రాజకీయాలు, సినిమాలకు విడదీయలేని బంధం ఉంటుంది. సినిమాలు చేసి రాజకీయాల్లోకి వెళ్లినవారు.. రాజకీయాల్లో ఉంటూ సినిమా వాళ్ల ఫేమ్ పార్టీకి వాడుకోవాలి అనుకునేవాళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువే ! సినిమాల్లో పనిచేసి రాజకీయాల్లోకి చాలామందే వచ్చారు. ఏపీ రాజకీయాల్లోనూ సినీ నటులు కీలక పాత్ర పోషిస్తున్నారు. బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటే.. అటు పవన్ జనసేన అధినేతగా ఉన్నారు. రోజా మంత్రిగా ఉన్నారు.
కమెడియన్ ఆలీ వైసీపీలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల ముందు అలీ వైసీపీలో చేరారు. నిజానికి అప్పుడే ఆయన ఆయన టికెట్ ప్రయత్నాలు చేశారు కానీ.. సీటు దక్కలేదు. దీంతో పార్టీ గెలుపు కోసం ప్రచారం చేశారు. ఇక వైసీపీ గెలిచి అధికారంలోకి వచ్చాక కూడా ఆలీ ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. వైసీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అలాగే ఆలీకి ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి ఇచ్చారు జగన్. పదవి ఇచ్చాక ఇంకా యాక్టివ్‌గా కనిపిస్తున్నారు. అదే ఊపులో జగన్ ఆదేశిస్తే పవన్‌పై పోటీ చేయడానికి రెడీ అని చెప్పి.. టాక్ ఆఫ్ ది పాలిటిక్స్‌గా మారారు.
పవన్ మీద పోటీ చేస్తారా.. ఆ టైమ్‌కు అలా అన్నారా అన్న సంగతి పక్కనపెడితే.. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అసెంబ్లీ బరిలో నిలవాలని అలీ చూస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఆయన కొన్ని సీట్లపై కన్నేశారని.. వాటిలో ఏదో ఒకటి దక్కించుకోవాలని పట్టుదలో ఉన్నారట. తన జన్మస్థలం రాజమండ్రిపై ఫోకస్ పెట్టినట్లు టాక్. రాజమండ్రి సిటీ లేదా రూరల్ సీట్లలో.. ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. నిజానికి ఆ స్థానాలు టీడీపీ ఖాతాలో ఉన్నారు. రూరల్‌లో గోరంట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటే.. సిటీలో ఆదిరెడ్డి భవాన్ని ఉన్నారు. అక్కడ టీడీపీ సూపర్‌స్ట్రాంగ్‌గా ఉంది. ఆ రెండు స్థానాల్లో సైకిల్ పార్టీని ఢీకొట్టడం అంటే అంత ఈజీ కాదు. ఐతే ఈ రెండు స్థానాల కోసం వైసీపీలోనే తీవ్రమైన పోటీ కనిపిస్తోంది. రాజమండ్రి సిటీ నుంచి పోటీకి.. ఎంపీ మార్గాని భరత్ కూడా ప్రయత్నాలు చేస్తున్నారు.
దీంతో మరి అలీకి అక్కడి నుంచి చాన్స్ ఇస్తారా లేదా అన్నది హాట్‌టాపిక్ అయింది. ఐతే ఆ రెండు స్థానాలు కాకపోతే.. మైనాసిటీ ఓట్లు ఎక్కువగా ఉన్న గుంటూరు ఈస్ట్, కర్నూలు సిటీ, కడప సిటీ సీట్లపై కూడా అలీ ఫోకస్ పెట్టినట్లు టాక్. ఐతే ఆ మూడు చోట్ల వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి వారిని కాదని అలీకి టికెట్ ఇస్తారా.. ఇస్తే వాళ్లు సిట్టింగ్‌ల పరిస్థితి ఏంటనే చర్చ జోరుగా సాగుతోంది.