CM KCR: జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. బీఆర్ఎస్ అనే జాతీయ పార్టీ స్థాపించినప్పటికీ, ఈ ప్రభావం ఎక్కడా లేదు. బీజేపీ, కాంగ్రెస్ కూటములకు ప్రత్యామ్నాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటే లక్ష్యమని చెప్పిన కేసీఆర్‌కు ఇప్పుడు ఆ అవకాశమే లేకుండా పోయింది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత జాతీయ రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. బీజేపీ హవాకు ఈ ఎన్నికతో బ్రేక్ పడింది. అప్పటిదాకా బలహీనంగా కనిపించిన కాంగ్రెస్‌లో ఒక్కసారిగా జోష్ పెరిగింది. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కాంగ్రెస్‌తో కలిసుంటే, సరైన ప్రణాళికతో వెళ్తే ఆ పార్టీని ఎదుర్కోవడం సాధ్యమే అనే నిర్ణయానికొచ్చాయి. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలో ప్రతిపక్షాలు కూటమిగా ఏర్పడేందుకు సిద్ధమయ్యాయి. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో మిత్రపక్షాలను మళ్లీ దగ్గర చేసుకోవడంతోపాటు, కొత్త మిత్రులను కలుపుకొనేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఈ రకంగా ఎన్డీయే కూటమి బలపడుతోంది. అటు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు ఇండియా పేరుతో కూటమిగా ఏర్పడితే.. బీజేపీ అనుకూల పక్షాలు ఎన్డీయే కూటమిగా ఉన్నాయి. ప్రాంతీయ, జాతీయ పార్టీలు దాదాపు ఏదో ఒక కూటమిలో చేరిపోయాయి. మెజారిటీ పార్టీలు కూటమి బాట పట్టాయి. ఏపీలో వైఎస్సార్సీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ కాకుండా చాలా తక్కువ పార్టీలు, చిన్న పార్టీలు మాత్రమే కూటములకు దూరంగా ఉన్నాయి. అందువల్ల కేసీఆర్ అనుకుంటున్నట్లు థర్డ్ ఫ్రంట్ వైపు చూసే పార్టీలే కరువయ్యాయి.
మిత్ర పక్షాలు కూడా
నిన్నటిదాకా కేసీఆర్ మిత్రపక్షంగా చెప్పుకొన్న ఆమ్ ఆద్మీ (కేజ్రీవాల్), సమాజ్ వాదీ పార్టీ (అఖిలేష్ యాదవ్), జేడీయూ (నితీష్ కుమార్), జేఎంఎం (హేమంత్ సోరెన్) వంటి పార్టీలు ప్రతిపక్ష కూటమి అయిన ఇండియలో చేరిపోయాయి. ఇక కర్ణాటకకు సంబంధించి జేడీఎస్ (కుమారస్వామి) ప్రస్తుతం బీజేపీవైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌కు చేయందించే పార్టీయే కరువైంది. అసలు ఏ పార్టీ కేసీఆర్‌ను లెక్కచేసే పరిస్థితి లేదు. దీంతో జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ఒంటరిగా మిగిలిపోయారు. వచ్చే ఎన్నికల తర్వాత కేసీఆర్ ఏదో ఒక పక్షాన్ని ఎంచుకుని, అందరితోపాటు కలిసి సాగాల్సిందే.