CM KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాలు ఒక్కోసారి రాజకీయ పండితులకు కూడా అంతుపట్టవు. ఆయన మౌనంగా ఉన్నారంటే తెరవెనుక ఏదో పెద్ద రాజకీయ వ్యూహం సిద్ధమవుతుందనే భావించాలి. ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా భావించే విశాఖ ఉక్కును ప్రైవేటీకరించేందుకు కేంద్రంలోని మోదీ సర్కార్ వేగంగా పావులు కదుపుతుంటే విశాఖ స్ట్లీల్ ప్లాంట్‌ను తన పొలిటికల్ వ్యూహంలో భాగం చేశారు కేసీఆర్. వైజాగ్ స్టీల్ ప్లాంట్‌తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కేసీఆర్.. విశాఖ ఉక్కును దక్కించేందుకునేందుకు సిద్ధమయ్యారు. విశాఖ స్ట్లీల్ ప్లాంట్ బిడ్డింగ్‌లో పాల్గొనాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించింది.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ మోదీకి లేఖ రాసిన కొన్ని రోజులకే బిడ్డింగ్ దిశగా తెలంగాణ ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వేలాది మంది జీవితాలతో పాటు ఆంధ్రుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న విశాఖ స్ట్రీల్ ప్లాంట్‌ను మీరు అమ్మకానికి పెడితే.. ప్రైవేటుపరం కాకుండా దానిని తామే కొంటామంటూ ముందుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. బిడ్డింగ్‌కు ఈ నెల 15 చివరి రోజు కావడంతో ఆ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఒక రాష్ట్ర పరిధిలో ఉన్న పబ్లిక్ సెక్టార్ సంస్థను మరో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో తెలంగాణ ప్రభుత్వానికి మెజార్టీగా 51 శాతం వాటా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా మాత్రమే ఉంది. దీంతో సింగరేణిలో నిర్ణయాధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే. అందుకే సింగరేణి సంస్థ ద్వారా బిడ్డింగ్ దాఖలు చేయించబోతోంది కేసీఆర్ సర్కార్.
విశాఖ స్ట్లీల్‌ను కేసీఆర్ రాజకీయ అస్త్రంగా మార్చుకున్నారా?
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దక్కించుకోవడం ద్వారా కేసీఆర్ రాజకీయ ప్రత్యర్థులను గట్టిగానే దెబ్బతీసే వ్యూహాన్ని అమలు చేయబోతున్నట్టు కనిపిస్తోంది. ముఖ్యంగా మోదీ పాలనపైనా, బీజేపీ విధానాలపైనా తీవ్ర విమర్శలు చేస్తూ.. కేంద్రంలో మోదీని గద్దెదించడమే లక్ష్యంగా పెట్టుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు విశాఖ స్ట్లీల్ ప్లాంట్ ఓ ఆయుధంగా కనిపించింది. అందుకే దానిని సంధించే పనిలో ఉన్నారు. విశాఖ స్ట్లీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చేయగలిగితే కేసీఆర్‌తో పాటు బీఆర్ఎస్ పార్టీకి చాలా ప్రయోజనాలు దక్కుతాయి.
అందులో కొన్ని..
బీజేపీని దెబ్బతీయడం
ప్రభుత్వ, ప్రజల ఆస్తులను మోదీ, షా.. అదానీ పాలు చేస్తున్నారని, స్వప్రయోజనాల కోసం దేశాన్ని అమ్మేసుకుంటున్నారని బీజేపీయేతర పక్షాలు ఎప్పటి నుంచో చేస్తున్న విమర్శ. అయితే ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటు పరం కాకుండా ఇప్పటి వరకూ ఏ పార్టీ అడ్డుకోలేకపోయాయి. విశాఖ స్ట్లీల్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకుంటే ఆ క్రెడిట్ మొత్తం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుంది. ఇలా చేయడం ద్వారా బీజేపీ వ్యూహాలకు చెక్ పెట్టొచ్చు. మోదీ ప్రజల ఆస్తులను అమ్మేస్తుంటే మేం వాటిని రక్షిస్తున్నామని చెప్పుకోవచ్చు.
