Jagan vs Pawan: యథా రాజా తథా ప్రజా.. రాజు మంచివాడైతే మంత్రులు, ప్రజలు మంచిగా ఉంటారు. రాజే హద్దుదాటి పిచ్చి వాగుడు వాగితే ప్రజలు ఎలా మాట్లాడాలి..?
ఏపీలో రాజకీయాలు దిగజారిపోతున్నాయి. పార్టీ కార్యకర్తల నుంచి పార్టీ అధినేతల వరకు అంతా ఒకే రకంగా ఉన్నారు. కార్యకర్తలు తప్పు చేస్తే మందలించాల్సిన స్థానంలో ఉన్న వాళ్లు ఆ పని చేయకపోగా.. ఆ తప్పును సమర్ధిస్తూ కార్యకర్తలను మరింత రెచ్చగొడుతున్నారు. వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ.. ఇలా అన్ని పార్టీలది ఏపీలో అదే వైఖరి. నరుకుతా, పీకుతా, వంచుతా అని ఒకడు అంటే.. ఇంకోడు తానెమీ తక్కువ కాదన్నట్టు వ్యక్తిగత జీవితాల జోలికి పోతుంటాడు. ఈ విషయంలో ఎవరు ఎలాగున్నా.. సీఎం స్థానంలో ఉన్న జగన్ తన కుర్చీకి ఇవ్వాల్సిన విలువ కూడా ఇవ్వడం లేదు. తానొక సీఎంని అన్న విషయం మరిచి దిగజారి మాట్లాడుతున్నారు. జగనే ఇలా ఉంటే అతని అభిమానులు సోషల్ మీడియాలో చేసే వెర్రి వేషాల గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.
ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాంలో అమ్మఒడి పథకం నిధులను విడుదల చేసిన జగన్.. పనవ్ కల్యాణ్ టార్గెట్‌గా ఫైర్ అయ్యారు. దత్తపుత్రుడిలా తొడలు కొట్టలేం, బూతులు తిట్టలేమంటూ పవన్‌పై మండిపడ్డారు జగన్. ఇక్కడ వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత సీఎం తన లిమిట్‌ను మరోసారి క్రాస్ చేశారు. ఇటివలి కాలంలో పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై పదేపదే కామెంట్ చేస్తూ వస్తున్న జగన్.. మరోసారి అదే పని చేశారు. నాలుగు పెళ్లిళ్లు చేసుకుని, నాలుగేళ్లకు ఒకసారి భార్యను మార్చే పేటెంట్ ప్యాకేజీ స్టార్‌కే ఉందంటూ పర్శనల్‌గా మరోసారి పవన్‌ని టార్గెట్ చేశారు జగన్.
నిజానికి ఇదే తరహా వ్యాఖ్యలు వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఆ పార్టీ కార్యకర్తలు చేస్తుంటారు. ప్రజాప్రతినిధులమన్న కనీస ఇంగిత జ్ఞానం లేకుండా వ్యక్తిగత విమర్శలు గుప్పిస్తుంటారు. అటు పార్టీ కార్యకర్తలు గురించి సరే సరి.. వీళ్లందరిని చక్కదిద్ది మంచి మార్గంలో పెట్టాల్సిన బాధ్యత జగన్‌ది. ఎందుకుంటే జగన్ సీఎం స్థానంలో ఉన్నారు. ఆ విషయం మరిచి తాను కూడా ఇదే రకమైన చిల్లర వ్యాఖ్యలు చేస్తుండడం జగన్ రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం. పవన్‌ని వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తున్న వాళ్లకి.. ‘ఇలా చేయొద్దు, రాజకీయంగానే మాట్లాడుదాం’ అని జగన్ చెప్పి ఉంటే తన పదవికి హుందాతనం ఉండేది. సీఎంగా ఉండాల్సిన లక్షణాల్లో ఇది కూడా ఒకటి. కానీ జగన్‌కి అవేవీ పట్టవు. గుంపులో గోవిందాలాగా నలుగురు అన్నారు.. తాను కూడా అనేస్తే పోతుంది అనుకునే రకం. ఇది ఓ నాయకుడికి ఉండటానికి ఏ మాత్రం పనికిరాని క్వాలిటి.
నిజానికి పవన్ చేసిన ఆ పని కారణంగా ఎంతో ట్రోమాని అనుభవించిన రేణుదేశాయ్ తరఫున కూడా ఈ నాయకులు మాట్లాడింది లేదు. ఇక్కడ మేటర్ ఓ వివాహితకి జరిగిన అన్యాయం గురించి కాదు. పవన్ మూడు పెళ్లిళ్లు చేసుకోవడం ఒకటే మేటర్. ప్రజలకు కూడా అదే కావాలి. ఆడోళ్లు ఏమైపోతేనేం.. మాకేం పట్టదు.. మేమంతా అంతే.. సీఎం అయినా, మంత్రైనా.. ఎమ్మెల్యే అయినా.. మాజీ ముఖ్యమంత్రైనా ఒకటే..! అవును నిజమే.. ‘పవన్ కళ్యాణ్‌కి అత్తారింటికి పోవడమే తెలుసు’ అంటూ గతంలో చంద్రబాబు సైతం హద్దుదాటారు. ఆయన కూడా సీఎంగా ఉన్నప్పుడే ఈ వ్యాఖ్యలు చేశారు..! ఇక్కడ సీఎంలు ఇంతే.. వాళ్లకి బానిసత్వం చేసేవాళ్లు కూడా అంతే..!