లో కేసీఆర్ ఎలాంటి విషయాలు బయటపెట్టబోతున్నారు. తమ గురించి కేసీఆర్ దగ్గర ఉన్న రిపోర్టు ఏంటి.. టికెట్ విషయం ఈ మీటింగ్‌లో తేల్చేస్తారా అనే చర్చ బీఆర్ఎస్ నేతలకు గుబులు రేపుతోంది.