Telangana BJP: పాపం బీజేపీ.. కేసీఆర్ పట్టించుకోవట్లే.. పరేషాన్ అవుతున్న తెలంగాణ బీజేపీ నేతలు..!

బీజేపీని కేసీఆర్ తిట్టడం, దానికి బీజేపీ స్పందించడం.. ఆ తర్వాత కేసీఆర్, బీఆర్ఎస్‌పై తెలంగాణ బీజేపీ నేతలు, జాతీయ స్థాయి నేతలు విమర్శలు చేయడం.. దీనికి కేసీఆర్ అండ్ కో స్పందించడం.. ఇలా తెలంగాణ రాజకీయం కేసీఆర్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగింది. అయితే, ఇప్పుడు బీజేపీ పెద్దగా లైమ్‌లైట్లో లేదు.

Telangana BJP: తెలంగాణ బీజేపీకి కొత్త చిక్కు వచ్చి పడింది. అదే సీఎం కేసీఆర్ తమను పట్టించుకోకపోవడం. ఇంతకాలం బీజేపీకి ఆమాత్రం హైప్ వచ్చిందంటే దానికి కారణం కూడా కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీనే. బీజేపీని కేసీఆర్ తిట్టడం, దానికి బీజేపీ స్పందించడం.. ఆ తర్వాత కేసీఆర్, బీఆర్ఎస్‌పై తెలంగాణ బీజేపీ నేతలు, జాతీయ స్థాయి నేతలు విమర్శలు చేయడం.. దీనికి కేసీఆర్ అండ్ కో స్పందించడం.. ఇలా తెలంగాణ రాజకీయం కేసీఆర్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగింది. అయితే, ఇప్పుడు బీజేపీ పెద్దగా లైమ్‌లైట్లో లేదు. కారణం.. కేసీఆర్ బీజేపీని పట్టించుకోకపోవడమే.
ఏ పార్టీ అయినా ప్రజల్లో ఉండాలంటే.. పార్టీ తరఫున ఏదో ఒక కార్యక్రమం చేపట్టాలి. లేదా పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ ఉండాలి. పాపం.. బీజేపీకి ఇప్పుడా రెండూ లేవు. ఇంతకాలం బీజేపీనే తనకు అసలైన ప్రత్యర్థి అని కేసీఆర్ భావించేవారు. అందువల్ల వీలున్నప్పుడల్లా కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు బీజేపీపై విరుచుకుపడేవాళ్లు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారింది. బీజేపీకి అంత సీన్ ఉండకపోవచ్చని కేసీఆర్ అర్థం చేసుకున్నట్లున్నారు. పైగా ఆ పార్టీ గురించి తాను ఏది మాట్లాడినా అనవసరంగా ప్రచారం కల్పించినట్లవుతుందని కేసీఆర్ అనుకుంటున్నట్లుంది. దీని బదులు బీజేపీని అసలు లెక్కచేయకుండా ఉంటే చాలు.. ఆ పార్టీని ఎవరూ పట్టించుకోరు అనేది కేసీఆర్ ఉద్దేశం కావొచ్చు. అందుకే ఒకవైపు బీజేపీ నేతలు కేసీఆర్‌‌ను విమర్శిస్తున్నా అటువైపు నుంచి మాత్రం స్పందన రావడం లేదు. దీంతో బీజేపీ నేతలకు ఏం చేయాలో తోచడం లేదు. బీజేపీ విషయంలో కేసీఆర్ సైలెన్స్‌గా ఉండటమే ఇప్పుడు బీజేపీకి సంకటంగా మారింది.
వ్యూహాత్మక మౌనమా?
