CM KCR: ఇండియాలో చేరం.. ఎన్డీయేతో కలవం.. రెండింటికీ దూరమే అంటున్న కేసీఆర్

ఒకవైపు ఇండియా పేరుతో ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడగా.. మరోవైపు ఎన్డీయే కూడా బలపడుతోంది. ఈ రెండు కూటములకు బీఆర్ఎస్ దూరంగా ఉంటూ వస్తోంది. దీంతో అసలు బీఆర్ఎస్ ఎటువైపు ఉంటుంది అని నెలకొన్న సందేహాలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చేశారు.

  • Written By:
  • Publish Date - August 2, 2023 / 12:35 PM IST

CM KCR: కేంద్ర రాజకీయాల్లో బీఆర్ఎస్ వైఖరి ఆసక్తికరంగా మారింది. ఒకవైపు ఇండియా పేరుతో ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడగా.. మరోవైపు ఎన్డీయే కూడా బలపడుతోంది. ఈ రెండు కూటములకు బీఆర్ఎస్ దూరంగా ఉంటూ వస్తోంది. దీంతో అసలు బీఆర్ఎస్ ఎటువైపు ఉంటుంది అని నెలకొన్న సందేహాలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చేశారు. తాము ఏ కూటమితోనూ కలిసేది లేదన్నారు. ఇండియా కూటమి, ఎన్డీయే కూటమి.. రెండింటికీ సమదూరం పాటిస్తామని స్పష్టం చేశారు.

మంగళవారం మహారాష్ట్రలో పర్యటించిన సీఎం కేసీఆర్ తాజా వ్యాఖ్యలు చేశారు. తమకు ఏ కూటమిలోనూ చేరాల్సిన అవసరం లేదని, అలాగని దేశ రాజకీయాల్లో ఒంటరిగా లేమన్నారు. తమ పార్టీతో కలిసొచ్చే మిత్రులు ఉన్నారని చెప్పారు. “దేశంలో యాభై ఏళ్లకుపైగా అధికారంలో ఉన్నవి ఆ కూటములే. అయినా.. దేశంలో సరైన మార్పు రాలేదు. దేశంలో నూతన మార్పు రావాల్సిందే. మారాల్సింది పార్టీలు కాదు.. దేశం” అని కేసీఆర్ స్పష్టం చేశారు. దీని ద్వారా తమపార్టీ రెండు పక్షాలకు సమదూరం పాటిస్తున్నట్లు బీఆర్ఎస్ అధినేత స్పష్టం చేశారు. అయితే, తెలంగాణలో మాత్రం బీజేపీ, కాంగ్రెస్‌లు ఈ విషయంలో బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పిస్తున్నాయి. కేంద్రంలో బీజేపీకి బీఆర్ఎస్ మద్దతుగా ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తుంటే.. కాంగ్రెస్‌తోనే ఒప్పందం కుదుర్చుకుందని బీజేపీ విమర్శిస్తోంది. ఈ విమర్శలు బీఆర్ఎస్‌కంటే.. ఆ రెండు పార్టీలకే ఇబ్బందిగా మారాయి.

మరోవైపు మహారాష్ట్రపై కేసీఆర్ ప్రత్యేక దృష్టిపెట్టినట్లు కనిపిస్తోంది. తెలంగాణ తర్వాత జాతీయ రాజకీయాల్లో ఆయన మహారాష్ట్రపైనే ఫోకస్ చేస్తున్నారు. వరుసగా మహారాష్ట్రలో పర్యటిస్తూ పార్టీ కమిటీల్ని నియమిస్తున్నారు. తాజాగా వాటేగావ్‌లో అన్నాభావూ సాఠే 103వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేసీఆర్‌ మాట్లాడారు. మహారాష్ట్ర నుంచే ఎన్నికల యుద్ధం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని గ్రామాల్లోనూ తొమ్మిది బీఆర్ఎస్ కమిటీలను నియమిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే యాభై శాతం గ్రామాల్లో కమిటీల ఏర్పాటు పూర్తయిందని, మరికొద్ది రోజుల్లో మిగిలిన గ్రామాల్లో కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.