వైసీపీ ప్రభుత్వంపై నాయకులకు అసమ్మతి పెరుగుతుందా.. చెట్టుకు పండుటాకులు రాలిపోయినట్టుగా పార్టీలో సీనియర్ నాయకులు ఒక్కక్కరిగా బయటకు వెళ్లిపోతారా.. వీటన్నింటికీ సమాధానం కాలమే చెప్పాలి. ఇటీవలే ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆనం రామనారాయణ రెడ్డి పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంది అధిష్టానం. నేడు మరో నాయకుడు ప్రశ్నించినందుకు అతనిపై ఫోన్ ట్యాపింగ్ బాణాన్ని ఎక్కుపెట్టింది. దీనిని స్వయంగా ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా ఇంటెలిజెన్స్ నిఘా ఉంచడమే దీనికి నిదర్శనమని చెప్పాలి. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారని ఆయనను కాదని నియోజకవర్గ పార్టీ సమన్వయకర్తగా నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డిని ఇటీవలే నియమించారు. ఇప్పుడు నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ వైసీపి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వంతు వచ్చినట్లుంది. ముఖ్యమంత్రి, ఆయన కార్యాలయం అనుమతి లేకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే ఫోన్‌ను పోలీసు అధికారులు ట్యాప్ చేయరు’ అని ఎమ్మెల్యే అనుచరులు తమ గళాన్ని వినిపిస్తున్నారు.
‘మా నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు అధికారులు నిధులివ్వడం లేదు. రూ.10 విలువ పని చేస్తే అర్ధ రూపాయీ విడుదల కావడం లేదు. ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన బారాషహీద్ దర్గా ప్రాంతంలో మసీదు నిర్మాణానికీ డబ్బులివ్వలేదు. ఇలాగైతే ప్రజలకేం సమాధానం చెప్పాలి?’ అంటూ ఇటీవల అధికారిక సమావేశంలోనే ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. నాఫోన్ ట్యాపింగ్ మొదలు పెట్టిన 1, 2 రోజుల్లోనే నాకు సమాచారం వచ్చిందన్న విషయాన్ని ఇంటెలిజెన్స్ సిబ్బందితో ఎమ్మెల్యే చెప్పడం కాస్త ఆసక్తి కలిగిస్తుంది. ‘ప్రతిపక్షాలపై నిఘా పెట్టేందుకు పొలిటికల్ ఇంటెలిజెన్స్‌ను అధికారంలో ఉన్నవారు వాడతారు. ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేలపైనే నిఘా పెట్టడమేంటి?’ అని ఆయన వారితో అన్నట్లు సమాచారం. తన డ్రైవరుతో మరో ఫోన్ తెప్పించి దానిని ఆ ఇంటెలిజెన్స్ సిబ్బందికి చూపిస్తూ.. ‘మీరు (పోలీసులు) ట్యాప్ చేస్తున్నారనే ఇలా మరో ఫోన్ వాడుతున్నా. ఒకటి కాదు 12 రకాల సిమ్‌లు ఉపయోగిస్తున్నా. ఫేస్‌టైం, టెలిగ్రామ్ కాల్స్ అయితే ఏ సాఫ్ట్‌వేర్ ట్యాప్ చేయలేదు. అవసరమైతే నా ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఐపీఎస్ అధికారిని నియమించాలని మీ అధికారులకు చెప్పండి’ అని ఆయన వారితో సరదాగా అన్నట్లు సమాచారం.
వైసీపీకి ఏమైంది.. ఒకవైపు నిధుల కొరత.. మరోవైపు ఎమ్మెల్యేల అసమ్మతి. దీనికి కారణం ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడమా.. అలివిగాని హామీల వర్షం కురిపించడమా.. అంటే రెండింటితో పాటూ గతపాలకుల అక్రమాలు, అవినీతి ఈ నాలుగు కలిసి పరిపాలన గాడి తప్పిస్తున్నాయని చెప్పాలి. 2014లో విభజన తరువాత కొత్తగా ఏర్పడిన ఆంధ్ర రాష్టంలో లోటు 16వేల 78కోట్ల రూపాయలుగా ఉండేది. దానిని అప్పటి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా పగ్గాలు చేపట్టి అడపాదడపా అభివృద్ది పనులు చేపట్టి, సరైన సంక్షేమం అందించక పోలవరం పర్యటనకు ప్రజలను తరలించేందుకు ప్రత్యేక బస్సులు వేసి, పసుపు కుంకుమ వంటి కార్యక్రమలతో ప్రజాధనాన్ని వృథా చేశారు. అలాగే తెలంగాణలో నోటుకు ఓటు కేసులో చిక్కుకున్నందున కేంద్రంతో గట్టిగా అడిగి నిధులు సమకూర్చలేక పోయారని కొందరివాదన. దీంతో చంద్రబాబు పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది.