కేసీఆర్ విమర్శించినా.. విమర్శించకపోయినా.. దాని వెనుక పెద్ద ప్రణాళికే ఉంటుంది. మొన్నటిదాకా కాంగ్రెస్ గురించి పెద్దగా పట్టించుకోకుండా బీజేపీపై దృష్టిపెట్టారు. మోదీ సహా బీజేపీని విమర్శించారు. ఈ విషయంలో కేసీఆర్ ఉన్నట్లుండి సైలెంట్ అయిపోయారు. కొంతకాలంగా బీజేపీపై ఒక్క విమర్శా చేయడం లేదు. ఆ పార్టీ నేతలు కూడా పెద్దగా స్పందించడం లేదు. ఇదంతా కేసీఆర్ వ్యూహమే అని భావించాలి. దీని వెనుక అసలు ఉద్దేశం ఏంటో మాత్రం తెలియడం లేదు. రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి బీజేపీని విమర్శించి, ఆ పార్టీకి అనవసర ప్రాధాన్యం కల్పించకపోవడం. బీజేపీని పట్టించుకోనట్లు ఉంటే చాలు.. ఆ పార్టీకి జరగాల్సిన నష్టం జరుగుతుంది అని కేసీఆర్ నమ్ముతూ ఉండొచ్చు. లేదా బీజేపీతో సఖ్యత కోసం అయినా కేసీఆర్ మౌనంగా ఉంటున్నట్లు భావించాలి. కారణాలు ఏవైనా కేసీఆర్ కావాలనే బీజేపీ విషయంలో పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారన్నది నిజం.
కవిత కోసమేనా?
కేసీఆర్ కూతురు కవిత లిక్కర్ స్కాంలో ఇరుక్కున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పాత్ర ఉందని సీబీఐ, ఈడీ వాదిస్తున్నాయి. ఇప్పటికే ఈ స్కాంకు సంబంధించి సీబీఐ పలువురిని అరెస్టు చేసింది. త్వరలో కవిత కూడా అరెస్టు అవుతారని ప్రచారం జరిగింది. ఈ కేసు విషయంలో కవితను తప్పించేందుకు బీజేపీతో కేసీఆర్ దగ్గరవ్వాలనుకుంటున్నారని కాంగ్రెస్ విమర్శిస్తోంది. మొన్నటివరకు బీజేపీని దారుణంగా విమర్శించిన కేసీఆర్ కవిత కోసమే బీజేపీ విషయంలో మౌనంగా ఉంటున్నారని ఆరోపణలున్నాయి.
కాంగ్రెస్‪కు కలిసొస్తున్న కేసీఆర్ వైఖరి
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే అని బీజేపీ.. లేదు.. లేదు.. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని కాంగ్రెస్ విమర్శలు చేసుకుంటూ ఉంటాయి. ఈ రెండింట్లో ఏది నిజమో తెలీదు కానీ.. ప్రస్తుతం కేసీఆర్ వైఖరి చూస్తుంటే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. బీజేపీ విషయంలో గతంలోలాగా కేసీఆర్ విమర్శలు చేయకపోవడం వెనుక రెండు పార్టీల మధ్య చీకటి ఒప్పందం ఉందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. బీజేపీపై దూకుడుగా వెళ్తానని చెప్పిన కేసీఆర్ వైఖరి మార్చుకోవడం ఈ వాదనకు బలం చేకూరుస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఇది కాంగ్రెస్ పార్టీకి అనుకూలించే అవకాశం ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని.. కాంగ్రెస్‌కే ఓటేయాలని ఆ పార్టీ అడిగే అవకాశం ఉంది. ఇది మరింతగా జనంలోకి వెళ్తే.. బీఆర్ఎస్‌కు మాత్రం పెద్దగా నష్టం ఉండకపోవచ్చు. కానీ, బీజేపీకి మాత్రం గట్టి ఎదురుదెబ్బే. ఈ విషయంలో బీజేపీకి ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియడం లేదు. కేసీఆర్, బీఆర్ఎస్ తమపై విమర్శలు చేస్తే.. వాటిని తిప్పికొట్టి ఘాటుగా బదులిద్దామని బీజేపీ కాచుక్కూర్చుంది. కానీ, కేసీఆర్ ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు.