Cm Jagan: జగనన్నకు ఏం అర్థం కావడం లేదా..? అసలెందుకిలా..?

వైసీపీ అధినేత జగన్ పార్టీ ముఖ్యులకు ఇటీవల వేసిన ప్రశ్న ఇది... వారు కూడా ఈ ప్రశ్నకు సమాధానం తెలియక తల అడ్డంగా ఊపారట..

  • Written By:
  • Updated On - March 10, 2023 / 03:06 PM IST

ఏపీలో ఎన్నికలకు ఏడాది కూడా లేదు. ఈ సమయంలో పార్టీ పరిస్థితిపై వైసీపీ అధినేత జగన్ చేయిస్తున్న సర్వేలు షాక్ ఇస్తున్నాయి. 175కి 175 సీట్లు గెలవాలన్నది జగన్ టార్గెట్. అన్ని సీట్లు రావని సీఎంకూ తెలుసు. కానీ ఆ టార్గెట్ పెట్టుకుని పనిచేస్తేనే అధికారంలోకి వస్తామనీ తెలుసు. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉందని అర్థమైంది. ఇటీవల జరిపిన ఓ సర్వేలో వైసీపీకి అధికారం కష్టమేనని తేలిపోయింది. దీంతో ఆ సర్వే చేసిన వారిని పిలిపించి మరీ మాట్లాడారు వైసీపీ ముఖ్యులు.. వారు చెప్పింది విన్నాక వైసీపీ పెద్దలకు కూడా ఓ క్లారిటీ వచ్చిందట. పార్టీ పరిస్థితి అనుకున్నంత అద్భుతంగా లేదని సీఎం జగన్ భావిస్తున్నారట. ఇలాగైతే మరోసారి అధికారంపై ఆశలు వదులుకోవాల్సిందేనని అర్థమైందంటున్నారు. అయితే ఈ పరిస్థితి ఎందుకొచ్చిందన్నది జగనన్నకు అర్థం కాలేదంటున్నారు.

వైసీపీ అధినేత నెలనెలా బటన్ నొక్కుతూనే ఉన్నారు. ఆ నిధులు, ఈ నిధులు అంటూ వేల కోట్లు పందేరం చేస్తూనే ఉన్నారు. ప్రజల సొమ్ముతో తన ఓటు బ్యాంకు సుస్థిరం అవుతుందని ఆయన భావించారు. కానీ ఇంత చేస్తున్నా ప్రజల్లో వ్యతిరేకత ఎందుకన్నది ఆయన ప్రశ్న.. నోట్లతో ఓట్లు రాలొచ్చేమో కానీ అది ఎల్లకాలం కాదన్నది సీఎం గుర్తుంచుకోవాలి. అభివృద్ధి అంటే డబ్బులు పంచడం కాదు… డబ్బులు వచ్చే దారులు జనానికి చూపించడం.. ఉపాధి అవకాశాలు పెంచాలి.. మంచినీళ్లు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి. రైతుకు భరోసా కల్పించాలి. వీటన్నింటినీ పక్కన పెట్టిస్తే బటన్ నొక్కితే సరిపోతుందా..? దీన్ని వైసీపీ అధినేత గుర్తించలేకపోయారు.

రోడ్లు సరిగా లేవు.. గోతులతో నరకం కనిపిస్తోంది. చెత్తపన్ను పేరుతో నెలనెలా వడ్డిస్తున్నారు. ఇక గ్రామాల్లో వాలంటీర్ల వ్యవస్థకు ఎంత మంచి పేరుందో అంత చెడ్డపేరూ ఉంది. ఆ పార్టీ నేతల్లోనే వాలంటీర్ వ్యవస్థపై వ్యతిరేకత ఉంది. ఇక అన్నింటి కంటే మరో పెద్ద సమస్య.. నోరు తెరిచే అవకాశం లేకపోవడం. ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా వారిపై కేసులు పెట్టడం కామనైపోయింది. పైస్థాయి నాయకులే కాకుండా పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. ఇది ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపుతుందో తెలిసిందే. ఒకరి నుంచి ఒకరికి మౌత్ పబ్లిసిటీ ద్వారా పాకిపోతుంది. అలాగే అధికార పార్టీ నేతల జులుం.. ప్రతిపక్ష పార్టీలపై దాడులు అన్నిచోట్లా సహజమైపోయాయి. చూసేవారికి ఈ కక్ష సాధింపు చర్యలు అర్థమవుతాయి కదా..? ఫలితంగా భయం మొదలై అది వ్యతిరేకతగా మారుతుంది. తమ పాలనలో అవినీతి లేదు అని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నా వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని వారికీ తెలుసు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ప్రజల్లో వ్యతిరేకతకు కారణమవుతోంది. సమయానికి జీతాలు ఇవ్వలేకపోవడం ఉద్యోగుల్లోనే కాదు ప్రజల్లో కూడా వ్యతిరేకత పెంచుతోంది. నెల మొదటిరోజే పెన్షన్లు ఇస్తున్నప్రభుత్వం పనిచేస్తున్న ఉద్యోగులను పస్తు పెట్టడం పరిపాటిగా మారింది. చిన్న చిన్న పనులు చేయడానికి కూడా నిధుల్లేవంటున్నారు. ఎమ్మెల్యేలే మేమేం చేయలేమని చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇలాగే ఉంటే రాష్ట్రం ఏమైపోతుందో అన్న భయం పాకిపోతుంది. కొత్తగా పరిశ్రమలు రావడం లేదు. ఉపాధి అవకాశాలు కనిపించడం లేదు. మూడు రాజధానుల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఉన్న రాజధానిని కట్టడానికి ప్రయత్నించని వ్యక్తి మూడు రాజధానులు ఏం కడతారన్నది ప్రతిపక్షాల విమర్శే కాదు ప్రజల ప్రశ్న కూడా. ప్రతిపక్షాలపై విమర్శలు సహజమే అయినా కొందరు నేతలు అత్యుత్సాహానికి పోయి నోరుజారి చిన్నాపెద్దా లేకుండా మాట్లాడటం కూడా మైనస్ అయ్యింది. అమరావతి రైతులపై చేసిన అడ్డగోలు వ్యాఖ్యలు కూడా కొంప ముంచాయని వైసీపీ నేతలకు లేటుగా అర్థమైంది. పోలీసులు వైసీపీ కార్యకర్తలుగా మారిపోయారన్న ప్రచారం గ్రామాల్లోనే ఉంది.

అధికార పార్టీపై ప్రజల్లో అంతో ఇంతో వ్యతిరేకత సహజం. కానీ ఈ స్థాయిలో ఉండటం మాత్రం ఇబ్బందికరమే.. నోట్లతో ఓట్లు కొనుక్కోవాలనుకుంటే సాధ్యం కాదు.. ప్రజలు ఓటుకు నోటు తీసుకోవచ్చు.. కానీ ఓటేసేటప్పుడు విచక్షణ ఉపయోగిస్తే మాత్రం కొంపమునుగుతుంది. ఇప్పటికైనా అసలేం జరుగుతోందన్నది గుర్తించి దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేకపోతే మళ్లీ అధికారంలోకి రావడం కలే..

(KK)