ఏపీలో విస్తరించడం
టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా అవతరించిన తర్వాత ఇతర రాష్ట్రాల్లోనూ పాగా వేసేందుకు కేసీఆర్ పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా ఏ ప్రాంతం నుంచైతే విడిపోయారో అదే ఆంధ్ర ప్రాంతంలోనూ బీఆర్ఎస్‌ను విస్తరించాలని కంకణం కట్టుకున్నారు. రైతు ఎజెండాతో దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసి బీజేపీని గద్దె దించాలన్నది కేసీఆర్ వ్యూహం. ఏపీలో ఇప్పటికే బీఆర్ఎస్ కార్యకలాపాలు ప్రారంభించింది. ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్‌ని కూడా నియమించింది. విశాఖ ఉక్కును దక్కించుకోగలిగితే కేసీఆర్ ఏపీ ప్రజల దృష్టిలో పొలిటికల్ హీరోగా మారిపోతారు. ఎవరి పోరాటాల వల్ల జరగనిది కేసీఆర్ ప్రైవేటీకరణను అడ్డుకోగలిగారన్న భావన ఏపీ ప్రజల్లోనూ వస్తుంది. అది బీఆర్ఎస్‌కు రాజకీయంగా కలిసొస్తుంది.
ఆంధ్ర ప్రజల్లో విశ్వాసం కల్గించడం
విభజన సమయంలో ఆంధ్రప్రాంతంపై కేసీఆర్ విషం కక్కారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడు రాజకీయం మొత్తం మారిపోయింది. తెలంగాణకు మాత్రమే పరిమితమైన టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గా మారి దేశం వైపు చూస్తోంది. అందులో ఆంధ్ర కూడా ఉంది. ఏపీలో ప్రజల్లోకి వెళ్లాలంటే వాళ్లను మెప్పించే పని కచ్చితంగా ఏదైనా చేయాలి. విశాఖ స్ట్లీల్ ప్లాంట్ రూపంలో కేసీఆర్‌కు అది దొరికింది.
ఏపీలో రాజకీయ వ్యూహం
రాజకీయ ఎత్తుగడతో కేసీఆర్ డైరెక్షన్‌లో సింగరేణి కాలరీస్ విశాఖ ఉక్కును దక్కించుకుంటే అది ఏపీ ప్రభుత్వంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి కూడా రాజకీయంగా ఎదురుదెబ్బనే చెప్పాలి. లాభాల్లో ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఉద్దేశపూర్వకంగా నష్టాల బాట పట్టించి, ప్రైవేటు వ్యక్తులకు అమ్మకానికి పెట్టిన కేంద్రానికి రాజకీయంగా మింగుడుపడని విషయంగా మారుతుంది. అటు జగన్ సర్కార్ కూడా ఇప్పటి వరకూ విశాఖ స్ట్రీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా అడ్డుకోలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అటు బీజేపీ, ఇటు వైసీపీకి ఇది ఇబ్బందికర అంశంగా మారుతుంది.
ప్రైవేటీకరణ వ్యతిరేక వాయిస్ వినిపించడం
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవడం ద్వారా బీఆర్ఎస్ దేశవ్యాప్తంగా ప్రైవేటీకరణ వ్యతిరేక వాయిస్‌ను వినిపించాలనుకుంటోంది. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించడానికి తామున్నామన్న భావనను దేశవ్యాప్తంగా తీసుకువెళ్తే అది బీఆర్ఎస్‌కు రాజకీయంగా కలిసివస్తుంది.
సొంత రాష్ట్ర ప్రయోజనాలు
రాజకీయ ప్రయోజనాలతో పాటు రాష్ట్ర ప్రయోజనాలను కూడా బేరీజు వేసుకున్నట్టు కనిపిస్తోంది కేసీఆర్ వ్యూహం చూస్తోంటే. బయ్యారం ఉక్కు కర్మాగారం విషయంలో కేంద్రం చేతులు ఎత్తేయడంతో… రాష్ట్ర అవసరాలకు కావాల్సిన స్టీల్‌ను విశాఖ నుంచే తీసుకునే దిశగా కేసీఆర్ ఆలోచనలు ఉన్నట్టు కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను సింగరేణి కైవసం చేసుకుంటే.. రాష్ట్ర స్టీల్ అవసరాలు కూడా తీరతాయి. ఇలా కేసీఆర్ ఒక అస్త్రాన్ని సంధించి దాని ద్వారా చాలా ప్రయోజనాలు పొందేందుకు వ్యూహాలు రచిస్తున్నట్టు కనిపిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను దక్కించుకోవాలన్న కేసీఆర్ ఆలోచన ఎంత వరకు సక్సెస్ అవుతుందన్నది మరికొన్ని రోజుల్లో తేలుతుంది.