2019 ఎన్నికల్లో ప్రజలు వైసీపి కి పట్టం కట్టారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ మోహన్ రెడ్డి అధికార పీఠం ఎక్కే సరికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నిభిన్నం అయ్యింది. 16వేల కోట్లు ఉన్న లోటు కాస్త రెండున్నర లక్షల కోట్లకు పడగెత్తింది. పెద్దగా పరిశ్రమలు లేని రాష్ట్రం, అభివృద్దికి నోచుకోని రాష్ట్రం, కేంద్రం విభజన హామీలు అందని పరిస్థితి, జిడిపి కూడా అంతంత మాత్రమే ఉండేది. ఇలాంటి సమయంలో పాలన చేసేందుకు ముందుకు అడుగు వేసిన జగన్ కు అడుగడుగునా ఆటంకాలే కలిగించాయి. కోవిడ్ విలయతాండవం, లాక్ డౌన్ వంటి విపత్కరపరిస్థితులు, నిధులు లేని పరిస్థితి, తమకు అండగా ఉన్న వారు చేయిజారిపోకుడదని ప్రత్యేక సలహాదారులను నియమించుకోవడం, వారికి లక్షల్లో జీతభత్యాలు, విలాసాలు అందించడం, ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే తపన కోసం అప్పులు చేయడం మొదలు పెట్టారు. క్రమక్రమంగా ప్రభుత్వ ఆస్తులను కూడా అమ్మడం ప్రారంభించారు. సంపద నిలువలు అడుగంటిన పరిస్థితుల్లో డివిడెంట్లకు విలువ లేని స్థితి నెలకొంది. రిజర్వ్ బ్యాంకు అప్పు ఇవ్వడం నిలిపి వేసింది. దీంతో ప్రభుత్వానికి ప్రారంభం అయ్యింది కష్టకాలం.
సంక్షేమానికే నిధులు కేటాయించ లేని పరిస్థితి నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి ఆర్థిక వ్యవస్ధ పడిపోయింది. దీంతో అభివృద్దికి నోచుకోలేదు. గతంలో శ్రీకారం చుట్టిన పనులకు నిధుల కొరత ఏర్పడి పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు అందని పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచడం దేవుడికెరుగు ఉన్న జీతాలను సమయానికి ఇవ్వలేనంతగా పతనం అయ్యింది. దీంతో నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులకు బయట తిరిగేందుకు ముఖం లేకుండా పోయింది. ప్రజలు పాలకులను నిలదీస్తూ, ప్రశ్నలు సంధిస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితికి వెళ్లిపోయింది. దీంతో ప్రజలనే నమ్ముకున్న పాలకులు ప్రభుత్వాన్ని సభా ముఖంగా ఎండగడుతూ వచ్చారు. చాలా కాలంగా ప్రజావ్యతిరేఖతను అనుభవించిన స్థానికనాయకులు, ఎమ్మెల్యేలు ఆపరిస్థితులను తమలో అణుచిపెట్టుకోలేక బయటకు వెల్లడించారు. ఇప్పటి వరకూ వెల్లడించింది ఇద్దరే అయినప్పటికీ ఇంకా ఇలాంటి వారు ఎంతమంది ఉన్నారో పార్టీ ఒకసారి పునరాలోచించుకోవల్సిన అగత్యం ఏర్పడింది. ఇలా ప్రభుత్వం పై విమర్శించిన నాయకులు, ఎమ్మెల్యేలు ప్రజల్లో కొంత నాయకునిగా అయినా ఉండే అవకాశం ఉంది. ఇలాగే కొనసాగితే పార్టీ అధిష్టానానికి నాయకులు దొరికే పరిస్థితి ఉండదు. దీనిని పార్టీ గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది. లేకుంటే దశాబ్దాల తరబడి నమ్మకంగా సేవచేస్తున్న వారిని కోల్పోవల్సి వస్తుంది.
తాజాగా కోటం రెడ్డి చెప్పినట్లు.. ‘రాజారెడ్డి, రాజశేఖరరెడ్డి, ఇప్పుడుజగన్ వరకూ మూడు తరాలకు సేవ చేస్తూ వస్తున్నా. గతంలో జిల్లాలో ఆనం రామనారాయణరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఆయనను ఎదుర్కొని మరీ జగన్ ఓదార్పు యాత్రను నిర్విఘ్నంగా పూర్తి చేయించగలిగా. పార్టీ అధికారంలోకొచ్చాక మంత్రి పదవి, స్పీకర్, ఉపసభాపతి, చీఫ్‌విప్, విప్, చివరికి జిల్లా పార్టీ అధ్యక్ష పదవికీ అర్హుడిని కాకుండాపోయానా?’ అనే స్వరం కూడా వినిపించక తప్పదు.