Communist Parties: తెలంగాణలో ఇంతకాలం అధికార బీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాసిన కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నారా..? కర్ణాటక ఫలితాలతో కమ్యూనిస్టుల వైఖరి మారిందా..? బీఆర్ఎస్‌కు షాకివ్వబోతున్నారా..?
తెలంగాణలో సీపీఐ, సీపీఎంలు దాదాపు ఉనికి కోల్పోయే పరిస్థితి వచ్చింది. సొంతంగా ఒకట్రెండు సీట్లు కూడా సాధించలేకపోతున్నాయి. దీంతో ఏదో ఒక పార్టీ తోడుంటే తప్ప గెలవలేని పరిస్తితికొచ్చింది. దీనిలో భాగంగానే కొంతకాలంగా తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తూ వచ్చాయి. మొన్నటి మునుగోడు ఉప ఎన్నికలో కూడా బీఆర్ఎస్ పార్టీకే మద్దతు ప్రకటించాయి. ఇంతకాలం బీఆర్ఎస్ పార్టీతో కలిసి నడిచిన కమ్యూనిస్టులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు అనిపిస్తోంది. దీనికి కారణం కర్ణాటక ఫలితం తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతూ వస్తుండటమే.
బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యం
మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడమే తమ లక్ష్యమని కమ్యూనిస్టులు ప్రకటించారు. అందుకోసమే బీఆర్ఎస్‌కు మద్దతు ఇస్తున్నట్లు కమ్యూనిస్టులు ప్రకటించారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ప్రచారం కూడా చేశారు. దీంతో ఈ దోస్తీ.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై చర్చ వరకూ వెళ్లింది. అప్పట్లో బీజేపీపై కేసీఆర్ ఎక్కడాలేని దూకుడు ప్రదర్శించారు. బీజేపీ అంటే అస్సలు నచ్చని కమ్యూనిస్టులకు బీఆర్ఎస్, కేసీఆర్ వైఖరి నచ్చింది. బీజేపీని ఎదిరించడంలో కేసీఆర్ ముందుంటారని నమ్మారు. దీంతో బీఆర్ఎస్‌తో కలిసి సాగాలని నిర్ణయించుకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిన విషయం కమ్యూనిస్టులకు అర్థమైంది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత పేరు వచ్చిన తర్వాత నుంచి బీఆర్ఎస్ వైఖరిలో మార్పు కనిపిస్తోంది. గతంలోలాగా బీజేపీపై కేసీఆర్ విమర్శలు చేయడం లేదు. కవిత కోసం కేసీఆర్ లొంగిపోయారా అనే అనుమానాలు కమ్యూనిస్టులకు కలుగుతున్నాయి. అంతేకాదు.. బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకమవుతుంటే బీఆర్ఎస్ మాత్రం దూరంగా ఉంటోంది. దీంతో బీజేపీ-బీఆర్ఎస్ ఒక్కటే అనే భావనకు కమ్యూనిస్టులు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీని ఎదిరించే ప్రత్యామ్నాయంగా వారికి కాంగ్రెస్ కనిపిస్తోంది.
కాంగ్రెస్ వైపు చూపు
బీజేపీని గద్దె దించాలని ఆశిస్తున్న కమ్యూనిస్టులకు ఇప్పుడు కాంగ్రెస్ ఆశాకిరణంలా కనిపిస్తోంది. కర్ణాటక ఫలితాల తర్వాత బీజేపీ ఇమేజ్ తగ్గుతూ ఉంటే.. కాంగ్రెస్ ఇమేజ్ పెరుగుతూ వస్తోంది. తెలంగాణలో కూడా కాంగ్రెస్ బలపడుతుంటే, బీఆర్ఎస్ బలహీనంగా మారుతోంది. బీఆర్ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోంది. దాదాపు పదేళ్లు బీఆర్ఎస్‌కు అవకాశం ఇచ్చామని, ఈసారి మరోపార్టీకి అవకాశం ఇద్దామనే భావన తెలంగాణ ప్రజల్లో కనిపిస్తున్నట్లు సీపీఐ, సీపీఎం అనుకుంటున్నాయి. అలాగే చాలా కాలం తర్వాత కేటీఆర్ ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలవడం కూడా అనేక అనుమానాలకు తావిచ్చినట్లైంది. ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పార్టీతో కలవడమేనే మంచిదనే అభిప్రాయానికొచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రతిపక్ష కూటమిలో బీఆర్ఎస్‌కు చోటు లేదు. అదే కాంగ్రెస్‌తో కలిస్తే.. ఇటు తెలంగాణలోనే కాకుండా.. జాతీయ రాజకీయాల్లోనూ ప్రయోజనం ఉంటుంది. అందుకే కాంగ్రెస్ వైపు కమ్యూనిస్టులు చూస్తున్నారు.
బీఆర్ఎస్ విఫలం
బీజేపీని ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ విఫలమైందని సీపీఐ నారాయణ, కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని వారు అన్నారు. దీంతో కమ్యూనిస్టులు బీఆర్ఎస్‌కు దూరమైనట్లే అనే సంకేతాలు వెలువడుతున్నాయి. మరోవైపు కాంగ్రెస్‌కు దగ్గరయ్యే ప్రయత్నాల్ని సీపీఎం, సీపీఐ ప్రారంభించాయి. ఇటీవల పాట్నాలో జరిగిన ప్రతిపక్షాల కూటమి సమావేశానికి సీపీఎం నేత సీతారాం ఏచూరి, సీపీఐ నేత రాజా కూడా హాజరయ్యారు. దీంతో రెండు పార్టీలూ కాంగ్రెస్‌తో కలిసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
సీట్ల డిమాండ్
ఇప్పటికిప్పుడే కాంగ్రెస్‌తో కలిసి నడిచే విషయంలో కమ్యూనిస్టులు ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమకు ఎక్కువ సీట్లు కావాలని బీఆర్ఎస్‌ను డిమాండ్ చేసే అవకాశాలున్నాయి. తాము అడిగినన్ని సీట్లు ఇస్తే బీఆర్ఎస్‌తో కలిసి నడుస్తారు. లేదంటే కాంగ్రెస్ వైపు వెళ్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్‌పై ప్రజలకు వ్యతిరేకత ఉంది. ఈ సమయంలో కమ్యూనిస్టుల మద్దతు బీఆర్ఎస్‌కే ఎక్కువ అవసరం. పైగా వారికంటూ సంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది. ఆ ఓట్లు కూడా కేసీఆర్‌కు చాలా ముఖ్యం. అందుకే కమ్యూనిస్టులు కేసీఆర్‌ను డిమాండ్ చేసే అవకాశం ఉంది. గతంలో సీపీఐకి రెండు, సీపీఎంకు రెండు సీట్లు ఇస్తే చాలనుకున్నారు. కానీ, ఇప్పుడు మరిన్ని ఎక్కువ సీట్లను అడగబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే కేసీఆర్‌ను కలిసి చర్చిస్తారు. ఆ తర్వాతే కమ్యూనిస్టుల పయనమెటో తేలుతుంది.