CM KCR: ఎన్నికల వేళ కేసీఆర్ మార్క్ టచ్.. వీఆర్ఏ వ్యవస్థ రద్దు.. ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరణ

వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. వీఆర్ఏల విద్యార్హతల ఆధారంగా వీఆర్ఏలను నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖ, మిషన్‌ భగీరథ విభాగాలలో సర్దుబాటు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు.

  • Written By:
  • Publish Date - July 24, 2023 / 10:10 AM IST

CM KCR: ఎన్నికలు సమీపిస్తున్న వేళ పాలనాపరమైన సంస్కరణలకు కేసీఆర్ సిద్ధమవుతున్నారు. నీరటి, మస్కూర్, లష్కర్ వంటి నిజాం కాలంనాటి పేర్లతో పిలిచే, భూస్వామ్య వ్యవస్థకు చిహ్నాలుగా నిలిచిన వీఆర్ఏ వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ సీఎం కేసీఆర్ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. వీఆర్ఏలుగా పనిచేస్తున్న సిబ్బందిని రెవెన్యూ శాఖలో సూపర్ న్యూమరరీ పోస్టుల్లో క్రమబద్ధీకరించనున్నట్టు సీఎం తెలిపారు. ఈ అంశంపై ఉన్నతాధికారులతో ఆదివారం సమీక్ష నిర్వహించారు.

వీఆర్ఏల విద్యార్హతల ఆధారంగా వీఆర్ఏలను నీటిపారుదల శాఖ, పంచాయతీరాజ్‌, పురపాలక శాఖ, మిషన్‌ భగీరథ విభాగాలలో సర్దుబాటు చేయాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇకపై వీఆర్ఏలు ఈ నాలుగు శాఖల్లో వివిధ హోదాల్లో పని చేస్తారు. వీఆర్‌ఏలకు సంబంధించి కారుణ్య నియామకాలపై కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనిపై సోమవారం అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. 61 ఏళ్లు పైబడిన వీఆర్ఏల వారసులను కారుణ్య నియామకం కింద ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తారు. అలాగే తెలంగాణ ఏర్పడిన తర్వాత 61 ఏళ్లలోపు ఉండి, వీఆర్ఏగా పని చేస్తూ, మరణించిన వారి కుటుంబ సభ్యులకు కూడా ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

అలాంటివారి వారసులకు విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో ఉద్యోగాలు కేటాయిస్తారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సూచనల ఆధారంగా వీఆర్ఏలను వివిధ శాఖల్లో నియమిస్తారు. నీటి పారుదల శాఖలో దాదాపు 5,900 మంది వీఆర్ఏలను సద్దుబాటు చేస్తారుు. త్వరలోనే ఈ విషయంలో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందిస్తారు. నీటిపారుదలకు సంబంధించిన ప్రాజెక్టులు, కాల్వలు, చెరువులు, తూములను వీరు పర్యవేక్షించాల్సి ఉంటుంది. కాల్వలకు గండ్లు పడకుండా చూడటం, పిచ్చి మొక్కలు తొలగించడం వంటి విధులు చేయాలి. మిషన్ భగీరథ స్కీం కోసం మరో మూడు వేల మంది వీఆర్ఏలను కేటాయిస్తారు. మొత్తంగా తెలంగాణలో 20,555 మంది వీఆర్ఏలు ఉన్నట్లు అంచనా.

వీరిలో కొందరు ఏడో తరగతి నుంచి డిగ్రీ చదివిన వాళ్లు ఉన్నారు. వారి అర్హతను బట్టి ఇతర శాఖల్లోనూ జూనియర్ అసిస్టెంట్, రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ వంటి విధుల్లో కూడా నియమిస్తారు. డిగ్రీకంటే ఎక్కువ చదువుకున్న వారికి జూనియర్ అసిస్టెంట్లుగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం వీఆర్ఏలకు రెవెన్యూ శాఖలో రూ.10,500 గౌరవ వేతనం అందుతోంది. వీరు ఇప్పటివరకు తాత్కాలిక ఉద్యోగులుగా మాత్రమే ఉన్నారు. ఎప్పటినుంచో క్రమబద్దీకరణ, జీతాల పెంపు గురించి డిమాండ్ చేస్తున్నారు. తాజాగా వారి ఆకాంక్షలను గుర్తిస్తూ, కేసీఆర్ ప్రభుత్వం కీలక నిర్ణ‍యం తీసుకుంది. ఈ నిర్ణయంపై వీఆర్ఏలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ పార్టీకి కలిసొస్తుందని బీఆర్ఎస్ భావిస్తోంది.