CM KCR: తెలంగాణ ప్రభుత్వం రియల్‌ఎస్టేట్ వ్యాపారి అవతారం ఎత్తింది. పథకాలకు పైసల కోసం ఆస్తులు అమ్ముకుంటోంది. ఎన్నికల వేళ పథకాల అమలుకు భూముల అమ్మకాలే మార్గమంటోంది ప్రభుత్వం. మరి ఇంత అర్జెంటటుగా భూములెందుకు అమ్ముతోంది..?
రండి బాబు రండి.. మంచి తరుణం మించిన దొరకదు.. వేలం పాటలో పాల్గొనండి.. భూములు కొనుక్కోండి.. ఇదేదో రియల్ ఎస్టేట్ సంస్థ ప్రకటన కాదు.. తెలంగాణ ప్రభుత్వం వారి ఆహ్వానం. అలాగని ఎగేసుకుని వెల్దామనుకోకండి.. కోట్లు చేతిలో ఉంటేనే అటువైపు చూడండి. తెలంగాణ ప్రభుత్వం వరుసబెట్టి భూములు అమ్ముతోంది. నియోపొలిస్‌లో ఎకరం వందకోట్లు పలకడంతో కొత్స ఉత్సాహంతో ఉన్న కేసీఆర్ సర్కార్ తాజాగా బుద్వేల్‌లో మరో వంద ఎకరాలు అమ్మేందుకు రెడీ అయ్యింది. ఇక్కడ ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరాకు రూ.20 కోట్లు లెక్కేసుకున్నా… రూ.2 వేల కోట్లు వస్తాయి. ఇక ఆపై ఎంత ధర పలికితే ఖజానాకు అంత కాసుల గలగల. అలాగే ఈ నెల చివర్లో రాజేంద్రనగర్‌లో మరో 60 ఎకరాలను లేక్‌సిటీ పేరుతో అమ్మేయబోతోంది. ఇక మోకిలాలో కూడా ఫ్లాట్లు అమ్మకానికి రెడీగా ఉన్నాయి.
నియోపొలిస్‌లో ఎకరా వంద కోట్ల రూపాయలు పలికింది. మిగిలిన ప్రాంతాల్లోనూ భూములకు భారీగా డిమాండ్ ఉంటుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. వంద కోట్లు రాకపోయినా ఎకరా సగటున రూ.50 కోట్లైనా వస్తుందని అంచనా వేస్తోంది. అంటే కనీసం ఓ పదివేల కోట్లయినా వస్తాయన్నది ప్రభుత్వం ఆలోచన. ఇదేకాదు.. ఇంకా రెండు నెలలకు పైగా టైమున్నా లిక్కర్ షాపులకు ముందుగానే టెండర్లు పిలవడానికి కారణం కూడా డబ్బులే. రిజిస్ట్రేషన్లు, డిపాజిట్ మనీ ద్వారా వచ్చే మొత్తంతో ఎంతో కొంత అవసరాలు తీరతాయని ప్రభుత్వం భావిస్తోంది.
ఎన్నికల వేళ కావడంతో తెలంగాణ ప్రభుత్వం ప్రజాకర్షక నిర్ణయాలు ప్రకటిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసింది. తాజాగా రైతు రుణమాఫీని పూర్తి చేస్తామని ప్రకటించింది. అలాగే బీసీ బంధు ప్రకటించింది. వీటన్నింటికీ ఇప్పుడు నిధులు అత్యవసరం. ఒక్క రైతు బంధు కోసమే రూ.19 వేల కోట్లు కావాలి. ఇప్పుడు అంత భారం భరించే పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం లేదు. పోనీ అప్పులు తెద్దామా అంటే కేంద్రం షరతులు అడ్డంగా ఉన్నాయి. అందుకే భూముల అమ్మకంపై ఫోకస్ పెట్టింది. అంటే భూములు అమ్మేసి ఆ పథకాలు అమలు చేస్తుందన్నమాట. వాటిని చూపించి వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. మరి ఇలా ఎన్నాళ్లు ఎన్ని భూములు అమ్ముకుంటూ పోతారో చూడాలి మరి.