Left Parties : కమ్యూనిస్టులను ఛీ కొడుతున్న జనం.. రాజకీయ వ్యభిచారిగా మిగిలిపోయారా?

శ్రమజీవుల కష్టానికి గుర్తింపు తీసుకొచ్చిన పార్టీగా.. హక్కుల కోసం అసువులు బాసిన పతాకగా.. కమ్యూనిజానికి గుర్తింపు ఉంది. ప్రపంచ కార్మికులారా ఏకం కండి అనే నినాదాన్ని, అరుణ పతాకాన్ని అందించి ఉద్యమాలతో సామాన్యులకు కమ్యూనిజం సాధించిపెట్టిన విజయాలు, ప్రయోజనాలు ఎన్నో ! ఐతే ఇదంతా గతం.. ఎర్రజెండాలు ఇప్పుడు వెలిసిపోతున్నాయ్. మారిన రాజకీయ ఆటలో కామ్రేడ్‌లు కష్టపడలేకపోతున్నారు. దిక్కులు చూస్తున్నారు.. అడుగులు మారుస్తున్నారు. కమ్యూనిజానికి అర్థం మారుస్తున్నారు.

  • Written By:
  • Updated On - April 17, 2023 / 12:00 PM IST

విధానాలు, నియమాలు, నీతులు వాళ్లు చెప్తారు అంతే చేయరు అనే స్థాయికి కమ్యూనిస్టులు పడిపోయాయ్. అందుకే ఎర్ర పార్టీలు అంటేనే ఇప్పుడు జనం ఛీ కొడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. 1925 క్రిస్టమస్‌ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది. ఈ 96 ఏళ్లలో సైద్ధాంతిక విభేదాలతో ఈ పార్టీలో ఎన్నో చీలికలు వచ్చాయ్. వీటిలో ఉనికి కోల్పోయినవి.. మరో దాంట్లో కలిపిపోయినవే ఎక్కువ. సీపీఐ, సీపీఎం మాత్రమే ఇప్పుడు దేశవ్యాప్తంగా కనీసం పట్టు ఉన్న పార్టీలుగా కనిపిస్తున్నాయ్.

రాజకీయంగా లెక్కలేసుకున్నా.. 1952లో తొలి పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సమయంలో.. దేశంలో 17 కోట్లకు పైగా ఓటర్లు ఉంటే.. ఆ ఎన్నికల్లో భారత కమ్యూనిస్టు పార్టీకి 16 , సోషలిస్టు పార్టీకి 12 సీట్లు వచ్చాయ్. వాటికి 3 .3 శాతం ఓట్లు దక్కాయ్. 2019 సాధారణ ఎన్నికల్లో సీపీఐ 2, సీపీఎం 3 సీట్లను గెలుచుకున్నాయ్. దేశంలోని 91 కోట్ల ఓట్లలో… అరశాతం జనాల మనసు కూడా గెలుచుకోలేకపోయాయ్. ఇది చాలు కామ్రేడ్ల పరిస్థితి చెప్పడానికి ! కేరళ తప్ప ఇప్పుడు ఎక్కడా కమ్యూనిస్టుల పాలన లేదు. దీనికి కారణం ఏంటంటే.. విలువలకు వలువలు వదిలేయడమే ! శ్రమజీవుల పక్షాన నిలబడి ఒకప్పుడు పోరాటం చేసిన పార్టీ.. ఇప్పుడు ఉనికి కోసం అడ్డదారులు తొక్కుతున్న పరిస్థితి.

ప్రతీ ఒక్కరికి స్వేచ్ఛ, సమానత్వం కోసం పోరాటాలు మొదలుపెట్టిన పార్టీ.. ఇప్పుడు రాజకీయంగా ఇంకో పార్టీ దగ్గర బానిసగా మారుతున్న దైన్యం. చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి. బీజేపీ అంటే కమ్యూనిస్టులకు అసలు గిట్టదు. మతతత్వ పార్టీ అని విమర్శలు చేస్తూ ఉంటారు కామ్రేడ్లు ఎప్పుడు ! మతం అని వాళ్లను విమర్శించి.. అవినీతి పార్టీలతో దోస్తీ అంటూ వత్సాసు పలుకుతున్న పరిస్థితి. పార్టీకి కలిసిరావడం లేదు.. అందుకే పొత్తులకు వెళ్తాం అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అన్నది కామ్రేడ్లే సమాధానం చెప్పాలి.

ఒంటరిగా పోటీ చేశారు.. ఓడిపోయారు.. ఏం జరుగుతుంది.. జనాల మనసులో గెలుస్తారు కదా ! అది వదిలేసి.. ఆత్మవంచన చేసుకొని పొత్తులు అంటూ సిద్ధాంతాలను పాతరపెట్టి.. సాధించేది ఏముంది అని ఇప్పుడు ప్రతీ ఒక్కరిలో మెదులుతున్న ప్రశ్న. పొరపాట్లు జరిగిన తర్వాత ఎలా ప్రవర్తిస్తారన్న దాని మీదే ఎవరి తెలివితేటలైనా ఆధారపడి ఉంటాయ్. ఈ రాజకీయ వ్యవస్థలో ఇమడలేక కమ్యూనిస్టులు కొన్ని పొరపాట్లు చేశారు. ప్రస్తుతం పార్టీ పరిస్థితికి అదే కారణం. మతం పేరుతో వాళ్లు చేసేది తప్పు అయితే.. పార్టీ కోసం అవినీతి పార్టీలతో పొత్తు పెట్టుకోవడం వీళ్ల తప్పు కూడా ! పార్టీలతో పొత్తులు అని లెఫ్ట్ పార్టీలు చివరి దశలో.. రాజకీయ వ్యభిచారిగా మారిపోతున్నాయని ఫైర్ అయ్యేవాళ్లూ ఉన్నారు మరి ! పోగొట్టుకోవడానికి ఏమీ లేని వాడిని మించిన ధైర్యవంతుడు ఉండడు.. ప్రస్తుతం కమ్యూనిస్టు పార్టీలు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాయ్.

ఇప్పుడే ధైర్యంగా అడుగులు వేయాలి. గొప్పవాడు ఎప్పుడూ ఒక నిర్ణయం తీసుకున్నాక అంకితభావంతో పనిచేస్తాడు. అది క్షురకర్మ అయినా.. పెద్ద కర్మ అయినా ! ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు చేయాల్సింది అదే. ఆత్మవంచన చేసుకొని.. పొత్తుల పేరుతో మరింత దిగజారితే.. జనం ఇంకాస్త చీదరించుకోవడం ఖాయం. ఏ సిద్ధాంతానికైనా అప్పుడప్పుడు కాలం కలిసిరాదు. జనాలపై ఏ భావజాలం స్వారీ చేస్తుందో దానిదే పైచేయి ఉంటుంది. కారణాలు ఏవైనా కమ్యూనిజం జనాలకు దూరమైంది. ఐతే నమ్మినవారిపై దాని గౌరవం కాపాడవలసిన బాధ్యత కూడా ఉంది. ప్రతీ ఒక్క కామ్రేడ్‌ గుర్తుంచుకోవాల్సింది అదే !