Opposition Meet: ప్రతిపక్షాల భేటీ వచ్చే వారమే.. మరో 8 పార్టీల మద్దతు.. స్పష్టత వచ్చేనా..?

ఈ నెల 17, 18 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు. ఈ మేరకు పార్టీలకు ఆహ్వానం పంపారు. ప్రతిపక్షాల మహా కూటమికి మరో 8 పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.

  • Written By:
  • Publish Date - July 12, 2023 / 03:17 PM IST

Opposition Meet: రాబోయే ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడమే లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్ సహా వివిధ పార్టీలు కూటమిగా ఏర్పాటవుతున్నాయి. ఎలా కలిసి పని చేయాలి అనే అంశంపై చర్చించేందుకు సమావేశమవుతున్నాయి. ఇప్పటికే మొదటి దశ సమావేశం పాట్నాలో జరిగింది. ఇప్పుడు రెండో దశ సమావేశానికి బెంగళూరు వేదిక కానుంది. ఈ సమావేశాన్ని కాంగ్రెస్ ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 17, 18 తేదీల్లో ఈ సమావేశం జరుగుతుందని కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తెలిపారు.

ఈ మేరకు పార్టీలకు ఆహ్వానం పంపారు. ప్రతిపక్షాల మహా కూటమికి మరో 8 పార్టీలు కూడా మద్దతు ఇస్తున్నట్లు ఆయన చెప్పారు. 17న సాయంత్రం ఆరు గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ప్రతిపక్ష నేతల డిన్నర్ కార్యక్రమం ఉంటుంది. మరుసటి రోజు 18న ఉదయం 11 గంటల నుంచి సమావేశం తిరిగి ప్రారంభమవుతుంది. బీజేపీని ఎలా ఓడించాలి అనే అంశంపై మొదటి సమావేశంలో చర్చిస్తే.. దీనికి సంబంధించిన రోడ్ మ్యాప్‌పై తాజా సమావేశంలో చర్చిస్తారు. బీజేపీని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం, ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక వంటివి ఈ సమావేశంలో కీలకంగా చర్చించే అవకాశం ఉంది. అన్నింటికంటే ముఖ్యంగా కూటమిని ముందుండి నడిపించే కన్వీనర్ లేదా కోఆర్డినేటర్‌ను ఎన్నుకునే అవకాశాలున్నాయి.
అన్ని పార్టీలు కలిసొస్తాయా..?
మహాకూటమిగా ఏర్పడాలనుకుంటున్నప్పటికీ కొన్ని పార్టీల మధ్య సఖ్యత కుదరడం లేదు. ముఖ్యంగా కీలక పార్టీలైన కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య విబేధాలు కొనసాగుతున్నాయి. కొన్ని అంశాల్లో ఒకదాన్నొకటి విబేధించుకుంటున్నాయి. ఇలాంటి సమస్యలు పరిష్కారమైతేనే కూటమి నిలబడుతుంది. ఈ దిశగా కూడా పార్టీల మధ్య చర్చలు జరగాలి. ఇప్పటికైతే నితీష్ కుమార్‌తోపాటు మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్, తేజస్వి యాదవ్ వంటి నేతలు కూటమి విషయంలో సానుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్ తరఫున ఖర్గే, రాహుల్ గాంధీ, ఆమ్ ఆద్మీ తరఫున కేజ్రీవాల్ చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించుకోవాలి. ఈ కూటమిలో ఉన్న ఎన్సీపీలో సంక్షోభం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈసారి ఎన్సీపీ హాజరుకాకపోవచ్చు. కొత్తగా మరుమలర్చి ద్రవిడ మున్నేట్ర కళగం(ఎండీఎంకే), కొంగు దేశ మక్కళ్ కట్చి (కేడీఎంకే), విడుదలై చిరుత్తైగళ్ కట్చి (వీసీకే), కేరళ కాంగ్రెస్ (మణి), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్, కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (ఆర్ఎస్‌పీ) కూడా మహాకూటమికి మద్దతు ఇస్తున్నాయి. ఈ పార్టీల చేరికతో ప్రతిపక్ష కూటమి పార్టీల సంఖ్య 24కు చేరుకుంది. పార్లమెంట్ ఎన్నికల్లో మోదీని ఓడించడమే లక్ష్యంగా ఈ కూటమి పనిచేయబోతుంది.
సోనియా గాంధీ హాజరవుతారా..?
బెంగళూరులో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరిగే ప్రతిపక్ష కూటమి సమావేశానికి కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉంది. 17న సాయంత్రం జరిగే డిన్నర్ మీటింగ్‌కు రాహుల్ గాంధీతోపాటు సోనియా గాంధీ కూడా హాజరవుతారు. ఈ మేరకు సోనియా గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఒకవేళ సోనియా హాజరైతే ఈ సమావేశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుంది.