బీజేపీ మతతత్వ పార్టీ అని.. పెట్రోల్‌తో పాటు ఇతర నిత్యావసరాల ధరలు కేంద్రంలో మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఘోరంగా పెరిగిపోయాయని.. అందుకే కాషాయ పార్టీ కంటే కాంగ్రెసే మేలన్నది కొంతమంది వాదన! 2014 తర్వాత ధరలు పెరుగదల మాట నిజమే! బ్రెంట్ క్రూడ్ ధరలు పడిపోయినప్పుడు కూడా బీజేపీ పెట్రో మోత ఆపలేదన్నది అక్షరాల నిజమే! బీజేపీ పాలనలో పారిశ్రామికవేత్తలు తప్ప బాగుపడ్డ దిగువ, మధ్యతరగతి కుటుంబాలు చాలా తక్కువే. ఇవన్ని కాదనలేని సత్యాలు.! అయితే అంతకముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజలకు చేసిందేంటి? ఒకవేళ కాంగ్రెస్ అంత గొప్పగా పాలించి ఉంటే బీజేపీ అధికారంలోకే వచ్చేదే కాదు కదా! మరి సడన్‌గా కాంగ్రెస్ మంచిదెలా ఐపోయింది? ఇది బీజేపీపై ద్వేషమా? కాంగ్రెస్‌పై కొత్తగా పుట్టుకొచ్చిన ప్రేమా?
కాంగ్రెస్ వల్లే ఈ దుస్థితి:
ఓ మంచి లీడర్‌కు దేశాన్ని మార్చడానికి ఎంత సమయం కావాలి? ఐదేళ్లు..? పదేళ్లు..? ఏమో మోదీ అధికారంలోకి వచ్చి దాదాపు 10ఏళ్లు కావొస్తోంది! ఈ పదేళ్లలో అభివృద్ధి సంగతి అటు ఉంచితే దేశం నైతికంగా చాలా వెనక్కిపోయింది. భిన్న వర్గాల మధ్య ద్వేషభావం పెరిగిన కాలమిది. అయితే ఇదంతా బీజేపీ కారణంగానే జరిగిందనుకుంటే పప్పులో కాలేసినట్లే. అసలు దేశంలోని సకల దరిద్రాలకు పేటెంక్ హక్కులున్న ఏకైక పార్టీ ఇండియాలో కాంగ్రెస్ మాత్రమే! అసలు మత విద్వేషాలు రెచ్చగొట్టే సంస్క్రతికి బీజాలు పడింది కాంగ్రెస్ హయంలోనే..! అందుకే కదా నాటి కమ్యూనిస్టులకు ఈనాటికీ కాంగ్రెస్ అంటే పట్టరాని కోపం.
10ఏళ్లు=60ఏళ్లు? అంతా ఒక్కటే:
ఈ 10ఏళ్లలో మోదీ చేయలేనిది.. 60ఏళ్ల పాలనలో కాంగ్రెస్ చేసిందీ ఏంటంటే ప్రజలను మభ్యపెట్టడం. ఇప్పుడు బీజేపీ వేస్తున్న డైవర్షన్ పాటిటిక్స్ వాళ్లకేమీ ఆర్‌ఎస్‌ఎస్ క్లాసుల్లో చెప్పింది కాదు.. అప్పటి కాంగ్రెస్ ప్రధానులు, నేతల నుంచి నేర్చుకున్నవే ఇవ్వని. దేశాన్ని దాదాపు 60ఏళ్లు పాలించిన కాంగ్రెస్ అంత గొప్పగా రూల్ చేసి ఉంటే ఇప్పటికీ పేదరికం, అంటరానితనం ఎందుకున్నట్లు? నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు సైన్సుకు, ఇండస్ట్రీస్‌కు పెద్ద పీట వేసింది నిజమే కావొచ్చు.. మరి ఆయన మరణం తర్వాత ఆ స్థాయి నిర్ణయాలు ఎక్కడ? కాలంతో పాటు తీసుకున్న డిసిషన్లే కానీ కొత్తగా కాంగ్రెస్ చేసిందేముంది?
