కమ్యూనిస్టులంటేనే పోరాట యోధులు. ఎక్కడ ఏ చిన్నా సమస్య ఉన్నా వాలిపోతుంటారు. ఆ సమస్యకు పరిష్కారం దొరికే వరకూ పోరాడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ప్రజల్లో పెద్దగా చైతన్యం లేకపోయినా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రజలను చైతన్యవంతులను చేసి పోరాటాలకు పురిగొల్పుతుంటారు. ప్రభుత్వాలపై పోరాటాలే ధ్యేయంగా కమ్యూనిస్టు పార్టీలు పని చేస్తుంటాయి. కార్మికులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు.. ఇలా ఎవరికి కష్టమొచ్చినా మొదట గుర్తొచ్చేది కమ్యూనిస్టులే. కానీ ఇప్పుడు కమ్యూనిస్టుల జాడ కనిపించడం లేదు.
తెలంగాణలో కొన్ని రోజులుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీ వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. పేపర్ లీకేజ్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్, వైఎస్సార్టీపీ లాంటి అనేక పార్టీలు పెద్దఎత్తున పోరాడుతున్నాయి. ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. పేపర్ లీకేజీలో ప్రభుత్వ పెద్దల హస్తముందని ఆరోపిస్తున్నాయి. దీనిపై కలిసికట్టుగా ప్రజాపోరాటాలకు సిద్ధమవుతున్నాయి. వాస్తవానికి ఇలాంటి విషయాల్లో ప్రతిపక్షాల కంటే ముందు వామపక్షాలు ఈ పని చేస్తుంటాయి. కానీ ఈ సారి మాత్రం వామపక్షాల పార్టీల జాడే లేకుండా పోయింది.
పేపర్ లీకేజీల వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయో కూడా తెలియని అయోమయ పరిస్థితి. విద్యార్థులంతా రోడ్లపైకి వచ్చి వాళ్ల భవిష్యత్ కోసం ఉద్యమిస్తున్నారు. విద్యార్థి ఉద్యమాలకు వామపక్షాలే పురుడు పోసాయి. కానీ ఇప్పుడు అలాంటి విద్యార్థులను కూడా పూర్తిగా విస్మరించారు కమ్యూనిస్టు పార్టీల నేతలు. SFI, AISF లాంటి కమ్యూనిస్టుల పార్టీల అనుబంధ విద్యార్థి సంఘాలు ఇప్పుడు ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయో చూస్తున్నాం. కమ్యూనిస్టుల్లో వచ్చిన ఈ మార్పును చూసి సొంత పార్టీ నేతలే ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి వాళ్లను కమ్యూనిస్టులు అనొచ్చా అని ఛీత్కరించుకుంటున్నారు.
ముఖ్యంగా తెలంగాణలో కమ్యూనిస్టులు అధికార పార్టీ తాబేదార్లుగా మారిపోయారు. తమ ఉనికిని కాపాడుకునేందుకు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ ప్రజా ప్రయోజనాలను పూర్తిగా పక్కన పెట్టేశారు. ఎన్నికల్లో సీట్ల కోసం బేరసారాలు సాగించడం, అవసరమైనప్పుడు అధికార పార్టీకోసం విపక్షాలను టార్గెట్ గా చేసుకుని ఉద్యమించడం ఇప్పటి కమ్యూనిస్టులకు అలవాటైపోయింది. ఇలాంటి వాళ్లను చూసి.. వీళ్లా కమ్యూనిస్టులు అని ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఒకప్పుడు కమ్యూనిస్టులంటే ఉద్యమాల రూపకర్తలుగా పేరు. కానీ ఇప్పుడు కొన్ని పార్టీలకు కొమ్ముకాస్తూ వాళ్ల మోచేతి నీళ్లు తాగుతున్న తాబేదార్లు. ఇలాంటి వాళ్ల వల్లే పశ్చిమ బెంగాల్ లాంటి కమ్యూనిస్టుల కంచుకోటలు కూడా కనుమరుగైపోయాయి. ఇప్పుడు వామపక్షాల ఉనికే ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికైనా మరొకరికోసం కాకుండా తమ ఉనికికోసం, ప్రత్యామ్నాయ అజెండాతో పని చేసినప్పుడే వామపక్షాలకు ప్రయోజనం ఉంటుంది. లేకుంటే జీవితకాలం మరొకరి మోచేతీ నీళ్లు తాగుతూ ఉండాల్సిందే!