CM KCR: ఆ 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్ కష్టమేనా..? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు!

నియోజకవర్గాలకు సంబంధించిన క్షేత్రస్థాయి సమాచారాన్ని కేసీఆర్ తెప్పించుకున్నారు. దీని ప్రకారం తెలంగాణలో 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తాజాగా వారికి హెచ్చరికలు జారీ చేశారు.

  • Written By:
  • Publish Date - May 29, 2023 / 03:53 PM IST

CM KCR: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన 15 మంది ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో సీటు వస్తుందో.. రాదో.. కూడా తెలియడం లేదు. కారణం.. నియోజకవర్గంలో వారి పనితీరు బాగోలేకపోవడమే. తీరు మార్చుకోకుంటే కష్టమని, ఇలా అయితే ఇబ్బంది తప్పదని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ కూడా వార్నింగ్ ఇచ్చేశారు. దీంతో ఇప్పుడా ఎమ్మెల్యేల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది.
బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరిలోనూ ఒకటే ఆశ. ఈసారి కూడా ఎలాగైనా సీటు దక్కించుకోవాలి అని. చాలా మందికి సీటు కన్ఫామ్. గతంలో కేసీఆర్ కూడా ఇదే చెప్పారు. రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకే సీట్లు ఇస్తానని, మరీ పొరపాట్లు చేస్తే తప్ప వేరే వాళ్లకు సీట్లు ఇవ్వబోమని స్పష్టం చేశారు. అయితే, ప్రతి ఒక్కరూ తమ పనితీరు మెరుగుపర్చుకోవాలన్నారు. లేదంటే ఇబ్బంది తప్పదని అప్పుడే హెచ్చరించారు. నియోజకవర్గంలో పరిస్థితి బాగా లేని ఎమ్మెల్యేలకు ఆ విషయం ప్రత్యేకంగా చెప్పారు. దీంతో చాలామంది ఎమ్మెల్యేలు కంగారుపడిపోయి ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేశారు. ఎక్కువ సమయం నియోజకవర్గంలోనే ఉంటూ, అటు కార్యకర్తలు, ఇటు ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు. అయితే, కొందరు మాత్రం తమ పనితీరు మార్చుకోలేదు. దీంతో వారిపై నియోజకవర్గాల్లో మరింత వ్యతిరేకత పెరిగింది. ఇప్పుడు వారికి టిక్కెట్లు ఇస్తే గెలిచే పరిస్థితి లేదు. ఈ విషయం కేసీఆర్ అంతర్గతంగా జరిపిన సర్వేల్లో తేలింది. నియోజకవర్గాలకు సంబంధించిన క్షేత్రస్థాయి సమాచారాన్ని కేసీఆర్ తెప్పించుకున్నారు. దీని ప్రకారం తెలంగాణలో 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తాజాగా వారికి హెచ్చరికలు జారీ చేశారు.
నియోజకవర్గంలోని పరిస్థితిని కేసీఆర్ ఆ ఎమ్మెల్యేలకు వివరిస్తున్నారు. పనితీరు సరిగ్గా లేదని, మార్చుకోవాలని సూచించారు. ఎక్కువ సమయం నియోజకవర్గం బయటే గడుపుతున్నారని, ఇకపై పూర్తిస్థాయిలో నియోజకవర్గంలోనే ఉండాలన్నారు. అలాగే కిందిస్థాయి నాయకులను కూడా కలుపుకొని వెళ్లాలని మందలించారు. అలాగే ఆయా ఎమ్మెల్యేలపై వచ్చిన అనేక ఆరోపణల విషయాన్ని కూడా కేసీఆర్ ప్రస్తావిస్తున్నారు. ఇదే వారికి చివరి హెచ్చరికగా చెప్పారు. పద్ధతి మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో సీటు ఇచ్చే అవకాశం లేదని అర్థమయ్యేలా చెప్పారు. ఇప్పుడా ఎమ్మెల్యేలందరిలోనూ గుబులు మొదలైంది. తమ రాజకీయ భవిష్యత్తుపై భయాలు మొదలయ్యాయి. అర్జెంటుగా నియోజకవర్గంపై దృష్టిపెట్టేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వ పథకాలు అమలు చేసేందుకు, కార్యకర్తల్ని, జనాల్ని ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
గతంలో కూడా సిట్టింగులకు నో
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇవ్వకపోవడం గతంలోనూ చేశారు కేసీఆర్. అంతకుముందు పనితీరు సరిగ్గా లేని వాళ్లకు ఇవ్వకుండా, వేరే వాళ్లకు టిక్కెట్ ఇచ్చారు. అలా మార్చిన చాలా చోట్ల బీఆర్ఎస్ అభ్యర్థులే గెలిచారు. ఇప్పుడు కూడా కేసీఆర్ అలాగే వ్యవహరించబోతున్నారు. అభ్యర్థులు ఎవరూ అనే దానికంటే.. గెలుపు గుర్రాలా కాదా అనేదే ఏ పార్టీకైనా ముఖ్యం. గెలవలేరని తెలిసి కూడా టిక్కెట్లు ఇవ్వడం పొరపాటే అవుతుంది. అలాంటి పొరపాటు కేసీఆర్ చేసే అవకాశం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని గెలిచే వారికే టిక్కెట్ల ఇస్తారు. ఇక కొందరికి సీట్లు ఇవ్వకూడదని కేసీఆర్ ఇప్పటికే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వారికి చెప్పి చూడాలి అనుకుంటున్నారు. ఇలాంటి హెచ్చరికలు అందుకున్న వారిలో మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యే, ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలున్నారు.
వారసులకు అవకాశం ఉందా?
తెలంగాణలో కొందరు ఎమ్మెల్యేలు తమకు కాకుండా తమ వారసులకు టిక్కెట్లు ఇవ్వాలని కోరుతున్నారు. అయితే, వారసులకు టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి తన కొడుకుకు టిక్కెట్ కోరగా కేసీఆర్ కుదరదని తేల్చిచెప్పారు. దీంతో ఈసారి కూడా తానే పోటీ చేయాలని పోచారం నిర్ణయించుకున్నారు. అలాగే తన తనయుడికి టిక్కెట్ ఇవ్వాలని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కోరగా కేసీఆర్ దీన్ని తిరస్కరించారు. అలాగే ఉమ్మడి కరీంగనర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లోని నేతలు, శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా తమ వారసులకు టిక్కెట్ల కోసం ప్రయత్నించగా కేసీఆర్ తిరస్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వారసుల్ని రంగంలోకి దింపి రిస్క్ తీసుకోవడం సరికాదని కేసీఆర్ భావిస్తున్నారు.