ఈ భజన మొదలైంది ఇందిరా టైమ్‌లోనే:
దేశంలో ఎవరూ ఏ గొప్ప విజయం సాధించినా నేటి బీజేపీ భక్తులు ఆ గెలుపును మోదీకి లింక్ చేస్తుంటారు. మ్యాచ్‌ను ఎవరూ గెలిపించినా క్రెడిట్లు కెప్టెన్‌వేనన్నట్లు ప్రతీ విజయంలోని మోదీకి క్రెడిట్లు ఇవ్వకపోతే వాళ్లకి రోజు గడవని పరిస్థితి. అయితే ఈ వ్యక్తి భజన కొత్తగా ఇప్పుడు మొదలైంది కాదు. నాటి ప్రధాని ఇందిరాని ‘దుర్గా’గా పిలిచేవాళ్లు. దేశ రాజకీయాల్లో వ్యక్తిపూజకు బీజం పడింది ఆమె ప్రధానిగా ఉన్నప్పుడే కదా! వ్యవస్థలపై ఇందిరాగాంధీ చేసిన పెత్తనంతో పొల్చితే నేడు సీబీఐ, ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలను తమ గుప్పిట్లో పెట్టుకున్న బీజేపీ చేస్తుంది చాలా చిన్న సైజు పెత్తనమే! చేసిన తప్పుకు శిక్ష అనుభవించకుండా దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించిన ఇందిరా ఆనాడే వ్యవస్థలను దుర్వినియోగం చేయడంతో హద్దు దాటిపోయారు. నిజానికి కాంగ్రెస్ పతనం ప్రారంభమైంది కూడా ఆ నిర్ణయంతోనే!
మతాల మధ్య చిచ్చుపెట్టేది కూడా కాంగ్రెసే:
ఇక మతతత్వ రాజకీయాల్లో కాంగ్రెస్‌ను మించిన పార్టీ లేనేలేదు.. సందర్భానికి తగ్గట్టుగా సున్నితమైన మత విషయాల జోలికిపోవడం ఆ పార్టీకి కొట్టిన పిండి. 1986లో బాబ్రి మసీద్ గొడవను గిల్లిందే రాజీవ్‌గాంధీ కదా! బాబ్రీ మసీదు తాళాలు తెరవడానికి ఆయన పచ్చజెండా ఎందుకు ఊపినట్లు? షా బానో కేసులో సుప్రీంకోర్టు తీర్పును రాజీవ్ గాంధీ ప్రభుత్వం తిరస్కరిస్తూ.. మధ్యతరగతి ప్రజలను, మేధావులను రెచ్చగొట్టడమే కాకుండా హిందూ మితవాదానికి, దాని మెజారిటీ దృక్పథానికి ఊతమిచ్చారు. ఇప్పుడు బీజేపీ హయంలో జరుగుతున్న మతతత్వ రాజకీయాల కంటే రాజీవ్ గాంధీ చేసింది తక్కువేమీ కాదు.
స్కాముల పార్టీ:
రఫేల్ స్కామ్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసినా…దానిపై ఇప్పటికీ అనేక అనుమానాలున్నాయి. ఈ డీల్‌లో నేరుగా పీఎంఓ జోక్యం ఉందని చాలా మంది జర్నలిస్టులు ఫ్రూఫులతో సహా బయటపెట్టారు. నిజానికి ఈ స్కామ్‌ను ప్రజల్లోకి తీసుకొచ్చిన వారే..నాడు రాజీవ్‌గాంధీ హయంలో జరిగిన బోఫోర్స్‌స్కామ్‌నూ బయటకు తీసుకొచ్చారు. అంటే అప్పుడు జరిగిందే మళ్లీ రిపీట్ అయ్యింది. ఇక 2004-09సమయంలో చాలా తక్కువ కాంట్రవర్శీలతో రూల్ చేసిన కాంగ్రెస్.. 2009-14మధ్య మాత్రం ప్రజల కష్టాలను రెట్టింపు చేసింది. ఇప్పుడు పెరిగిపోయిన నిత్యావసరాల ధరలకు బీజం పడింది ఆనాడే. అది చాలదన్నట్లు స్కాములు, అధిక ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య కాంగ్రెస్ డొల్లతన్నాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాయి. ఇంతటి ఘోరమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్‌పై బీజేపీపై ఉన్న ద్వేషం ప్రేమగా మారితే ముందుముందు మరిన్ని దారుణాలు తప్పవు.