CM KCR: రాష్ట్ర సచివాలయం అంటే రాష్ట్రానికి అధికారిక కార్యాలయం. సచివాలయం నుంచే ఏ రాష్ట్ర పాలన అయినా సాగుతుంది. సీఎంతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు అంతా ఇక్కడి నుంచే పాలించాలి. సీఎం తప్పనిసరిగా రోజూ సచివాలయానికి హాజరు కావాలి. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్ తన తొమ్మిదేళ్ల పాలనలో ఒక్కసారి కూడా సెక్రటేరియెట్‌లోకి అడుగుపెట్టలేదు. ప్రగతి భవన్ లేదా తన ఫాంహౌస్ నుంచి మాత్రమే పాలించారు. అందరూ ఏదో సెంటిమెంట్ వల్ల ఫాంహౌస్‌లోకి వెళ్లలేదు అనుకున్నారు. అయితే, ఇప్పుడు కొత్త సెక్రటేరియట్ ప్రారంభమైంది. మరి కేసీఆర్ సారు ఇప్పుడైనా సచివాలయంలోకి అడుగుపెడతారా? లేదా ఎప్పట్లానే ప్రగతి భవన్‌కే జై కొడతారా?
దేశంలో తొమ్మిదేళ్లు సీఎంగా ఉండి సచివాలయంలోకి అడుగుపెట్టని ఏకైక సీఎం బహుశా కేసీఆర్ మాత్రమేనేమో. ఏ రాష్ట్రంలోనూ ఇలా సచివాలయం వైపే కన్నెత్తి చూడని సీఎం లేరు. నిజానికి సచివాలయం నుంచి పాలించడం సీఎం విధి. సచివాలయంలోనే రాష్ట్రానికి సంబంధించిన శాఖలు ఉంటాయి. వివిధ శాఖలకు చెందిన మంత్రులు, కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు ఇక్కడే ఉండి పాలించాలి. అన్ని శాఖలు ఒకే చోట ఉండటం వల్ల పాలన సులభమవుతుంది. ఎందుకంటే ఒక శాఖ, మరో శాఖతో సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.
అందుకే సీఎంతోపాటు మంత్రులు, ఉన్నతాధికారులు అంతా ఒకేచోట కలిసి పని చేసేందుకే సచివాలయాలు ఏర్పాటయ్యాయి. కానీ, తెలంగాణలో ఈ పరిస్థితే లేదు. సీఎం కేసీఆర్ ఒక్క రోజు కూడా సచివాలయంలోకి అడుగుపెట్టలేదు. వివిధ శాఖలు సచివాలయం నుంచే పని చేసినా కేసీఆర్ మాత్రం సెక్రటేరియెట్‌కు వెళ్లలేదు. అధికారుల్ని, మంత్రుల్ని తన అధికారిక నివాసం ప్రగతి భవన్‌కే రప్పించుకునే వాళ్లు. దీంతో ఈ అంశంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. కేసీఆర్ సెక్రటేరియెట్‌కు ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించాయి. ఇది రాజ్యాంగ విరుద్ధమని, కేసీఆర్ దురహంకారానికి నిదర్శనమని ప్రతిపక్ష నేతలు విమర్శించారు. కానీ, అధికార పార్టీకానీ, కేసీఆర్ కానీ ఎవరూ దీనిపై పెద్దగా స్పందించలేదు. అసలు ఈ విషయానికే ప్రాధాన్యం లేదన్నట్లు పట్టించుకోవడం మానేశారు. ఎవరు, ఎన్ని విమర్శలు చేసినా కేసీఆర్ సచివాలయంలోకి అడుగుపెట్టలేదు. ఈ విషయం గురించి మీడియా ఎప్పుడూ ప్రశ్నించే సాహసం చేయలేదు. దీంతో ఈ అంశం కనుమరుగైంది.
సెంటిమెంటే కారణమా?
నిజానికి సచివాలయంలోకి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదు అనే దానికి ఎవరికీ స్పష్టమైన సమాచారం లేదు. కానీ, చాలా మంది అంచనా ప్రకారం.. వాస్తు దోషాలు, ఇతర సెంటిమెట్ల కారణంగానే కేసీఆర్ సెక్రటేరియెట్‌లోకి అడుగుపెట్టలేదని చెబుతుంటారు. ఎందుకంటే గతంలో పాత సచివాలయంలో సీఎంలుగా ఉన్న వాళ్లు తమ వారసుల్ని సక్సెస్ చేయించలేకపోయారని ఒక నమ్మకం. అంటే కేసీఆర్ సెక్రటేరియెట్‌లోకి అడుగుపెడితే వాస్తు దోషాలు చుట్టుకుంటాయని, కేటీఆర్ లేదా తన వారసులకు కలిసి రాదని ప్రచారం జరిగింది. వాస్తు దోషాలు ఉండటంతోపాటు, ఇతర సెంటిమెంట్ల కారణంగానే సీఎం కేసీఆర్ సచివాలయంలోకి వెళ్లలేకపోయారు.
ఈ కారణంగానే పాత సచివాలయాన్ని కూల్చి, కొత్తది నిర్మించారని చెబుతుంటారు. కొత్త సచివాలయాన్ని వాస్తు దోషాలు లేకుండా నిర్మించినట్లు భావిస్తున్నారు. నిజానికి పాత సచివాలయం బాగానే ఉంది. మరికొన్నేళ్లపాటు బాగానే ఉంటుందని నిపుణులు కూడా తేల్చారు. దాన్ని కొత్తగా నిర్మించాల్సిన అవసరం లేదు. కానీ, కేసీఆర్ తన సెంటిమెంట్ కోసమే పాత సెక్రటేరియట్ కూల్చి, కొత్తది కట్టారు. మరోవైపు ఇప్పటివరకు ఇతర చోట్ల కొనసాగిన కార్యాలయాలు ఇకపై కొత్త సెక్రటేరియట్‌లోకి తిరిగి అడుగుపెట్టబోతున్నాయి.
ఇప్పటికైనా వస్తారా?
ఇప్పుడు కొత్త సచివాలయం ప్రారంభమైన నేపథ్యంలో కేసీఆర్ ఇక నుంచైనా ఇక్కడి నుంచి పాలన సాగిస్తారా అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న అంచనా ప్రకారం కేసీఆర్ కొత్త సెక్రటేరియెట్‌లోకి వచ్చి, పాలన సాగించే అవకాశం ఉంది. ఎందుకంటే తన కోసం ప్రత్యేకంగా సెక్రటేరియెట్‌లో ఒక బ్లాక్ నిర్మించుకున్నారు. తనకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నారు.
అయితే, నిజంగానే సచివాలయానికి వస్తారా..? లేక ఎప్పట్లాగే ప్రగతి భవన్ నుంచే పాలన సాగిస్తారా? చూడాలి. ఈసారి కూడా తన ఇష్టం వచ్చినట్లు నడుచుకుంటానంటే మరిన్ని విమర్శల పాలవ్వకతప్పదు. జాతీయ పార్టీ కూడా పెట్టి, దేశాన్నే పాలిస్తాను అనే వ్యక్తి రాష్ట్రంలో ఆదర్శంగా నిలవకపోతే ఎలా? పైగా ప్రజాస్వామ్యంలో నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన బాధ్యత కేసీఆర్‌పై ఉంది.