Telangana Congress: కోమటిరెడ్డి వ్యాఖ్యల డ్యామేజీపై కాంగ్రెస్ కవరింగ్‌..!

కోమటిరెడ్డి వెంకట రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ లో కల్లోలం రేపుతోంది. అయినా ఆయనపై చర్యలు తీసుకునే సీన్ ఆ పార్టీకి లేదు. పైగా పార్టీలోని సీనియర్లు ఆయన్ను వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

  • Written By:
  • Publish Date - February 16, 2023 / 06:55 PM IST

కోమటిరెడ్డి వ్యవహారం కాంగ్రెస్‌కు పెద్ద తలపోటుగా మారింది. మునుగోడు బైపోల్‌ తమ్ముడు రాజగోపాల్‌ను గెలిపించాలని మాట్లాడడం.. ఇప్పుడు హంగ్ ఖాయమని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తు అంటూ వ్యాఖ్యలు చేయడం.. హస్తం పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టేస్తోంది. ఇంత జరుగుతున్నా.. కాంగ్రెస్ నుంచి రియాక్షన్ ఉంటుందా అంటే.. అదీ లేదు. దీంతో తానేం మాట్లాడేసినా చెల్లుబాటు అవుతుంది అన్నట్లుగా కోమటిరెడ్డి ధోరణి కనిపిస్తోంది. అందుకే అధిష్టానానికే సవాల్ విసురుతున్నట్లు కనిపిస్తున్నారు.

ఇంత జరుగుతున్నా.. కోమటిరెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేంత ధైర్యం కాంగ్రెస్ హైకమాండ్ చేయడం లేదు. రాబోయే ఎన్నికల్లో అధికారంలోకి రావాలని అనుకుంటున్న పార్టీ… సీనియర్లు, అందులోను గట్టి నేతలపై యాక్షన్ తీసుకునే పరిస్ధితిలో లేదు. అధిష్టానం ఆ తీరే కోమటిరెడ్డికి అడ్వాంటేజ్‌గా మారినట్లు కనిపిస్తోంది. చర్యలు తీసుకోపోగా.. డ్యామేజ్ కంట్రోల్ కోసం కవర్ చేసే విధానం మరింత హాట్‌టాపిక్ అవుతోంది. కోమటిరెడ్డి అన్నది ఒకటి.. మీడియా చెప్పింది ఒకటి అంటూ.. మీడియా మీద తప్పువేసే ప్రయత్నం చేస్తూ.. కోమటిరెడ్డికి క్లీన్‌చిట్‌ ఇస్తున్నారు. వ్యతిరేకంగా మాట్లాడింది ఎవరైనా సరే.. కఠిన చర్యలు తప్పవనే కామెంట్లతో.. కోమటిరెడ్డి మాటల గాఢతను తగ్గించేందుకు ప్రయత్నిస్తూ.. పార్టీలో అయోమయానికి తెర దింపే ప్రయోగాలు చేస్తున్నారు.

ఐనా ఇది పెద్దగా వర్కౌట్ అయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. మాట్లాడింది మాట్లాడినట్లు ఆడియో, వీడియో విజువల్స్ అంత స్పష్టంగా ఉన్నా.. ఇది మీడియా తప్పు అంటే.. ఎవరు నమ్ముతారు చెప్పండి ! ఏమైనా కోమటిరెడ్డి వ్యాఖ్యలు బీజేపీకి కలిసివస్తున్నాయ్. పొత్తు నిజం కాకపోతే.. కోమటిరెడ్డి మీద చర్యలు ఏవి అని బండి సంజయ్ బహిరంగంగానే ప్రశ్నిస్తున్నారు. కోమటిరెడ్డి డ్యామేజీని కాంగ్రెస్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నా.. బీజేపీ మాత్రం తగ్గేలే లేదు. దీంతో హస్తం పార్టీకి మళ్లీ కష్టాలు తప్పేలా లేవన్నది చాలామంది అభిప్రాయం.