తెలంగాణ నుంచి (Telangana Congress) రాజ్యసభ (Rajya Sabha) అభ్యర్థులను ప్రకటించి కాంగ్రెస్(Congress). సీనియర్ లీడర్ రేణుకా చౌదరితో పాటు, యువనేత అనిల్ కుమార్ యాదవ్ (Anil Kumar Yadav) ను చాన్స్ ఇచ్చింది. రాబోయే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని.. కాంగ్రెస్ వ్యూహాత్మకంగా రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక చేపట్టినట్లు కనిపిస్తోంది. సీనియర్ నేతలను పక్కన పెట్టి మరీ.. యువ నేతకు అవకాశం కల్పించింది. ఇదే ఇప్పుడు హస్తం పార్టీతో పాటు.. రాజకీయవర్గాల్లో కొత్త చర్చకు కారణం అవుతోంది. మిగతా రాష్ట్రాల సంగతి ఎలా ఉన్నా.. తెలంగాణ నుంచి రాజ్యసభ చాన్స్ కోసం చాలామంది సీనియర్లు వేయికళ్లతో ఎదురుచూశారు. గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడు, అధిష్టానం పెద్దలకు వీరవిధేయుడిగా పేరు ఉన్న సీనియర్ లీడర్ వీహెచ్.. తనకే అవకాశం దక్కుతుందని చాలా ఆశలు పెట్టుకున్నారు. అలాంటి నేతను కాంగ్రెస్ పక్కనపెట్టేసింది.
దీంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. వీహెచ్ తాత సంగతి ఎలా ఉన్నా.. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ ఎంపిక చేయడం వెనక చాలా కోణాల్లోనే కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. గతంలో కేంద్రమంత్రిగా పనిచేసిన రేణుకా చౌదరి.. వచ్చే ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌కు పోటీ చేయాలనే ఆలోచనతో కనిపించారు. ఐతే రేణుక చౌదరిపై ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని మెజారిటీ కాంగ్రెస్ నాయకులు.. వ్యతిరేకంగా ఉన్నారు. దీంతో ఆమెను పోటీకి దించినా.. కాంగ్రెస్ నేతలే వ్యతిరేకంగా పనిచేసే అవకాశం ఉందని గుర్తించిన కాంగ్రెస్ అధిష్టానం వ్యూహాత్మకంగా రాజ్యసభకు పంపాలని నిర్ణయించుకుంది.
ఇక మాజీ ఎంపీ కుమారుడైన అనిల్ కుమార్ యాదవ్.. గత ఎన్నికల్లో ముషీరాబాద్ నుంచి పోటీ చేశారు. ప్రస్తుతం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న ఆయన.. సికింద్రాబాద్ నుంచి పోటీకి ఆసక్తి చూపించారు. ఐతే ఆ స్థానం నుంచి పోటీ ఎక్కువగా ఉండడంతో.. అనిల్‌ను కాంగ్రెస్‌ను రాజ్యసభకు పంపినట్లు తెలుస్తోంది. ఐతే ఇంత చిన్న వయసులో అతన్ని రాజ్యసభకు పంపడం ఏంటి అనే చర్చ కూడా జరుగుతోంది. ఐతే పార్టీలో గ్రూప్ తగాదాలకు బ్రేక్ చెప్పడమే టార్గెట్‌గా కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక కనిపిస్తోంది. అవకాశం దక్కిన వాళ్ల సంగతి సరే.. మరి ఆశలు పెట్టుకున్న వాళ్ల సంగతి ఏంటి అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయ్. ఈ ఒక్కసారి అవకాశం ఇస్తే.. ఇక రాజకీయాలను నుంచి రిటైర్ అవుతానని వీహెచ్ చాలాసార్లు అన్నారు. చాన్స్ వస్తుందని ఆశలు పెట్టుకున్నారు కూడా ! ఐతే ఇప్పుడు కాంగ్రెస్ హ్యాండ్ ఇవ్వడంతో ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారింది.