CM KCR: తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రత్యర్థి పార్టీలకు అవకాశం ఇవ్వకూడదనే లక్ష‌్యంతో, ముందుగాన ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ ఆలోచిస్తున్నారు. త్వరలోనే తెలంగాణ అసెంబ్లీ రద్దు కావొచ్చని, ఈ దిశగా ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని విశ్లేషకుల అంచనా.
తెలంగాణలో డిసెంబర్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడాలి. నవంబర్ చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాలి. అయితే, ఆ లోపే ఎన్నికలొచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి.
కారణం.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించుకోవడమే. దీనికి అనేక కారణాలున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో విజయం తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతూ వస్తోంది. తెలంగాణలోనూ కాంగ్రెస్‌కు ఆదరణ పెరుగుతోంది. రోజురోజుకూ పార్టీ పుంజుకుంటోంది. ఎన్నికలు ఆలస్యం అయ్యేకొద్దీ కాంగ్రెస్ బలపడుతుంది. కాంగ్రెస్ పుంజుకుంటున్నట్లు, బీఆర్ఎస్‌పై వ్యతిరేకత పెరుగుతున్నట్లు ఇంటలిజెన్స్ నివేదిక కూడా అందింది. ఈ విషయం గుర్తించిన కేసీఆర్.. కాంగ్రెస్ హవాను అడ్డుకోవాలంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ఒక్కటే పరిష్కారమని కేసీఆర్ భావిస్తున్నారు. దీంతో ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ దిశగా నేతలకు ఇప్పటికే సంకేతాలు కూడా పంపారు. దీంతో ఎమ్మెల్యేలు, టిక్కెట్లు ఆశిస్తున్న ప్రజా ప్రతినిధులంతా ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయారు.
కేంద్రం అండ
ముందస్తు ఎన్నికలకు వెళ్లాలంటే దీనికి కేంద్రం అనుమతి, సహకారం తప్పనిసరి. అందుకే కేంద్రానికి ఈ విషయం గురించి వివరించేందుకు గత నెలలో కేటీఆర్ ఢిల్లీలో పర్యటించారు. అసెంబ్లీని రద్దు చేసి, ముందస్తు ఎన్నికలకు వెళ్తామని, ఈ విషయంలో సహకరించాలని బీఆర్ఎస్ కేంద్రాన్ని కోరింది. దీనికి కేంద్రం నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఢిల్లీలో హోంశాఖ, ఎన్నికల సంఘం అధికారులతో కూడా చర్చలు జరిగాయి. కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా హైదరాబాద్ వచ్చి, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. ఓటర్ల జాబితా, ఈవీఎంల తనిఖీ, ఎన్నికల సిబ్బంది ఎంపిక, శిక్షణ, భద్రత, అధికారుల కేటాయింపు, తదితర అంశాలపై చర్చించారు. ఈ పనులన్నీ పూర్తైపోయాయి. ఎన్నికల నిర్వహణకు అధికారయంత్రాంగా ఒక పక్క అన్ని ఏర్పాట్లు చేసేస్తోంది.
పక్కా ప్లాన్‌తో సిద్ధమవుతున్న బీఆర్ఎస్
కేంద్రం నుంచి కూడా అనుమతి రావడంతో త్వరలోనే అసెంబ్లీ రద్దు చేసి, ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్ నిర్ణయించారు. ఎన్నికలకు మరో రెండు నెలలే సమయం ఉన్న నేపథ్యంలో ఈ లోపే ప్రభుత్వ కార్యక్రమాలు పూర్తి చేయడం, పథకాలు అమలు చేయడం వంటివి చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. కొత్త పథకాలను కూడా ప్రారంభించబోతుంది. ప్రభుత్వ, సంక్షేమ పథకాల్ని అమలు చేయడం, కొత్తవారిని ఎంపిక చేయడం వంటివి చేపడుతున్నారు. దీని ద్వారా ఓటు బ్యాంకును పెంచుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే వీటిని అమలు చేయడం సాధ్యం కాదు కాబట్టి, ఆలోపే అన్ని పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించుకుంది.
కాంగ్రెస్, బీజేపీకి ఛాన్స్ లేకుండా
ఎన్నికలకు సిద్ధం కావడమంటే ఏ పార్టీకైనా కత్తిమీద సామే. అధికార పార్టీకి పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ, ప్రతిపక్షాలకు మాత్రం చాలా సమస్యలుంటాయి. పార్టీ వ్యూహాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. సరైన అభ్యర్థుల్ని ప్రకటించాలి. పార్టీలో తిరుగుబాట్లు లేకుండా చూసుకోవాలి. ఆర్థిక వనరుల్ని సిద్ధం చేసుకోవాలి. ప్రచారం నిర్వహించాలి. మేనిఫెస్టో ప్రకటించి, ప్రజలకు చేరువయ్యేలా చూడాలి. అంతర్గత కుమ్ములాటలు లేకుండా కలిసికట్టుగా పని చేయాలి. అప్పుడే ఏ పార్టీకైనా విజయం దక్కుతుంది. అయితే, ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలు ఈ విషయంలో ఇంకా వెనుకబడే ఉన్నాయి. బీజేపీ అయితే ఇంకా ఎన్నికల మూడ్‌లోకి వచ్చినట్లు లేదు. కాంగ్రెస్ ఒకవైపు దూసుకెళ్తున్నప్పటికీ ఈ వేగం సరిపోదు. ఇంకా ప్రజల్లోకి వెళ్లాలి. అందుకు కొంత సమయం పడుతుంది. అయితే, ఆలోపే ఎన్నికలు నిర్వహించి, ప్రతిపక్షాలకు షాక్ ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీలు సిద్ధమయ్యేలోపే ఎన్నికలు నిర్వహిస్తే తనకు ప్రయోజనం ఉంటుందని కేసీఆర్ ఆశ. అందుకే ముందస్తుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ వ్యూహం పక్కాగా అమలైతే వచ్చే సెప్టెంబర్ లేద అక్టోబర్‌లోనే తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి.