KCR: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తమ మిత్రుడు కేసీఆర్‌కు షాకిచ్చారు తమిళనాడు సీఎం స్టాలిన్. తెలంగాణలో తమ డీఎంకే పార్టీ మద్దతు కాంగ్రెస్‌కే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గతంలో కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ కోసం సీఎం కేసీఆర్ ప్రయత్నించిన సంగతి తెలిసిందే. బిహార్ సీఎం, అఖిలేష్ యాదవ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కర్ణాటకకు చెందిన కుమార స్వామి సహా పలువురితో ఈ అంశంపై చర్చలు జరిపారు.
Telangana Elections : ఆఖరివారం అత్యంత కీలకం.. అగ్రనేతలంతా తెలంగాణలోనే..
ఈ నేతల్లో తమిళనాడు సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్ కూడా ఉన్నారు. స్టాలిన్, కేసీఆర్.. ఇద్దరూ కేంద్రంలో థర్డ్ ఫ్రంట్ కోసం చర్చలు జరిపారు. ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఏకమయ్యే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ను కూడా దూరం పెట్టారు. దీని ప్రకారం.. తాజా ఎన్నికల్లో స్టాలిన్ మద్దతు సీఎం కేసీఆర్‌కే ఉంటుందని భావించారు. కానీ, కేసీఆర్‌కు షాకిస్తూ కాంగ్రెస్‌కు మద్దతుగా నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలోని తమ పార్టీ సానుభూతిపరులు, కార్యకర్తలు కాంగ్రెస్ గెలుపు కోసం పని చేయాలని కోరారు. ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు మద్దతుగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. ఇది ఒక రకంగా కేసీఆర్‌కు ఇబ్బందికర పరిణామమే అని చెప్పాలి. జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నించిన కేసీఆర్‌కు ఇప్పుడు ఏ పార్టీ నుంచి మద్దతు లభించడం లేదు. కారణం.. కేసీఆర్, బీజేపీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నాడని భావించడమే.
ప్రస్తుతం జాతీయ స్థాయిలో కేసీఆర్‌ను ఏ పార్టీ పట్టించుకోవడం లేదు. ఇటీవల కుమారస్వామి ఒక్కడే కేసీఆర్‌కు మద్దతుగా.. కాదు.. కాదు.. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా స్పందించారు. మిగతా ఎవరూ కేసీఆర్‌కు మద్దతు తెలపడం లేదు. మరోవైపు కేంద్రంలో ఇండియా కూటమిలో ఉన్న స్టాలిన్.. తన మిత్ర ధర్మాన్ని పాటిస్తూ కాంగ్రెస్‌కు మద్దతిచ్చారు. తమతో సన్నిహిత సంబంధాలు ఉన్న కేసీఆర్ కంటే కాంగ్రెస్సే ముఖ్యమని స్టాలిన్ భావిస్తున్నారు. బీజేపీని బద్ధ శతృవులా భావించే డీఎంకే.. జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కే అండగా ఉంటూ వస్తోంది.